బెటర్ హాఫ్
పతి కోసం పడతి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. భర్త బాగోగుల కోసం నోములు నోస్తుంది.. వ్రతాలు చేస్తుంది. ఉపవాసాలు ఉంటుంది. శ్రావణ మాసం వచ్చిందంటే నెల రోజులూ దీక్షగా పూజలు చేస్తుంది. తన మాంగల్య బలమే.. పెనిమిటికి శ్రీరామ రక్షగా ఉండాలనే కోరికతో ఎంతటి కఠిన నియువూలనైనా పాటిస్తుంది. ‘ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే మాత్రం నాకు తెలియదు’ అని ఇల్లాలిని హెచ్చరించే ఇంటాయన ఇంటింటికీ ఉంటారు. అయితే వీరందరికీ భిన్నంగా కట్టుకున్నామె కోసం కడుపు మాడ్చుకుంటాం అంటున్నారు కొందరు. ఏడాదంతా తన బాగు కోసం తపించే భార్యామణి కోసం ఒక్క రోజు ఉపవాస దీక్షకు పూనుకుంటున్నారు.
కర్వా చౌత్.. తూర్పు, ఉత్తర భారతదేశంలో తరతరాలుగా వస్తున్న విభిన్న వేడుక. కార్తీక బహుళ చవితిన జరుపుకునే ఈ పండుగ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భార్యలు ఉపవాసం ఉంటారు. అయితే ఈ ఆచారాన్ని కాస్త మార్చి.. భార్యల మేలు కోరి భర్తలు ఉపవాసం ఉండటం మొదలైంది. దీనికి సామాజిక కోణాన్ని యాడ్ చేసి ఈసారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు (శనివారం) కర్వా చౌత్ సందర్భంగా ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెలగా లెక్కించే ఉత్తరాదిలో ప్రస్తుతం కార్తీక మాసం ఉంటే.. అమావాస్య నుంచి అమావాస్యకు నెలగా లెక్కించే దక్షిణాదిలో ఆశ్వయుజ మాసం అవుతుంది.
హీ ఫర్ షీ
అనాదిగా వస్తున్న కర్వా చౌత్ ఆచారాన్ని జెండర్ ఈక్వాలిటీ కోసం ఓ ప్రయత్నంగా మలచుకున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నివారణకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన ‘హీ ఫర్ షీ’ క్యాంపెరుున్ స్ఫూర్తితో షాదీ డాట్ కామ్ ‘ఫాస్ట్ ఫర్ హర్’ క్యాంపెరుున్కు శ్రీకారం చుట్టింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనసున్న మగాళ్లు.. నేడు ఉపవాసం ఉండటానికి సై అంటున్నారు.
వీ ఆర్ రెడీ
షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్ సోషల్ మీడియాలో విసిరిన ‘ఫాస్ట్ ఫర్ హర్’ సవాల్‌కు సెలబ్రిటీలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రైటర్ చేతన్ భగత్, టీవీ యాక్టర్స్ వరుణ్ బ డోలా, ిహ తేన్ తేజ్వానీ, సింగర్ సలీమ్ ఇలా చాలా మంది కర్వా చౌత్ నాడు ఉపవాసం చేస్తామని ప్రకటించేశారు. దేశవ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల మంది సతి కోసం ఉపవాసం చేసేందుకు సన్నద్ధమయ్యారు.
ఆల్ ఈజ్ వెల్
కర్వా చౌత్ రోజు ఓ కుండలో గోధుమలు ఉంచుతారు. ఉత్తరాదిలో ఇది గోధుమలు నాట్లు వేసే సీజన్ కావడంతో.. పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండే మహిళలు.. సూర్యాస్తమయం అయిన తర్వాత జల్లెడ అడ్డుగా ఉంచి చంద్రబింబాన్ని చూస్తారు. ఆ తర్వాతే ఉపవాస దీక్షను విరమిస్తారు.
నేనే నానినే..
కర్వా చౌత్ సందర్భంగా నేడు ఉపవాసం ఉంటున్నానని టాలీవుడ్ హీరో నాని ప్రకటించాడు. ‘పెళ్లికి ముందు నవరసాలంటే ఏంటో తెలియని నాకు.. అన్నీ తెలియజేసిన నీ కోసం.. ఒక రోజు ఉపవాసం ఉంటాను’ అంటూ భార్యపై తనకున్న ప్రేమను చెబుతూ నాని ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు.
- నాగరాజు