బుక్ సెల్ఫ్
నేడు వరల్డ్ బుక్ డే
లంకంత ఇల్లు కట్టుకున్నా రాని ఆనందం లక్షణమైన లైబ్రరీని చూస్తే వస్తుంది అంటారు పుస్తక ప్రియులు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో గాలికే చోటు లేకుంటే ఇక లైబ్రరీలా..? అనే కొందరి ప్రశ్నకు అభిరుచి ఉంటే అన్నీ అవే వస్తాయి అనేది కొందరి సమాధానం. ఈ వాగ్వాదాల సంగతెలా ఉన్నా.. గృహమే కదా పుస్తక సీమ అన్నట్టు హోమ్ లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నవాళ్లు సిటీలో చాలా మందే ఉన్నారు. వారిలో ఇద్దరు నగర ప్రముఖులు పంచుకున్న తమ పుస్తక ఖజానాల పఠనాభిరుచుల విశేషాలివి..
ఇంట్రస్ట్ కొద్దీ పోగైన పుస్తకాలే లైబ్రరీని డిమాండ్ చేశాయంటారు యాడ్ కంపెనీ అధినేత , ప్రముఖ చిత్రకారుడు రమాకాంత్. ‘నా దగ్గర వేలాది పుస్తకాలున్నాయి’ అంటూ సంతోషంగా చెబుతారు. అందులో దాదాపు 80 శాతంపైగా చదివేశారు కూడా. ఆరో తరగతిలో ఉన్నప్పుడే 350 పేజీల ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ చదవడం ద్వారా చార్లెస్ డికెన్స్ వంటి గొప్ప రచయితను అవగాహన చేసుకోగలిగిన ఆయన ఆ తర్వాత ప్రతి దశలో తన పఠనాభిరుచికి పదును పెట్టుకుంటూనే వచ్చారు. ‘ఇంటర్‌లోనే ఫిలాసఫీ చదవడం మొదలుపెట్టా’నన్నారాయన నవ్వుతూ.
ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌లో తన భార్య సాయంతో లైబ్రరీలోని పుస్తకాలను కేటగారికల్‌గా తీర్చిదిద్దుకున్న రమాకాంత్.. కొత్తగా కట్టుకుంటున్న ఇంటిలో తొలి ప్రాధాన్యం లైబ్రరీకే ఇస్తానంటున్నారు. తానే కాదు పరిచయస్తులు ఎవరైనా సరే వచ్చి హాయిగా కొన్ని గంటల పాటు పుస్తకం చదువుకుంటూ కూర్చునేందుకు అనువుగా కొత్త ఇంట్లో ఒక పూర్తిస్థాయి హోమ్ లైబ్రరీ, రీడింగ్హాల్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
యూరోపియన్ సాహిత్యమంటే ఇష్టపడే రమాకాంత్.. తెలుగులో కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ దాకా విభిన్న శైలులున్న సుప్రసిద్ధ కవులు, రచయితల రచనలన్నీ ఓ పట్టు పట్టేశారు. రైటర్ కావాలనుకుని ఆర్టిస్ట్ అయ్యానంటున్న ఈ చిత్ర‘కాంతి’.. తన చిత్రలేఖన నైపుణ్యానికి సహజంగానే పుస్తక పఠనం దోహదపడిందని చెప్పారు. భవిష్యత్తులో రైటర్‌గా మారి తన కోరిక తీర్చుకోబోతున్న ఈ కాబోయే రచయిత.. చిత్రకళ మీదే తన తొలి రచన ఉంటుందన్నారు. సగటున రోజుకు 50 పేజీలు చదవనిదే నిద్రపోనంటున్న రమాకాంత్.. తన అభిమాన రచయితలు నగరానికి వస్తే కలవకుండా ఉండరు.
దృక్పథాన్ని మార్చేసింది..
‘చిన్నప్పుడు నా కోసం పేరెంట్స్ స్టోరీ బుక్స్ చదివేవారు. అలా నా జీవితంలో భాగమైపోయిన పుస్తకం.. నా జీవితాన్నే మార్చేసింది’ అంటారు సంధ్యారాజు. సంప్రదాయ నృత్యకారిణిగా నగరవాసులకు చిరపరిచితమైన సంధ్యారాజును బిజీ లైఫ్ నుంచి సేదతీర్చేది, పఠనంతో బిజీగా మార్చేదీ తన ఇంట్లో ఉన్న లైబ్రరీ. అమరచిత్రకథ వంటి పుస్తకాలు తన నృత్యసాధనలో సహకరిస్తే, ఇప్పుడు ఇంట్లో ఇచ్చే పార్టీలకు సైతం కొన్ని పుస్తకాలు సహకరించాయంటారు.
రిచర్డ్ డాకిన్స్ రాసిన సెల్ఫిష్ బీన్.. తన జీవిత దృక్పథాన్ని అమాంతం మార్చేసిందంటూ కృతజ్ఞతగా చెబుతారు. కార్ల్ సెగాన్ రాసిన కాస్మోస్, కార్ల్ జిమ్మర్ ఎవల్యూషన్.. ఇలా లైఫ్‌ని చూసే తన వ్యూని మార్చిన పుస్తకాల జాబితాలో చేరేవి మరికొన్ని కూడా ఉన్నాయంటారామె. ‘పుస్తకాలు నాకు కాలక్షేపంగా మాత్రమే మిగిలిపోకుండా అంతకు మించినవిగా మారడానికి నేను చదివిన గొప్ప గొప్ప రచనలే కారణం’ అంటారామె. మహాభారతం, రామాయణం వంటివి అద్భుతమైన రీతిలో అందించిన మాధవ్ మీనన్ వంటి భారతీయ రచయితలూ ఆమె ఫేవరెట్ రైటర్స్‌లో ఉన్నారు.
తనకే కాదు పక్షులను ఇష్టపడే తన హజ్బెండ్ కోసం, మూడేళ్ల తన కొడుక్కి కావల్సిన పుస్తకాలతో ఎప్పటికప్పుడు లైబ్రరీని అప్డేట్ చేసే సంధ్య.. లేటెస్ట్గా రిలీజైన వాటిలో బెస్ట్ సెల్లర్స్‌ను కొనడం కన్నా బాగా పాపులరైన బుక్స్‌ను తాను ఎంచుకుంటానన్నారు. ఆన్లైన్ ద్వారా కొంటే తక్కువ ధరలోనే నచ్చిన, యూజ్డ్ బుక్స్‌ను సొంతం చేసుకోవచ్చునంటూ బుక్లవర్స్కు సలహా ఇస్తున్నారు. అధికంగా చదివిన చాలా మందికి అనిపించినట్టే సంధ్యారాజు కూడా ప్రస్తుతం పుస్తకం రాయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే సహజంగానే అది నాట్యానికి సంబంధించిందే.
- సత్యబాబు