మాఘమాసం మెగాచిందులు
మాఘమాసం వచ్చింది.. పెళ్లిళ్ల సీజన్ తెచ్చింది
మీ పెళ్లిళ్లు... మా పెళ్లిళ్లకు ఎవరొస్తారండీ బంధువులు తప్ప!
ఇంకొంచెం ఖర్చు పెడితే స్నేహితులు వస్తారు!
షారూఖ్‌ఖాన్ వస్తాడా? ఫరాఖాన్ డాన్స్ చేస్తుందా? షకీరా పాడుతుందా?
తోట తరణి ప్యాలేస్ వేస్తాడా? పసుపు కొట్టడానికి బంగారు రోకలి ఉంటుందా?
కన్యాదానం చేసేటప్పుడు కాళ్ల మీద ముత్యాలు ఒలుకుతాయా?
మంగళసూత్రంలో డైమండ్లు మెరుస్తాయా?
సినిమా ఇండస్ట్రీ అంతా దిగుతుందా? నాయకులంతా వరస కడతారా?
యేడాదికి సరిపోయే తిండి వడ్డించుకోగలరా?
పూలు యూరప్ నుంచి, పళ్లు జపాన్ నుంచి, దుస్తులు అమెరికా నుంచి దిగుమతి అవుతాయా?
మందు ఫ్రాన్స్‌నుంచి పారుతుందా?
అలాగైతేనే మాఘమాసం మెఘామాసం అవుతుంది!
పైసలోల్ల పెళ్లి పెద్దోళ్ల కళ్యాణంగా మారుతుంది!
ఇలాంటి పెళ్లిళ్లకి జీవితంలో మనల్ని ఎవరూ పిలవరు కానీ
కనీసం అలాంటి వెడ్డింగ్కార్డ్ని ఎక్కడైనా చూసి సంతోషపడదాం!!
ధనం.. విలాసాలకు చిరునామా! ఆకాశాన్ని పందిరిగా మలుస్తుంది! మబ్బులను వింజామరలను చేస్తుంది.. నక్షత్రాలతో తోరణాలు కడుతుంది.... భూదేవిని పీటలా పరుస్తుంది. సూర్యుడిని దివిటీగా వాడుతుంది. గ్రహాలను దిష్టిచుక్కలుగా పెడుతుంది. నెలవంకను వధువు జడలో తురుముతుంది. ముత్యాలను తలంబ్రాలుగా పోస్తుంది. కాసులతో దండలు అల్లుతుంది. పూలపారాణి పెడుతుంది. గాంధర్వులతో గాన కచేరి చేయిస్తుంది. అప్సరసలతో నాట్యప్రదర్శన ఇప్పిస్తుంది. ఆశీస్సులకు అతిరథ మహారథులను పిలుస్తుంది. బంగారు కానుకలు సమర్పిస్తుంది. నలభీములే నివ్వెరపోయే పంచభక్ష్యపరమాన్నాలు వడ్డిస్తుంది.
అవును ఇది డబ్బు చేసే మాయ! మయసభను మరిపించే ఆర్ట్ సెట్టింగ్‌ల మధ్య మోగే బాజాభజంత్రీలు! బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్!
పూలు.. పళ్లు.. బంగారు రేకులు..
