రైతు ద్రోహి చంద్రబాబు
అనంతపురం అర్బన్: అధికారం కోసం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత హామీలను విస్మరించిన చంద్రబాబు నాయుడు చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీనాయకులు విమర్శించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. యోగేశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా మాట్లాడారు.
ముఖ్యమంత్రి రైతుల సమస్యలను పట్టిం చుకోకుండా విదేశీ యాత్రలతో కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి, రైతన్న కన్నీళ్లను తుడుస్తానని చెప్పిన చంద్రబాబు సమాజంలో రైతులు మర్యాద లేకుండా చేశారన్నారు. మరో వైపు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూనే సవాలక్ష నిబంధనలతో మహిళలను మోసం చేశారన్నారు.
కోస్తా ప్రాంతంలో బంగారు పంటలు పండే భూములను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులైన మంత్రి నారాయణ, సుజానాచౌదరి, సీఎం రమేష్ చేతుల్లో బాబు కీలుబొమ్మగా మారారన్నారు. కరువు జిల్లాలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న ‘రైతు దీక్ష’తో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో గుబులు రేగుతోందన్నారు.
రైతు దీక్షకు తరలిరండి: రైతన్న సమస్యలపై పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టనున్న 48 గంటల రైతు దీక్షకు వేలాదిగా రైతులు తరలి రావాలని బి. యోగేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు, అన్ని వర్గాల వారు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గౌస్ బేగ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, నగర యువజన విభాగం అధ్యక్షులు ఎల్లుట్ల మారుతి నాయుడు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు జంగాలపల్లి రఫీ, గోపాలమోహన్, నగర అనుబంధ సంఘం నాయకులు శంకర, జయపాల్, పాల్గొన్నారు.