మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
కావలిఅర్బన్ : హైదరాబాదులోని ఫిలింనగర్లో నాసిరకంగా నిర్మిస్తున్న భవనం కూలి ఆదివారం మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జలదంకి కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక లత సినీ థియేటర్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఫిలింనగర్లో సినీ అసోషియేషన్ భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, నాశిరకంగా నిర్మించడం వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. భవనాన్ని నాశిరకంగా నిర్మిస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు అధికారులు భవన నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ట్రెజరర్ కోదండరామయ్య, గౌరవాధ్యక్షుడు మార్తాటి శ్రీరాములు, మల్లిఖార్జున, మాల్యాద్రి, శిల్పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.