family planning Surgery
-
కు.ని. విషాద ఘటన.. అయ్యో దేవుడా! ఈ పిల్లల బతుకులెట్లా?
మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు. అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తలకొరివి పెట్టిన మామ కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సర్పంచ్ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. మౌనిక పిల్లలు పిల్లల ఆమయాక చూపులు అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్ నాయక్‌తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ నాయక్ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్ నాయక్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు. మమత, ఇద్దరు పిల్లలు భర్తకు చేదోడువాదోడు ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్ గౌడ్లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్. వర్షిత్(4), విహాన్(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు, భర్త భోరున విలపిస్తున్నారు. -
కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. 35 గంటల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక రాష్ట్రంలో ఇంతటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మరణాలకు కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రాథమిక అంచనాకు రాలేమని తెలిపారు. కు.ని ఆపరేషన్లు కేవలం ఆడవారికే పరిమితమతున్నాయని, దీనివల్ల మహిళలకు ఇబ్బంది ఆవుతోందని తెలిపారు. తెలంగాణలో జరిగే కు. ని ఆపరేషన్లలో మగవారి శాతం కేవలం మూడేనేనని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్ ట్యూబెక్టమీ అంటే మహిళలకు లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చు. మహిళలకు రిస్క్.. అయితే, కుటుంబ నియంత్రణ కోసం మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ పురుషులకు చేసే వ్యాసెక్టమీ ఆపరేషన్‌తో పోల్చితే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కు.ని కోసం ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. మరోవైపు పురుషుల కంటే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. పురుషులు దూరంగా.. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదని.. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు. పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. చదవండి: కుడి చేతిపై లవ్ సింబల్.. భార్య ప్రవర్తనతో భర్త షాక్.. చివరికి ఏం చేశాడంటే? ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయినా కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా ఆపరేషన్లు విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం గమనార్హం. -
ఆ ఆపరేషన్ మాకోద్దు బాబోయ్ అంటోన్న పురుషులు.. ఎందుకంటే
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మగవారికే సులభం ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికి కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. 55 ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు జిల్లాలోని 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 6,236 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగ్గా అందులో కేవలం 24 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1,384 ఆపరేషన్లు జరగ్గా కేవలం 9 మంది పురుషులు మాత్రమే ముందుకు వచ్చారు. మగవారు ముందుకు రావాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. భార్యకు మరో ఆపరేషన్ అవసరం లేకుండా భర్త ముందుకొస్తే చాలా మంచిది. వేసెక్టమీపై మగవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి ఇష్టపూర్వకంగా ఆçపరేషన్ చేస్తాం. మగవారిలో మార్పు రావాలి. వారు జనాభా నియంత్రణలో భాగస్వాములు కావాలి. – కె.ఐశ్వర్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కు.ని.విభాగం భీమవరం ప్రభుత్వాసుపత్రి -
మహిళకు పదోసారి గర్భం: భర్తతో అదృశ్యం
టీ.నగర్: పదోసారి గర్భం దాల్చిన 52 ఏళ్ల మహిళ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు భయపడి భర్తతో అదృశ్యమైంది. దీంతో పోలీసులు సదరు మహిళ కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని పుదుకోటై జిల్లా అరంతాంగి సమీపం వేదియన్‌కుడికి చెందిన ఆనందన్ (55). భార్య ఆరాయి (52). ఈమెకు ఇది వరకే తొమ్మిది ప్రసవాలు ఇంట్లోనే జరిగాయి. ఒక బిడ్డ ప్రసవంలోనే మృతి చెందగా ఎనిమిది మంది సంతానం ఉన్నారు. వీరిలో నలుగురికి వివాహాలయ్యాయి. ఇదిలాఉండగా ఆరాయి మళ్లీ గర్భం దాల్చింది. ఇటీవల ఆమె సింగవనం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లింది. ఆమెను వైద్యులు పరిక్షించగా మధుమేహం, బీపీ ఉన్నట్లు తెలిసింది. మెరుగైన చికిత్సల కోసం ఆమెను పుదుకోటై ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలకు పంపారు. అక్కడ చికిత్స పొందిన ఆరాయి సొంత ఊరికి చేరుకుంది. ఆరాయికి ఆగస్టు 18న ప్రసవం తేదీగా వైద్యులకు తెలిసింది. డాక్టర్ అయ్యప్పన్ ఆధ్వర్యంలోని వైద్య బృందం గత నాలుగో తేదిన వేదియన్‌కుడికి వెళ్లి ఆరాయికి పరీక్షలు నిర్వహించారు. బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టేందుకు అంబులెన్స్ ద్వారా పుదుకోటై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. అయితే ఆనందన్, నిండు చూళాలైన భార్యతోపాటు అదృశ్యమయ్యాడు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని సమాచారం. వైద్యబృందం, రెవెన్యూ సిబ్బంది ఆరాయి, ఆమె భర్త కోసం అనేకచోట్ల గాలించినా వారి జాడ తెలియలేదు. డాక్టర్ అయ్యప్పన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగుడి పోలీసులు కేసు నమోదు చేసి ఆరాయి కోసం గాలిస్తున్నారు. 