వనమాత ఇల్లు చల్లన.. నేలతల్లి పచ్చన
ఏడు ఎకరాల పొలం. సగం చేపల చెరువు,సగం పచ్చని పంటలు. పొలం మధ్యలో చిన్న దీవి.ఆ దీవిలో అందమైన పొదరిల్లు. నిద్ర లేచేది పొలంలోనే,రోజంతా శ్రమించేది పొలంలోనే. విశ్రమించేదీ పొలంలోనే. హరిత విప్లవం, నీలివిప్లవాలను ఇరుగుపొరుగున నడిపిస్తున్న రైతు ఆమె. పేరు దంతులూరి సత్యవతి, వయసు డెబ్భై రెండేళ్లు. ఊరు గుంటూరు జిల్లా, అమర్తలూరు మండలం, పెదపూడి గ్రామం.
భర్త వాసుదేవరాజు, సత్యవతి.. ఇద్దరే ఉంటారా ఇంట్లో. ఇంటి చుట్టూ ఉన్న పొలంలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లతోపాటు కొబ్బరి, అరటి, సపోటా, బత్తాయి, నిమ్మ, పైనాపిల్, మామిడి, పనస, బొప్పాయి, జామ, చెర్రీ వంటి పండ్ల చెట్లున్నాయి. వాటి మధ్యలో లవంగాలు, కలబంద, కొండపిండాకు, తిప్పతీగ, నేల ఉసిరి, వావిలాకు, తులసి, తుంగకాయలు, పిప్పళ్లు, కచోరాలు, నేలవేము, పెద్ద ఉసిరి వంటి ఔషధ మొక్కలున్నాయి. చింత, కర్రపెండలం, తమలపాకు, కందిమొక్కలు, రకరకాల కూరగాయల మొక్కలు అల్లం, పసుపు... ఇదీ అదీ అని చెప్పడానికి వీల్లేనన్ని రకాలున్నాయి. మామిడిలో ఆరు రకాలు, అరటిలో ఐదు రకాలున్నాయి. మామిడి అల్లం, నిమ్మగడ్డిని కూడా పెంచుతున్నారు.
ఇంకా ఆశ్చర్యంగా కుంచె చీపుళ్ల గడ్డి చెట్లు కూడా గట్ల మీద ఉన్నాయి. కరివేపాకు, తోటకూర, పెరుగు ఆకు, పాల ఆకు, మెంతి ఆకు, పుదీన, కొత్తిమీర వంటి వంటల ఆకులతోపాటు దవనం, మరువం వంటి సువాసన భరితమైన ఆకులు కూడా ఉన్నాయి. ఇన్ని రకాల చెట్లుంటే తేనెటీగలు ఊరుకుంటాయా. తేనెపట్టు పెడతాయి. వాటి నుంచి తేనె తీయించి స్వయంగా మందులు తయారు చేస్తారు సత్యవతి. తన పొలంలో ఉన్న ఔషధ మొక్కల గింజలు, ఆకులతో (32 రకాల దినుసులు) ఔషధనూనె తయారు చేయడంలో నేర్పరి ఆమె. ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చుండ్రు, సోరియాసిస్ పోవడానికి రకరకాల ఔషధాల కాంబినేషన్లో నూనెలు చేస్తారామె.
ఔషధాల ఆకులను మూడు గంటల సేపు ఉడికించి చల్లార్చి తైలాన్ని తీస్తారు. ముఖం మీద మచ్చలు పోవడానికి కూడా ఆమె దగ్గర ఓ ఫార్ములా ఆయిల్ ఉంది. దేహారోగ్యం కోసం మాదీఫల రసాయనం చేసి రుచి చూపిస్తారు. మేధో వికాసానికి సరస్వతి లేహ్యం చేసిస్తారు. అడిగిన వారికి వీటన్నింటినీ చేసివ్వడం ఆమెకిష్టమైన వ్యాపకం. ‘‘ఉచితంగా చేసివ్వడం ఎందుకు, ముంబయిలో వీటికి మంచి మార్కెట్ ఉంది, కేరళ వాళ్లు అమ్మేది వీటినే. ముంబయికి రండి’’ అని ఆహ్వానం వచ్చిందామెకి. ‘‘నా పొలాన్ని వదిలి ఎక్కడికీ వచ్చేది లేదు. నేను వీటిని డబ్బు కోసం చేయడం లేదు. ఇష్టం కాబట్టి చేస్తున్నాను. వ్యాపారం కోసం కాదు’’ అన్నారామె.
ఒంటికి రోజూ పని
ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా ఇన్ని పనులు చక్కబెట్టడం వెనుక ఆమె ఆరోగ్య రహస్యం రోజూ శ్రమించడమే. ఆమె ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తారు. ఏడు గంటలకు రాగి జావ తాగుతారు. పదకొండు గంటలకు భోజనం, మధ్యాహ్నం మూడు గంటలకు రాగి లేదా జొన్న అట్టు, సాయంత్రం ఐదు గంటలు దాటితే భోజనం. ఇది ఆమె రాత్రి భోజనం. మధ్యలో పండ్లు తీసుకుంటారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత తొమ్మిది లోపు నిద్రపోతారు. పాలిష్ పట్టని బియ్యపు వరి అన్నం, రాగి, జొన్న అన్నం తింటారా దంపతులు. ఎంత ఆశ్చర్యంగా అనిపించినా సరే. ఆమె మాంసం మానేసి యాభై ఏళ్లయింది, ఆరేళ్ల నుంచి చేపలు కూడా మానేశారు. ఏడాది కాలంగా గుడ్డునూ వదిలేశారు. ఇప్పుడామె పూర్తి శాఖాహారి. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల పొడ కూడా సోకని పూర్తి సేంద్రియ సేద్యం ఆమెది.
వ్యయసాయ ప్రస్థానం
ఈ వనమాత వ్యవసాయ కుటుంబంలో పుట్టి, వ్యవసాయ కుటుంబంలో అడుగుపెట్టి, సాగుతోనే జీవితాన్ని నిలబెట్టుకున్నారు. రెండు జతల ఎడ్లు, పాతిక గేదెలు, వంద గొర్రెలు, లెక్కపెట్టలేనన్ని కోళ్లు ఆమె ప్రపంచం. రాజుగారు (ఆమె భర్త) ప్రయాణించడానికి ఓ గుర్రం ఉండేది. ఆ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నారామె. ‘‘మాది బాపట్ల దగ్గర మంతెనవారి పాలెం. అన్ని రకాల పండ్లు తిన్న బాల్యం నాది. అత్తగారిల్లు తెనాలి దగ్గర చిన గాదెలవర్రు. నేను, నా భర్త 1967 నుంచి సొంతంగా సేద్యం చేస్తున్నాం. సత్తెనపల్లిలో పన్నెండెకరాలు కొని చెరకు, పసుపు వంటి రకరకాలు పండించాం. ఆ పొలాన్ని అమ్మేసి 1983లో పెదపూడికి వచ్చి ఏడెకరాల బంజరు భూమిని కొన్నాం. నేలను చదును చేసి, ఒక రూపానికి తెచ్చి సగం చేపల చెరువు పెట్టి, మిగిలిన పొలంలో సాగు చేస్తున్నాం. గట్ల వెంట నూట పాతిక కొబ్బరి చెట్లు పెట్టాం.
రకరకాల పంటలతో నిత్యం సాగులోనే ఉంటుంది మా భూమి. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో సదస్సులు పెట్టినప్పుడు ఇద్దరం వెళ్తాం. ఆ పుస్తకాల్లో చెప్పిన పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. అలా చేస్తున్నందుకు నాకు అవార్డు కూడా వచ్చింది. ‘సంప్రదాయ విజ్ఞానాన్ని ఆచరిస్తున్న మహిళా రైతు’ అని అవార్డు ఇచ్చారు. అంతకు ముందొకసారి మత్స్యశాఖ పరిజ్ఞాన సంస్థ (కాకినాడ) స్వర్ణోత్సవాల పుస్తకంలో (సావనీర్) ఉత్తమ మహిళారైతు అని నా గురించి రాశారు. నేను పుస్తకం చదవడానికి కంటి అద్దాలక్కర్లేదు. రోజంతా పొలంలో మరీ ఎక్కువగా తిరిగినప్పుడు మోకాళ్ల నొప్పులు వస్తాయి. నేను తయారు చేసుకున్న ఔషధ తైలంలో కర్పూరం కలిపి రాసుకుంటాను.
సాగు పాఠాలు
మా సాగును చూడడానికి అధికారులు వస్తుంటారు. మేము ఏయే పంటలు సాగు చేస్తున్నాం, ఎలా చేస్తున్నామని అడుగుతారు. పొలాన్ని ఫొటోలు తీసుకుని పోతారు. వ్యవసాయం చేస్తున్న కొత్త పిల్లలు పని సులువు కోసం చేయరాని పనులన్నీ చేసి నేలతల్లిని క్షోభ పెడుతున్నారు. తెగుళ్లను ఆపడానికి గుళికలు వేస్తే మట్టి విషమైపోతుంది. కలుపు మొక్కలు తీయడానికి కూలీలకు డబ్బులు లెక్క చూసుకుని తక్కువ ఖర్చులో పనిపూర్తవుతుందని కలుపు మందులు చల్లుతున్నారు. మందు చల్లితే కలుపు మొక్క ఒక్కటే పోతుందా, మట్టిలో జీవం కూడా పోతుంది. మొలకెత్తే గుణాన్ని హరించి వేశామంటే భవిష్యత్తు ఏమవుతుంది? భూమిని ఇలాగే బీభత్సంగా నాశనం చేస్తుంటే కొన్నాళ్లకు మట్టిలో బీజం వేస్తే మొలకెత్తడం మానేస్తుంది.
అప్పుడు జనం ఏం తిని బతుకుతారు? అందుకే మనకున్న మొక్కలన్నింటినీ కాపాడుకోవాలి, భూమి తల్లిని రక్షించుకోవాలి? నేను ఈ భూమితోనే పెరిగాను, ఇందులోనే బతికాను, హాయిగా జీవిస్తున్నాను’’ అన్నారు సత్యవతి.ఆమె పిల్లలు బెంగళూరు, బాపట్ల, హైదరాబాదుల్లో ఉన్నారు. వాళ్లు వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూనే వ్యవసాయం కూడా చేస్తున్నారు. మనిషి ఎంత ఎదిగినా నేల విడిచి సాము చేయకూడదు. పాదాలు నేల మీదనే ఉండాలి, నేల ఆధారంతోనే ఎదగాలి. అప్పుడే జీవితాల్లో సంక్రాంతి వెల్లివిరుస్తుంది... అని సత్యవతి నమ్ముతారు, ఆమె మాటలను ఆమె పిల్లలు విశ్వసిస్తున్నారు. ‘‘మా అమ్మలో మంచి రైతు, గొప్ప వైద్యురాలే కాదు సాగును ఆరోగ్యాన్ని కలగలిపి ఔషధాలతో ఆహారాన్ని తయారు చేసే ఎక్స్పర్ట్ కూడా ఉంది’’ అంటారు.
– వాకా మంజులారెడ్డి
పిల్లల ఆరోగ్యం తల్లి చేతిలో
ప్రతి ఒక్కరూ కాలంతోపాటు మారాల్సిందే. అయితే ఆ మార్పు మనకు మంచి చేసేదై ఉండాలి. మా చిన్నప్పుడు పండ్లతో చేసే జామ్‌ల గురించి తెలియదు. ఇరవై ఏళ్ల నుంచి నేను మా పొలంలో పండిన పండ్లతో జామ్‌లు చేస్తున్నాను. ఉసిరి, బొప్పాయి జామ్‌లు ఎప్పుడూ ఉంటాయి. కలబంద గుజ్జు, పటిక బెల్లం, గోధుమపిండి, నెయ్యి కలిపి హల్వా చేసి ఆడపిల్లలకు పెడతాను. అది తింటే గర్భాశయ సమస్యలు ఇట్టేపోతాయి. నా దగ్గర లేని మొక్క ఎక్కడ కనిపించినా తెచ్చుకుంటాను. బళ్లారి నుంచి గాయం ఆకు, శ్రీశైలం అడవుల నుంచి సరస్వతి ఆకు తీగలు తెచ్చుకున్నాను. నా దగ్గర నల్లమందు ఆకు కూడా ఉంది. ప్రకృతి మనకు నల్లమందు ఆకునిచ్చింది మత్తు కోసం కాదు, వైద్యం కోసం.
ఆ ఆకుని పూత మందుల్లో వాడితే గాయం ఇట్టే మాడిపోతుంది. నేలతల్లి మనకు అన్నీ ఇచ్చింది. ఆ నేలతల్లిని కాపాడుకోవాలి. మంచి పంటల్ని పండించుకుని, చక్కగా వండుకుని తిని హాయిగా బతకాలి. రోజంతా ఒంటిని కష్టపెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలి. అంతే తప్ప... తల్లులు టీవీల ముందు కూర్చుని పిల్లలకు అడిగినంత డబ్బిచ్చి బేకరీలకు పంపిస్తే వాళ్లు మంచి తిండి తింటారా? పిల్లల ఆయుష్షు పెంచడం, తుంచడం తల్లి చేతిలోనే ఉంది. సిటీల్లో నేల లేకపోతే కుండీలోనే చిన్న వేపమొక్కను పెట్టి, రోజూ నాలుగు ఆకులు తింటుంటే పిల్లలకు పళ్లు పాడవుతాయా?