నితిన్‌కు లైన్ క్లియర్
నితిన్ హీరోగా నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సినిమాకు ఇప్పుడు లైన్ క్లియరైంది. ‘‘తమిళ వెర్షన్‌కు సంబంధించి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. అందుకే, ఇప్పుడు రిలీజ్ ప్లాన్‌లో పడ్డాం. ఈ నెల 19న తెలుగు వెర్షన్ పాటలు విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ కానుంది’’ అని తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న ప్రముఖ దర్శక - నిర్మాత గౌతమ్ మీనన్ వెల్లడించారు.
శనివారం నాడు హైదరాబాద్‌లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలు తెలిపారు. ప్రభుదేవా దగ్గర సహాయకుడిగా పనిచేసిన ప్రేమ్‌సాయి దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో తెలుగు వెర్షన్లో నితిన్ హీరో అయితే, తమిళ వెర్షన్ ‘తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్’(తమిళ్ సెల్వన్ - కొరియర్ సర్వీస్ అని అర్థం)లో జై కథానాయకుడు. రెండు వెర్షన్లలోనూ యామీ గౌతమ్ కథానాయిక.
కథ ఒకటే... ట్రీట్మెంట్లు వేరు!
చెన్నై నుంచి విమానంలో హైదరాబాద్‌కు వస్తూనే, నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన గౌతమ్ మీనన్ విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘‘ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో సిద్ధమై, ప్రేమ్‌సాయి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రెండు భాషల్లో ఏకకాలంలో చేస్తే బాగుంటుందనుకున్నాం. కథ ఒకటే అయినా, ఆ యా భాషా చిత్రాల మార్కెట్‌ను బట్టి కథ ట్రీట్మెంట్ను మార్చాం. అలాగే, కామెడీ కోసం తమిళంలో సంతానం, తెలుగులో ‘సత్యం’ రాజేశ్‌లను పెట్టాం’’ అని వివరించారు. అయితే, ‘ఏం మాయ చేశావే’లో లాగా తెలుగు వెర్షన్‌కు ఒక క్లైమాక్స్, తమిళ వెర్షన్‌కు మరో క్లైమాక్స్ లాంటివి చేయలేదని ఆయన చెప్పారు.
ముగ్గురు డెరైక్టర్ల మ్యూజిక్ మ్యాజిక్
‘‘చక్కటి నేరేషన్ ఉన్న చాలా స్వీట్ అండ్ సింపుల్ సినిమా ఇది. ఫస్టాఫ్ మంచి లవ్‌స్టోరీలా నడుస్తుంది. సెకండాఫ్‌లో మంచి థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది’’ అని గౌతమ్ మీనన్ చెప్పారు. నితిన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని, తమిళ వెర్షన్లో కన్నా తెలుగులో రొమాన్స్, ప్రేమ సన్నివేశాలకు ప్రాధాన్యమిచ్చారు. ‘‘అలాగే, నితిన్ మంచి డ్యాన్సర్ కాబట్టి, ఆ అంశాన్ని కూడా తెలుగులో వాడుకున్నాం.
తమిళ హీరో జై కామెడీకి పెట్టింది పేరు కాబట్టి, ఆ వెర్షన్లో దానికి పెద్ద పీట వేశాం. సినిమా నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా’’ అని గౌతమ్ మీనన్ అన్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్ ఈ చిత్రంలో 3 పాటలకు బాణీలిస్తే, నితిన్ కోరిక మేరకు ఒక పాటకు అనూప్ రూబెన్స్ బాణీ కట్టారు. ఇక, సందీప్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ‘‘నిజానికి, ఈ కథను ముగ్గురు నలుగురు హీరోలకు చెప్పాం. స్క్రిప్టు వినగానే నితిన్ చేద్దామన్నారు. ఇవాళ తమిళంతో పోలిస్తే, తెలుగు పెద్ద సినిమాగా అయింది’’ అని గౌతమ్ అభిప్రాయపడ్డారు.
ఆ టైటిల్ నితిన్‌దే! త్వరలోనే మరో పెద్ద హీరో సినిమా
హీరో పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే టైటిల్ కూడా తానే సూచించారట. అలాగే, ఎప్పటిలానే ఈ సినిమాలోనూ తన అభిమాన హీరోను ఉద్దేశిస్తూ, ఒక డైలాగ్ కూడా చెప్పినట్లు గౌతమ్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం నాగ చైతన్యతో తెలుగులో (ఇంకా టైటిల్ ఖరారు కాలేదు), శింబుతో తమిళం (‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’)లో స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 60 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. ఆ సినిమా కాగానే, త్వరలోనే ఒక పెద్ద హీరోతో సినిమాకు చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి మాట్లాడుతూ, ‘‘ఇది కేవలం రెండు గంటల అయిదు నిమిషాల్లో చకచకా సాగే సినిమా. అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. నితిన్ తండ్రి ఎన్. సుధాకరరెడ్డి సహకారంతో రిలీజ్ వ్యవహారాలన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు. మొత్తానికి, దాదాపు రెండేళ్ళ నుంచి వార్తల్లో నలుగుతూ వచ్చిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఎట్టకేలకు ప్రేక్షకులకు వినోదం డెలివరీ చేయడానికి రెడీ అయ్యాడన్న మాట!