16 మంది పిల్లల కోసం ఆశ: దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆనందన్, అతని భార్యకు 16 మంది పిల్లలను కనాలన్న ఆశ ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారనే భయంతో ఆరాయి తన భర్తతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిపారు. మాతాశిశు సంరక్షణకు పథకం: ప్రసవం సమయంలో మాతాశిశు మరణాలను నిరోధించేందుకు సర్కరైయిల్ అక్కరై పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి విజయభాస్కర్ వెల్లడించారు.ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి రానున్న జనవరి 26 వరకు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా గర్భిణులకు రక్త పోటు, తదితర వైద్య పరీక్షలు జరిపి తగిన చికిత్స అందచేయనున్నట్లు తెలిపారు. -
ఇక్కడా బిలాస్ పూరే
ఒంగోలు సెంట్రల్: అపరిశుభ్రత ... కుక్కి మంచాలు ... కూలే స్థితిలో గది గోడలు ... పని చేయని ఫ్యాన్లు, సరిపడని మంచాలు ... చెట్ల కిందనో, లేదా షామియానాల మాటునో కునుకుపాట్లు ... ఇదీ ఒంగోలులోని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకోవడానికి వచ్చిన మహిళల బాధలు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో కు.ని. శస్త్ర చికిత్సలు వికటించి 12 మంది మహిళలు చనిపోవడంతో ఇక్కడ మహిళల్లో అభద్రతా భావం నెలకొంది. ప్రసవించిన 45 రోజుల అనంతరం ఈ ఆపరేషన్ చేయించుకోవాలి. అంటే వీరంతా బాలింతలుగానే ఉంటారు. ఓ వైపు పసి పాపకు లాలన... ఇంకో వైపు ఆపరేషన్ భయంతో తల్లడిల్లే ఆ తల్లికి ఎంతో ఊరట కావాలి. ‘బాలింతలమయ్యా ... కనికరించండయ్యా’ అంటూ జిల్లా కేంద్రంలోని ‘మాతా శిశు వైద్యశాల’ ఆవరణలో తిరుగుతున్న బాలింతల అభ్యర్థనలు పలువురిని కలిచి వేస్తుంది. ‘కుటంబ నియంత్రణ పాటించండి ... జాతి అభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ప్రభుత్వం ఆచరణలో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న దంపతులకు అనేక ప్రోత్సాహకాలు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లున్నా క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కనిగిరి, అద్దంకి, మార్కాపురం, చీరాలల్లోని ఏరియా ఆసుపత్రుల దుస్థితి మరింత ఆధ్వానంగా ఉంది. పీపీ యూనిట్ దుస్థితి ఇలా... ఒంగోలులోని పి.పి. (పోస్టు పార్టం యూనిట్ ) యూనిట్లో అరకొర వసతులు వెక్కిరిస్తున్నాయి. ఇక్కడ వేసెక్టమీ, ట్యూబెక్టమీ, డి.పి.ఎల్. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నెలకు దాదాపు 150కిపైగా జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ విభాగంలో సరైన, సరిపోయినంత పడకలు లేవు. ఫ్యాన్లు అలంకారప్రాయమే. వెలుతురు అంతంతమాత్రమే. డి.పి.ఎల్. శస్త్ర చికిత్సల క్యాంపు జరిగితే అప్పటికప్పుడు మడత మంచాలు తెప్పించి, టెంట్లు వేయించి ఆరు బయట చేయించేసి చేతులు దులుపుకుంటున్నారు. 80 మంది శస్త్ర చికిత్సల కోసం పేర్లు నమోదు చేసుకుంటే కేవలం 40 మడత మంచాలను మాత్రమే తెప్పించి ‘మమ’ అనిపిస్తున్నారు. దీంతో ఆవరణలో ఉన్న సిమెంటు బెంచీలు, ఫుట్‌పాత్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. ఒక పక్క తల్లి పాల కోసం చిన్న పిల్లల ఏడుపు, మరో పక్క కనీసం కుర్చోవడానికి కుర్చీలు లేక ఆ బాలింతలు పడే ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఇలా అయితే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కుడా హెచ్చుగా ఉంటుందని వైద్యులే చెబుతుండడం గమనార్హం. కూలేందుకు సిద్ధంగా... : శస్త్ర చికిత్సలకు నిలయమైన పి.పి. యూనిట్‌ను నిర్మించి 50 సంవత్సరాలు దాటిపోయింది. గోడల్లో పట్టిష్టత లేకపోవడంతో వర్షం పడితే చాలు నీళ్లతో తడిసి కూలేందుకు సిద్ధంగా ఉంది. మరమ్మతులు చేయకుండా కేవలం సున్నం వేసి వదిలేశారు. శ్లాబ్ పెచ్చులు ఊడి ఇనుప కడ్డీలు తుప్పు విదిలిస్తున్నాయి. ధియేటర్లో ఫార్మాలిన్తో శుభ్రం చేసిన అనంతరం ఇన్ఫెక్షన్ శాతం ఎంత ఉందో శాంపుల్స్ తీసి ల్యాబరేటరీకి పంపాలి. బాగానే ఉందంటూ ల్యాబ్ రిపోర్టులు వస్తేనే శస్త్రచికిత్సలు చేయాలి. ఇవేవీ పాటించకుండానే ఆపరేషన్లు కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే లేరు. ఇక్కడి కారిడార్ చాలా ఇరుకుగా, చీకటిగా ఉంటుంది. కనీసం ఫ్యాన్ సౌకర్యం కుడా లేదు. బాత్ రూంలోకి వెళ్లడం సరే... కనీసం సమీపంలోకి అడుగులు వేయాలంటేనే ఇక్కడివారికి భయం. అత్యాధునిక భవనాలున్నా... సమీపంలో ఉన్న మాతా శిశు వైద్య శాలలో, రిమ్స్ వైద్య కళాశాలలో అత్యాధునిక శస్త్ర చికిత్సల ధియేటర్లున్నా శిధిలావస్థలో ఉన్న పి.పి. యూనిట్నే ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మా కష్టాలు గట్టెక్కించాలని బాధితులు కోరుతన్నారు.