ఒంగోలు సెంట్రల్: అపరిశుభ్రత ... కుక్కి మంచాలు ... కూలే స్థితిలో గది గోడలు ... పని చేయని ఫ్యాన్లు, సరిపడని మంచాలు ... చెట్ల కిందనో, లేదా షామియానాల మాటునో కునుకుపాట్లు ... ఇదీ ఒంగోలులోని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసుకోవడానికి వచ్చిన మహిళల బాధలు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో కు.ని. శస్త్ర చికిత్సలు వికటించి 12 మంది మహిళలు చనిపోవడంతో ఇక్కడ మహిళల్లో అభద్రతా భావం నెలకొంది.
ప్రసవించిన 45 రోజుల అనంతరం ఈ ఆపరేషన్ చేయించుకోవాలి. అంటే వీరంతా బాలింతలుగానే ఉంటారు. ఓ వైపు పసి పాపకు లాలన... ఇంకో వైపు ఆపరేషన్ భయంతో తల్లడిల్లే ఆ తల్లికి ఎంతో ఊరట కావాలి. ‘బాలింతలమయ్యా ... కనికరించండయ్యా’ అంటూ జిల్లా కేంద్రంలోని ‘మాతా శిశు వైద్యశాల’ ఆవరణలో తిరుగుతున్న బాలింతల అభ్యర్థనలు పలువురిని కలిచి వేస్తుంది.
‘కుటంబ నియంత్రణ పాటించండి ... జాతి అభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ప్రభుత్వం ఆచరణలో సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న దంపతులకు అనేక ప్రోత్సాహకాలు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లున్నా క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కనిగిరి, అద్దంకి, మార్కాపురం, చీరాలల్లోని ఏరియా ఆసుపత్రుల దుస్థితి మరింత ఆధ్వానంగా ఉంది.
పీపీ యూనిట్ దుస్థితి ఇలా...
ఒంగోలులోని పి.పి. (పోస్టు పార్టం యూనిట్ ) యూనిట్‌లో అరకొర వసతులు వెక్కిరిస్తున్నాయి. ఇక్కడ వేసెక్టమీ, ట్యూబెక్టమీ, డి.పి.ఎల్. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నెలకు దాదాపు 150కిపైగా జరుగుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ విభాగంలో సరైన, సరిపోయినంత పడకలు లేవు. ఫ్యాన్లు అలంకారప్రాయమే. వెలుతురు అంతంతమాత్రమే. డి.పి.ఎల్. శస్త్ర చికిత్సల క్యాంపు జరిగితే అప్పటికప్పుడు మడత మంచాలు తెప్పించి, టెంట్లు వేయించి ఆరు బయట చేయించేసి చేతులు దులుపుకుంటున్నారు.
80 మంది శస్త్ర చికిత్సల కోసం పేర్లు నమోదు చేసుకుంటే కేవలం 40 మడత మంచాలను మాత్రమే తెప్పించి ‘మమ’ అనిపిస్తున్నారు. దీంతో ఆవరణలో ఉన్న సిమెంటు బెంచీలు, ఫుట్‌పాత్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. ఒక పక్క తల్లి పాల కోసం చిన్న పిల్లల ఏడుపు, మరో పక్క కనీసం కుర్చోవడానికి కుర్చీలు లేక ఆ బాలింతలు పడే ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఇలా అయితే ఇన్‌ఫెక్షన్‌లు సోకే ప్రమాదం కుడా హెచ్చుగా ఉంటుందని వైద్యులే చెబుతుండడం గమనార్హం.
కూలేందుకు సిద్ధంగా... : శస్త్ర చికిత్సలకు నిలయమైన పి.పి. యూనిట్‌ను నిర్మించి 50 సంవత్సరాలు దాటిపోయింది. గోడల్లో పట్టిష్టత లేకపోవడంతో వర్షం పడితే చాలు నీళ్లతో తడిసి కూలేందుకు సిద్ధంగా ఉంది. మరమ్మతులు చేయకుండా కేవలం సున్నం వేసి వదిలేశారు. శ్లాబ్ పెచ్చులు ఊడి ఇనుప కడ్డీలు తుప్పు విదిలిస్తున్నాయి.
ధియేటర్‌లో ఫార్మాలిన్‌తో శుభ్రం చేసిన అనంతరం ఇన్ఫెక్షన్ శాతం ఎంత ఉందో శాంపుల్స్ తీసి ల్యాబరేటరీకి పంపాలి. బాగానే ఉందంటూ ల్యాబ్ రిపోర్టులు వస్తేనే శస్త్రచికిత్సలు చేయాలి. ఇవేవీ పాటించకుండానే ఆపరేషన్లు కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే లేరు. ఇక్కడి కారిడార్ చాలా ఇరుకుగా, చీకటిగా ఉంటుంది. కనీసం ఫ్యాన్ సౌకర్యం కుడా లేదు. బాత్ రూంలోకి వెళ్లడం సరే... కనీసం సమీపంలోకి అడుగులు వేయాలంటేనే ఇక్కడివారికి భయం.
అత్యాధునిక భవనాలున్నా...
సమీపంలో ఉన్న మాతా శిశు వైద్య శాలలో, రిమ్స్ వైద్య కళాశాలలో అత్యాధునిక శస్త్ర చికిత్సల ధియేటర్లున్నా శిధిలావస్థలో ఉన్న పి.పి. యూనిట్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మా కష్టాలు గట్టెక్కించాలని బాధితులు కోరుతన్నారు.
ఇక్కడా బిలాస్ పూరే
Published Fri, Nov 14 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement