ఆవేదనలో అభిమానులు
సిడ్నీ/న్యూఢిల్లీ: అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన భారత్ సెమీఫైనల్లో దారుణంగా ఓడటంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఫైనల్స్‌కు చేరుకుని కప్‌ను గెలుచుకుంటుందని ఆశపడిన వారు ఈ షాక్‌తో తేరుకోలేకపోయారు. తమ ఆవేదనను కొందరు చేతల్లో ప్రదర్శించగా.. మరికొందరు భోరుమన్నారు. ధోని సొంత నగరం రాంచీలో పలువురు అభిమానులు తమ టీవీ సెట్లను వీధుల్లోకి తెచ్చి ధ్వంసం చేశారు. మరికొందరు టీమిండియా ఆటగాళ్ల చిత్రాలను దగ్ధం చేశారు. ఫైనల్ గెలిస్తే సంబరాలను ఏవిధంగా చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్న కొన్ని కుటుంబాలు విలపిస్తూ కనిపించాయి.
ధోని ఇంటి వద్ద భద్రత పెంపు
రాంచీ: సెమీస్‌లో ఓటమి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత కెప్టెన్ ధోని ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతంలో భారత్ ఓడిన సందర్భాల్లో అభిమానులు ఆటగాళ్ల ఇళ్లపై దాడులు చేశారు. దాంతో ధోని ఇంటికి రక్షణ కోసం ఎక్కువ మంది పోలీసులను కేటాయించినట్లు అధికారులు చెప్పారు.