పెళ్లి చూపులయిపోయి.. సంబంధం ఖాయం అయినప్పటి నుంచి మొదలవుతాయి.. ఈ వేడుకను ఘనంగా జరిపించేందుకు సన్నాహాలు. మన సంప్రదాయమూ దీన్నే వాడుకగా చేసింది. పెళ్లి తాలూకు వ్యవహారాలను పదహారు రోజులకు ఫిక్స్ చేసి! ఆ సంబరానికి నిశ్చితార్థం నాంది. దీన్నే పూలు.. పండ్లు అనీ పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. అందుకే ఆ పూలు.. పళ్లు ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటున్నాయి ఈ పర్వంలో. పూలకు బెంగుళూరు నుంచి యూరప్ వరకూ సాగుతోంది ప్రయాణం. పళ్లకూ అంతే! సిమ్లా టు యూరప్. ఈ ఆనందానికి తీపినద్దడానికి దేశంలోని చేయితిరిగిన షెఫ్స్ హాజరవుతున్నారు. పాలు, మలాయ్, పంచదార, డ్రైఫ్రూట్స్‌తో చేసిన స్వీట్లతో నిశ్చితార్థాన్ని తీయని జ్ఞాపకంగా మిగులుస్తున్నారు. చాలా నిశ్చితార్థ వేడుకల్లో దేశీ భోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు కుటుంబాలకు అచ్చ తెలుగు వంటకాలకే చవులూరుతున్నాయి. పులిహోర, దప్పళాలు, గారెలు, బూరెలు, పప్పు, పచ్చళ్లకే పొయ్యి రాజేస్తున్నారు. ఇందులో వెరైటీలు ఘుమఘుమలాడుతున్నాయి. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రింగ్! డైమండ్ జిలుగులకు తగ్గట్లేదు. పెరిగిన పైడి ధర, ఈ మధ్యకాలంలో మెకాలడ్డిన డిమోనిటైజేషన్ ఈ వెలుగులనేమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. లగ్న పత్రిక రాసే కార్యక్రమమూ లగ్జరీగానే సాగుతోంది. ఇదివరకైతే ఎంత ఉన్నత కుటుంబాలైనా పసుపు, కుంకుమ రాసిన కాగితం ముక్క మీద లగ్నాన్ని రాసుకునేవారు. అన్నిటికీ దర్జా వచ్చినట్టే దీనికీ వచ్చింది. బంగారు రేకుల మీద పెళ్లి ముహూర్తం ముద్రిస్తున్నారు. ఇలాంటి నిశ్చితార్థాలకు 50 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నట్లు వినికిడి.
పసుపు దంపుడు
విఘ్నేశ్వరుడి పూజ తర్వాత పసుపు దంపే కార్యక్రమాన్నీ అంతే కన్నులపండువగా జరిపిస్తున్నారు. గతంలో అయిదుగురు ముత్తయిదువలు కలిసిచేసే ఈ సందడి ఇప్పుడో సంబరం. పసుపు దంచే రోలూ, రోకలీ బంగారు పూత అలంకారంతో పసుపుతో పాటు ఒయ్యారాన్నీ చిందిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో రోకళ్లు జత కలుస్తున్నాయి. పడుచు పిల్లల డ్యాన్సులతో లోగిళ్లు మురుస్తున్నాయి. ఇది ఓ అయిదు కోట్ల వ్యవహారమేనట.
పెళ్లి పత్రికలు.. అభిరుచి చిత్రికలు
ఇందులో సృజనాత్మకతకు, ఖర్చుకి ఆకాశమే హద్దు. పెయింటింగ్ నుంచి ఛాయాచిత్రాల దాకా.. నాలుగు మూలల కార్డు ముక్క నుంచి వటపత్ర, తాళపత్ర గ్రంథం దాకా.. పాకెట్లో పట్టే సైజ్ నుంచి పెట్టెల్లో అమరే పరిమాణం దాకా చేతులకందుతున్నాయి. రకరాల డిజైన్స్‌లో.. మెటాలిక్ రంగుల్లో మెరిసిపోతున్నాయి. వీటి ఎంపికలో టేస్ట్, ఆర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నాయి. పదికోట్ల రూపాయల నుంచి ఖర్చు మొదలవుతుందట.
పెళ్లి పిలుపులు..
దగ్గరి వాళ్లను పిలవడంలో దర్జా.. వేలువిడిచిన వాళ్లను పిలవడంలో ఆధునికతా సంతరించుకుంటున్నాయి. అయినవాళ్లను పిలవడంలో ఉన్న హంగే వేరు. పెళ్లి పత్రికతోపాటు, బంగారు చిరు కానుక, డ్రైఫ్రూట్స్ తాంబూలంతో పిలుపులు అందుతున్నాయి. ఇంకొంత మందయితే ఆహ్వానాన్ని మాట, పాట, ఆటతో ఏకంగా వీడియో తీసి పంపిస్తున్నారు. దీని ఖర్చు కనీసంగా 30 కోట్లరూపాయలు.
సంగీత్..
నిజానికి ఇది ఉత్తర భారత సంప్రదాయం. డబ్బు ఎల్లలను చెరిపేస్తుంది అనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణాది సంపన్న కుటుంబాలూ దీన్ని దత్తత తీసుకున్నాయి. ఇప్పుడైతే మధ్యతరగతి పెళ్లి ఇళ్లూ ఈ సంగీత్ ఆలాపనను ఆలింగనం చేసుకుంటున్నాయి. పిల్లా, పెద్దా అందరూ అడుగులేసే ఆనంద సంబరం. సందడి సమయం. రిచ్ ఫ్యామిలీస్ ఇంట జరిగే పెళ్లిళ్లలోని సంగీత్ సెలబ్రేషన్స్‌లో షారూఖ్ ఖాన్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ స్టార్స్ వచ్చి స్టెప్స్ వేసి అలరిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ పారిశ్రామివేత్తలయితే తమ పిల్లల పెళ్లిళ్ల సంగీత్లకు ఏకంగా పాప్స్టార్స్నే దింపుతున్నారు. సినిమా స్టార్స్‌ను పిలిచే రేంజ్ పార్టీలకయితే 30 కోట్ల వరకూ వెచ్చిస్తున్నాయట.
మెహందీ..
పెళ్లికి కళ తెచ్చేది చేతుల్లో పండిన గోరింట, పాదాలకు పూసిన పారాణియే కదా! అందుకే ఆధునిక భారతంలో ఇదీ ఓ వేడుకే! ఓ పాతికేళ్ల కిందటి దాకా.. గోరింటాకు కోసం ప్రత్యేకమైన సంబంరం ఉండేది కాదు. పెళ్లి ముందు రోజు హడావిడిగా.. పెళ్లి కూతురి అరచేతులకు గోరింటాకు పెట్టేవారు అక్కలో, వదినలో, మరదళ్లో! ఇప్పుడలా కాదు.. మెహందీ డిజైనర్స్ వచ్చారు. ఈ డిజెన్స్ ఓ అభ్యాసం అయ్యాయి. కోర్స్‌లా మారాయి. అక్కడితో ఆగిపోలే.. నవీన కాలం గోరింటకు నవ రంగులను దిద్దుతోంది. ఎర్రటి పూతకు నల్లటి డైతో డైనింగ్ అద్దుతోంది. మధ్యలో బంగారు వర్ణాన్నీ నింపుతోంది. గోరింటాకు పెట్టడంలో సృజనాత్మకత, కళాత్మకత దేనికవే పోటీ పడుతున్నాయి. అరచేయిలోనే పూసే గోరింట ఇప్పుడు భుజాల దగ్గర నుంచి అరచేతుల నిండుగా పండి.. జఘనం మీదా వంపులు తిరిగి.. పాదాల పారాణి అవుతోంది. డిజైన్ బట్టి రేట్ నిర్ణయమవుతోంది. పెళ్లి కూతురు చేతులే కాదు.. ఆమె తాలూకు బంధువులందరి చేతులనూ ముద్దాడి రంగు పండిస్తోంది. ఇదీ పదికోట్ల రూపాయల వ్యవహారమే.
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు
ప్రీ వెడ్డిం VŠ సెర్మనీస్లో లాస్ట్ బట్ లీస్ట్ .. పెళ్లి కూతురుని, పెళ్లి కొడుకును చేయడం. కొన్ని కుటుంబాలు తమ హోదా చూపించుకోవడం కోసం సెలబ్రెటీలతో ఈ కార్యక్రమాన్నీ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వేడుకకూ దేవలయం, కోట వంటి సెట్లను వేయిస్తున్నాయి. మొత్తమ్మీద కొన్ని కోట్ల ఖర్చుతో ఈ సంప్రదాయానికి కొత్త కళను తెప్పిస్తున్నాయి.
పెళ్లి..
కావ్యాల్లో వర్ణించిన, కథల్లో చెప్పిన, సినిమాల్లో చూపించిన దానికంటే వెయ్యిరెట్లు వైభవంగా జరుగుతున్నాయి. కొబ్బరాకు పందిరి అల్లేవాళ్ల స్థానంలో సినిమా ఆర్ట్ డైరెక్టర్లు వచ్చి తిరుమలను తలపించే ఆలయ సెట్లను నిర్మిస్తున్నారు. రాజస్థాన్ మహళ్లను మరిపించే ప్యాలెస్‌లకు రూపమిస్తున్నారు. గుజరాత్ కోటలను తలదన్నే క్యాజిల్స్ని కడుతున్నారు. ఈవెంట్ మేనేజర్లు దానికో థీమ్‌ను ఇస్తున్నారు. ఫేమస్ ఫ్లారిస్ట్లు వచ్చి సొబగులద్దుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కోసం పాపులర్ డ్రెస్ డిజైనర్స్ పెళ్లి వస్త్రాలను డిజైన్ చేస్తున్నారు. జ్యువలరీ డిజైనర్స్ వాళ్ల జ్యువలరీని డిసైడ్ చేస్తున్నారు. స్టయిలిస్ట్‌లు జుత్తును సరిచేస్తున్నారు. బ్రైడ్ అండ్ బ్రైడ్గ్రూమ్కి పౌడర్ అద్ది, కాటుక చుక్క దిద్దేది మేనత్తలు కాదు ప్రముఖ మేకప్ ఆర్టిస్టులు! పెళ్లి జరిపించేది ఊళ్లో పంతుళ్లు కాదు.. వేద పండితులు. ఇక ఈ పెళ్లికి అవసరమయ్యే పూలు, పళ్లు, తమలపాలకులు.. అన్నీ విదేశీవే! ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూరప్ ఓన్లీ! భోజనాల దగ్గరా అసలు రాజీయే లేదు. గల్లీ ఫుడ్ నుంచి కాంటినెంటల్ దాకా అన్నీ ఉంటాయి. వచ్చినప్పటి నుంచీ వెళ్లిపోయేదాకా నోరూరిస్తూనే ఉంటాయి. ఒక్కోరకం వంటకానికి ఒక్కో షెఫ్ బృందం గరిటలు తిప్పుతుంది. శాస్త్రీయసంగీతంతో పాటు జాజ్ బ్యాండూ మిమ్మల్ని అలరిస్తుంది. క్లాసిక్‌తో పాటు క్యాజువల్ స్టెప్పులూ కనిపిస్తుంటాయి. వధూవరులకు మీరేం తెచ్చారని కాదు మిమ్మల్ని ఎంత సాదరంగా ఆహ్వానించి ఎంత ఘనంగా సాగనంపారన్నదే ఇక్కడ లెక్క. అందుకే రిటర్న్ గిఫ్ట్‌లూ పక్కాగా ఆ పెళ్లి రేంజ్‌లోనే ఉంటాయి. ఇంటికెళ్లి చూసుకుంటే అందులో బంగారమే బయటపడొచ్చు.. ముత్యమే మెరవచ్చు.. కాంజీవరం సిల్క్ సర్ప్రైజ్ చేయొచ్చు! ఒక్క ఈ వేడుకకే వంద నుంచి అయిదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారట.
పోస్ట్ వెడ్డింగ్ సెర్మనీస్..
వధువు, వరుడి ఇళ్లల్లో జరిగే సత్యనారాయణ వ్రతంతో మొదలవుతాయి. ఇంతకుముందు ఇదీ అయిన వాళ్ల మధ్యే నిరాడంబరంగా జరిగేది. ఇప్పుడు ఇదీ వేడుకే. 50 లక్షల ఖరీదు వ్యవహారం.
రిసెప్షన్..
అబ్బాయింట జరిగే సంబరం. అమ్మాయి ఇంట జరిగిన పెళ్లికి దీటుగా నిర్వహించే ప్రయత్నం కాబట్టి అంతే ఆడంబరంగా ఉంటోంది. పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ వచ్చి సందడి చేసి వెళ్తున్నారు. ఈ రిసెప్షన్ అలంకరణలోనూ ఆర్ట్డైరెక్టర్ల హస్తం ఉంటోంది. వస్త్రధారణలో డ్రెస్ డిజైనర్స్ అవసరముంటోంది. జ్యువెలరీ విషయంలో జ్యువెలరీ డిజైనర్స్ జోక్యం అనివార్యమవుతోంది. సేమ్.. గల్లి టు కాంటినెంటల్ ఫుడ్ స్టాల్స్.. గాన భజానా, డాన్స్‌ల హేల.. రిటర్న్ గిఫ్ట్స్ గోల... అమ్మాయి ఇంట జరిగిన పెళ్లిని మరిపించేట్టు సాగుతోంది. దీనికీ ఓ వంద కోట్ల నుంచి ఖర్చు మొదలవుతుందట.
పదహారు రోజుల పండుగ..
ఇది వధువు ఇంట్లో జరిగే కార్యక్రమం. మంగళ సూత్రంలో నల్లపూసలు గుచ్చి వధువు మెడలో వేస్తారు. ఇది వరకూ దీన్నీ అయిదుగురు ముత్తయిదువులతో సరిపెట్టేవారు. ఇప్పుడూ ఊరంత పండగ చేస్తున్నారు.
మంగళసూత్రం ఉత్త బంగారు తాడుతో సరిపెట్టుకోవట్లేదు. వజ్రాల జిలుగుల్నీ కోరుకుంటోంది. ఈ పదహారు రోజుల పండగతో పెళ్లి తంతంగం పూర్తయినట్టే!
గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆర్భాటానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. సంప్రదాయానికి అంతే పీట వేస్తున్నారు. పెళ్లిలో సరదాను ఎంత కోరుకుంటున్నారో.. తంతూ అంతే శాస్త్రోక్తంగా జరిగేలా చూస్తున్నారు.
విఘ్నేశుడికీ వైభోగమే...
ఏ శుభకార్యాన్నయినా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించడం ఆనవాయితీ. ఇదివరకైతే ఇది పెళ్లింటికే పరిమితమయ్యేది. మారిన కాలం దీన్నీ ఆర్భాటం చేస్తోంది. ఏ విఘ్నం కలగకుండా పెళ్లి పనులన్నీ సాఫీగా సాగిపోయేలా దీవించమని విఘ్నేశ్వరుడిని వైభోగంగా పూజిస్తున్నారు. కనీసం వంద మందికి పంక్తిలో భోజనం వడ్డిస్తున్నారు. సిమ్లా యాపిల్, చిలకలదిబ్బ తమలపాకులతో తాంబూలం ఇస్తున్నారు. ఖర్చు కోటి పై మాటే.
బ్యాచ్లర్స్.. బ్యాచ్లరెట్స్ పార్టీలు
త్వరలోనే జత కట్టబోతున్న అమ్మాయి, అబ్బాయి విడివిడిగా తమ స్నేహితులకిచ్చే పార్టీలివి. ఇదీ పాశ్చాత్య ధోరణియే. బీచ్, రిసార్ట్స్, హోటల్, టూర్.. అంటూ డెస్టినేషన్స్, కలర్, యాంబియెన్స్, డ్రెస్‌కోడ్ అంటూ థీమ్స్ ఈ పార్టీలకూ ఉన్నాయి. బిగ్ ప్యాట్ ఫ్యామిలీస్‌లోని వరులైతే దేశ సరిహద్దులు దాటి సీషెల్స్, మారిషస్, జమైకా వంటి తీర ప్రాంతాల్లో ఈ పార్టీలను సెలబ్రేట్ చేసుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. బ్యాచ్లర్స్ పార్టీలు పదేళ్ల కిందటి నుంచే హల్చల్ చేస్తున్నా.. వధువు తన స్నేహితులకిచ్చే బ్యాచ్లరెట్స్ పార్టీ ఒక అయిదేళ్ల కిందటి నుంచే ట్రెండ్‌గా మారింది. ఈ సరదా ఖరీదు పది కోట్ల రూపాయల వరకూ చేరుతోందట.
మచ్చుకు కొన్ని బిగ్ఫ్యాట్ వెడ్డింగ్స్...
350 కోట్ల పెళ్లి
ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీమిత్తల్ కూతురు వనీషాకు అమిత్ భాటియాతో 2004 లో పెళ్లయింది. వెర్సైల్స్‌లోని ఓ ప్యాలేస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఖర్చు 350 కోట్ల రూపాయలు. ఈ పెళ్లి సంగీత్‌లో షారూఖ్‌ఖాన్, అక్షయ్‌కుమార్, కైలి, ఐశ్వర్యరాయ్, జూహి చావ్లా, సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలు డాన్స్ చేశారు. ఫరాఖాన్ కొరియోగ్రఫి అందించారు.
500 కోట్ల పెళ్లి
ఇదీ లక్ష్మీమిత్తల్ కుటుంబ సభ్యులదే. లక్ష్మీమిత్తల్ సోదరుడి కూతురు సృష్టి మిత్తల్ పెళ్లి బార్సిలోనాలోని జాతీయ మ్యూజియం ‘కాటలాన్’లో జరిగింది. ఈ పెళ్లిలో విందుకోసం ఇండియా, థాయ్ ల్యాండ్ల నుంచి 200 మంది షెఫ్స్ను పిలిపించారు. 60 కిలోలున్న సిక్స్ టైర్ వెడ్డింగ్ కేక్‌ను తయారు చేయించారు.
10 మిలియన్ యూరోల పెళ్లి...
బ్రిటన్‌లో స్థిరపడ్డ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ప్రమోద్ అగర్వాల్ తన కూతురు వినీత పెళ్లిలో పాప్ స్టార్ షకీరాతో చిందేయించాడు. 2011, మేలో వెనీస్‌లోని శాన్ క్లెమెంట్ ప్యాలేస్ రిసార్ట్స్‌లో వినీతకు ముఖిత్ తేజతో ముడుముళ్లు పడ్డాయి. ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా 800 మంది అథిరథమహారథులు అతిథులుగా వచ్చారు. 72 గంటలపాటు నిరవధికంగా వేడుకలు జరిగాయి. షకీరా ఆట, పాట ఈ పెళ్లికే ప్రత్యేకతను తెచ్చాయట.
మోడర్న్ మ్యారేజెస్... రకాలు
పురాణాలు ఎనిమిది రకాల పెళ్లిళ్లను వివరించినట్టు.. ఈ మోడర్న్ఏజ్ కొన్ని రకాల పెళ్లిళ్లను వర్ణిస్తోంది.
డెస్టినేషన్ మ్యారేజ్: వీటికి నింగి, నేల, నీరే గమ్యాలు. వరల్డ్ ఫేమస్ ఐల్యాండ్స్‌లో ఈ వివాహాలు పందిరి అల్లుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఈ పెళ్లిళ్లకు పీటలు వేసుకుంటున్నాయి. ఆకాశంలో ప్యారాచ్యూట్ ద్వారా గాల్లో ఎగురుతూ జంటలు తలంబ్రాలు పోసుకుంటున్నాయి. చార్టర్ ప్లయిట్స్లో, హెలీకాప్టర్స్లోనూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నాయి. సముద్రగర్భంలో ఈదుతూ తాళి కట్టించుకుంటున్నాయి.
థీమ్ అండ్ కాన్సెప్ట్ మ్యారేజెస్: ఈకో ఫ్రెండ్లీ అని, కంప్లీట్ ట్రెడిషనల్ అని, వెజ్ థీమ్ అని ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఫోర్ట్ మ్యారేజెస్: అంటే రాజకోటలో పెళ్లి చేసుకోవడం. కోటలున్న ప్రాంతాలకే వెళ్లి నిజమైన కోటలోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల కోసం గుజరాత్, రాజస్థాన్‌లు చాలా డిమాండ్‌లో ఉన్నాయి.
ప్యాలేస్ మ్యారేజెస్: ప్యాలెస్ సెట్లో కాకుండా నిజమైన ప్యాలేస్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ చేసుకుంది ఇలాంటి పెళ్లినే. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలేస్‌లో ఆమె పెళ్లి జరిగింది. దీనికి డిమాండ్ ఉన్న ప్లేస్ ఏంటో వేరే చెప్పక్కర్లేదు కదా! అవును రాజస్థానే.
హోటల్ మ్యారేజెస్: దేశ, విదేశాల్లోని సెవెన్ స్టార్ హోటల్స్ ఈ పెళ్లిళ్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి.
బీచ్ మ్యారేజెస్: కేరళ కోవలం బీచ్ నుంచి కొంకణ్, గోవా తీరాలు దాటి యూరప్ సముద్ర తీరాలను వెదుక్కుంటూ వెళ్తున్నాయి ఈ వివాహాలు.
టూర్ మ్యారేజెస్: ఇందులో ఒక టూర్ ప్యాకేజ్ ఉంటుంది. పెళ్లిలోని ఒక్కో తంతును ఆ టూర్‌లోని ఒక్కో ఊళ్లో నిర్వహిస్తారన్నమాట.
పెళ్లి అయిపోయింది అన్నదాని కంటే ఎక్కడ అయింది, ఎలా అయింది అన్నదే వీళ్లకు ముఖ్యం. అందుకే ఖర్చు విషయంలో రాజీపడకుండా.. అభిరుచినే అందలమెక్కిస్తూ ఏడు సముద్రాలు దాటుతున్నారు.. ఆకాశాన్ని అంటుతున్నారు.. నీటిని చీల్చుకుంటూ వెళ్తున్నారు.