ఆ ఆపరేషన్‌ మాకోద్దు బాబోయ్‌ అంటోన్న పురుషులు.. ఎందుకంటే | Men Not Involving in Family planning Surgery | Sakshi
Sakshi News home page

ఆ ఆపరేషన్‌ మాకోద్దు బాబోయ్‌ అంటోన్న పురుషులు.. ఎందుకంటే

Published Mon, Aug 1 2022 11:02 AM | Last Updated on Thu, Aug 4 2022 2:42 PM

Men Not Involving in Family planning Surgery - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కు.ని.   (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు.
  
మగవారికే సులభం 
ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికి కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. 

55 ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు 
జిల్లాలోని 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 6,236 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగ్గా అందులో కేవలం 24 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1,384 ఆపరేషన్లు జరగ్గా కేవలం 9 మంది పురుషులు మాత్రమే ముందుకు వచ్చారు.  

మగవారు ముందుకు రావాలి 
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. భార్యకు మరో ఆపరేషన్‌ అవసరం లేకుండా భర్త ముందుకొస్తే చాలా మంచిది. వేసెక్టమీపై మగవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి ఇష్టపూర్వకంగా ఆçపరేషన్‌ చేస్తాం. మగవారిలో మార్పు రావాలి. వారు జనాభా నియంత్రణలో భాగస్వాములు కావాలి.  
– కె.ఐశ్వర్య, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, కు.ని.విభాగం భీమవరం ప్రభుత్వాసుపత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement