చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు.
స్కామ్ ఏమిటి?
మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్‌కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం.
ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది.
కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్‌లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్‌లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది.
సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట
ఢిల్లీ హైకోర్టు బెయిల్‌పై జోక్యానికి నో...
ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్‌కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది.
విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది.
ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి.