ఎయిర్ టెల్ కు షాక్ ఇచ్చిన జియో!
దేశంలో ఫాస్టెస్ట్ 4జీ సర్వీస్...
దేశంలో ఫాస్టెస్ట్ 4జీ సర్వీస్ తమదేనంటూ దాదాపు ఏడాది కిందటి వరకు ప్రముఖ మొబైల్ ఆపరేటర్ ఎయిర్ టెల్ యాడ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, తాజాగా దేశంలో ఫాస్టెస్ట్ 4జీ సర్వీస్ విషయంలో ఎయిర్ టెల్ ను రిలయన్స్ జియో అధిగమించింది. భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) డిసెంబర్ లో విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో అత్యంత వేగమైన 4జీ సర్వీసు ప్రొవైడర్ గా జియో నిలిచింది. గత ఏడాది అక్టోబర్ వరకు 4జీ సెవలలో అత్యంత నెమ్మదైన సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న జియో ఈమేరకు దూకుడు పెంచడం గమనార్హం.
దేశవ్యాప్తంగా నిర్వహించిన డాటా స్పీడ్ పరీక్ష వివరాలను ట్రాయ్ కు చెందిన 'మైస్పీడ్ ఆన్ లైన్' పోర్టల్ లో తాజాగా వెల్లడించింది. ఈ సమాచారం ప్రకారం ప్రస్తుతం 9.9 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో జియో 4జీ మొదటి స్థానంలో ఉండగా, 5.8 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. 4.2 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో వొడాఫోన్ మూడోస్థానంలో నిలిచింది. ఐడియా, రిలయన్స్, టెలినార్, సెల్ వన్, ఎయిర్ సెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక అప్ లోడ్ స్పీడ్ లో 2.8 ఎంబీపీఎస్ వేగంతో టెలినార్ మొదటి స్థానంలో ఉండగా, ఎంబీపీఎస్ స్పీడ్ తో జియో రెండోస్థానంలో ఉంది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో వచ్చిన జియో తాజాగా తన వినియోగదారులకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట వచ్చే మార్చ్ 31 వరకు ఉచితంగా వాయిస్ కాల్స్, డాటా, వీడియోకాల్స్, ఎస్సెమ్మెస్ ఆఫర్ కొనసాగించిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో రోజుకు ప్రతి వినియోగదారుడికి ఉపయోగించే 4జీ డాటా లిమిట్ 4జీబీ ఉండగా, తాజాగా దానికి 1జీబీకి కుదించింది. 1జీబీ తర్వాత 128కేబీపీఎస్ వేగంతో డాటా సర్వీసును అందించనున్నట్టు పేర్కొంది.