fat percentage
-
BMI: బీఎంఐతో ఆందోళన వద్దు!
బీఎంఐ... బాడీ మాస్ ఇండెక్స్.. ఈ నంబరు పెరిగితే అనారోగ్యమని నమ్ముతూ, భయపడుతూ బతుకుతున్నాం! అయితే ఆరోగ్యాన్ని బీఎంఐ ఆధారంగా అంచనా వేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం గురించి ప్రాథమిక అవగాహన కల్పించే పలు కొలతల్లో బీఎంఐ ఒకటి మాత్రమేనంటున్నారు... నంబర్లు మనిషి జీవితాన్ని శాసించే స్థితికి వచ్చాయి. అటు చదువు నుంచి ఇటు ఆరోగ్యం వరకు జీవితమంతా నంబర్లాటతోనే సరిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేలరీల భోజనం చేయాలి, ఇన్ని అడుగులు నడవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి అంటూ ప్రతి ఒక్కరిలో జ్ఞానం పెరిగిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో శరీరంపై శ్రద్ధ పెట్టేందుకు సమయం సరిపోనివాళ్లంతా ఇలాంటి నంబర్లను నమ్ముకొంటున్నారు. రోజుకు ఎన్ని అడుగులు నడిచాం, హృదయ స్పందన రేటు ఎలాఉంది, ఆక్సిజన్ స్థాయి ఎంత, ఎంతసేపు నిద్రించాం.. అనేవి లెక్కించడానికి స్మార్ట్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ప్రతిఒక్కరం తెలియకుండానే నంబర్ల రేసులో పరిగెడుతున్నాం. ఇలాంటి నంబర్లలో అందరినీ బెంబేలెత్తించేది బీఎంఐ.. బాడీ మాస్ ఇండెక్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో చెప్పే కొలత. ఇది కాస్త ఎక్కువైతే మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు. కానీ తాజా పరిశోధనలు మాత్రం బీఎంఐకి అంత సీన్ లేదంటున్నాయి. అసలు దీన్ని ఆరోగ్యంతో లింకు పెట్టి చూసే ధోరణి మానుకోవాలంటున్నారు పరిశోధకులు. ఇది అనేక ప్రాథమిక కొలతల్లో ఒకటని చెబుతున్నారు. ప్రభుత్వానికి సాయం కోసం బీఎంఐ అనే భావనను 1832 సంవత్సరంలో బెల్జియన్ గణాంకవేత్త లాంబెర్ట్ అడోల్ఫ్ క్విటెలెట్ రూపొందించారు. అప్పటి ప్రభుత్వానికి దేశ జనాభాలో అధిక బరువున్నవారి జనాభాను గుర్తించేందుకు క్విటెలెట్ ఈ బీఎంఐకి రూపకల్పన చేశారు. తర్వాత రోజుల్లో మనుషుల బరువు ఆధారంగా వారి బీమా ప్రీమియం లెక్కించేందుకు అవసరమైన సులభమైన కొలత అమెరికా బీమా కంపెనీలకు కావాల్సివచ్చింది. ఈ కంపెనీలు జనాభాలో సగటు బరువును లెక్కించేందుకు అనేక అశాస్త్రీయ పద్ధతులు వాడేవి. వీటితో విసుగొచి్చన యాన్సెల్ కీస్ అనే డాక్టరు దాదాపు 7వేల మందిపై క్విటెలెట్ సమీకరణంతో ప్రయోగం చేశారు. ఈ సమీకరణంతో సగటు జనాభా బరువు కనుక్కోవడం సులభమని గుర్తించి దీనికి బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అని నామకరణం చేశారు. తర్వాత రోజుల్లో మనిషి బరువు పెరిగితే అనారోగ్యమని గుర్తించడంతో పలువురు డాక్టర్లు తమ పేషెంట్ల సాధారణ ఆరోగ్య సూచీగా బీఎంఐని వాడడం ఆరంభించారు. ప్రస్తుతం డాక్టర్ల నుంచి జిమ్ ట్రైనర్ల వరకు అంతా దీన్ని నమ్ముకొని ఆరోగ్యంపై అంచనాలు వేస్తున్నారు. అదే ఫైనల్ కాదు.. ఎందుకంటే? బీఎంఐ ఎక్కువున్నంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు భావించవద్దని తాజా పరిశోధనలు సూ చిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామనేందుకు బీఎం ఐ గుర్తించని కొన్ని అంశాలున్నాయంటున్నాయి. - బీఎంఐలో బీఎఫ్పీ (బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్– శరీరంలో కొవ్వు శాతం) లెక్కింపు ఉండదు. ఇది కేవలం శరీర బరువును సూచించే కొలత మాత్రమే! అయితే అనారోగ్యమనేది బరువు వల్ల కాదు, శరీరంలోని కొవ్వు వల్ల వస్తుందని గుర్తించాలి. బీఎంఐ కొవ్వుకు, కండకు తేడాను గుర్తించదు. ఉదాహరణకు ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ బీఎంఐ ఓవర్‌వెయిట్ రేంజ్లో, ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ బ్రాడీ బీఎంఐ ఒబేస్ రేంజ్లో ఉన్నాయి. వీరిలో కొవ్వుకు, కండకు తేడాను బీఎంఐ గుర్తించకపోవడమే ఇందుకు కారణం. - శరీరంలో బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ (శరీరంలో కొవ్వు వ్యాప్తి)ని కూడా బీఎంఐ లెక్కించదు. శరీరంలో అన్ని కొవ్వు పదార్థాలు ఒకటి కాదు, వీటిలో చెడువి, మంచివి ఉంటాయి. ఉదాహరణకు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ, తుంటి వద్ద కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ అధికంగానే ఉంటాయి. కానీ వీరిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువున్నవారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికం. - బీఎంఐ జనాభా వైరుద్ధ్యాలు గుర్తించదు. ఆంగ్లోశాక్సన్లను ఉదాహరణగా తీసుకొని క్విటెలెట్ ఈ సమీకరణం రూపొందించారు. కానీ ప్రకృతి సహజంగా ఆయా భౌగోళిక ప్రాంతాల్లో మనుషుల మధ్య వైరుద్ధ్యాలు సహజం. ఉదాహరణకు ఆసియా జనాభాలో బీఎంఐ పెరిగితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి, కానీ పాలినేసియన్ జనాభాలో(పసిఫిక్ సముద్రంలోని కొన్ని దీవుల సముదాయాన్ని పాలినేసియా అంటారు) అధిక బీఎంఐ ఉన్నా ఆరోగ్యంగానే ఉంటారు. అందువల్ల బీఎంఐ అనేది ఆరోగ్యానికి సింగిల్ సూచిక కాదని, అనేక ప్రాథమిక కొలతల్లో ఇదిఒకటని నిపుణులు నిర్ధారిస్తున్నారు. మీ బీఎంఐ ఓవర్‌వెయిట్ లేదా ఒబేస్ రేంజ్లో ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అంతమాత్రాన పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. బీఎంఐ బాగా ఎక్కువుంటే ఇతర పరీక్షలు (లిపిడ్ ప్రొఫైల్ తదితరాలు) చేయించుకొని ఆరోగ్యంపై నిర్ధారణకు రావాలి. అంతేకానీ బీఎంఐ ఎక్కువైందన్న కంగారులో అనవసర డైట్ పద్ధతులు పాటించి కొత్త అనారోగ్యాలు కొనితెచ్చుకోవద్దన్నది నిపుణుల సలహా. ఇలా లెక్కిస్తారు.. ఆన్లైన్లో బీఎంఐని లెక్కించేందుకు పలు ఉచిత అప్లికేషన్లున్నాయి. బీఎంఐ లెక్కించేందుకు మీ బరువు, ఎత్తు తెలిస్తే చాలు! బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో అప్లికేషన్లో ఎంటర్ చేస్తే మీ బీఎంఐ ఎంతో సెకన్లలో తెలుస్తుంది. బీఎంఐ 18.5 కన్నా తక్కువుంటే అండర్‌వెయిట్ (ఉండాల్సినదాని కన్నా తక్కువ బరువు), 18.5– 24.9 ఉంటే నార్మల్, 25– 29.9 ఉంటే ఓవర్‌వెయిట్ (ఉండాల్సినదాని కన్నా అధిక బరువు), 30పైన ఉంటే ఒబేస్ (ఊబకాయం)గా వర్గీకరిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అబద్ధం చెప్పని ఓ అద్దం కథ!
అద్దమెప్పుడూ అబద్ధం చెప్పదంటారు..మిగతావాటి సంగతి తెలియదుగానీ..ఈ అద్దం మాత్రం చెప్పదట..సత్యహరిశ్చంద్రుడిలా ఎప్పుడూ నిజమే చెబుతుందట.. కావాలంటే.. ‘స్నోవైట్’ కథలో అడిగినట్లు.. ‘మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్..’ అంటూ అడగండి.. నిజమే చెబుతుంది. ఇంతకీ దేని గురించి నిజం చెబుతుంది అని అడిగితే.. మీ గురించే అంటారు దీన్ని తయారుచేసిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ ‘నేక్డ్ ల్యాబ్స్’ ప్రతినిధులు.. ఇంతకీ మన గురించి ఇది చెప్పే ఆ నిజమేంటి? రోజూ పేపర్ తిరగేస్తే.. భారతీయులు బరువెక్కువున్నారు.. కొవ్వు శాతం ఎక్కువైంది.. దీనివల్ల ఆ జబ్బు వస్తుంది.. ఈ రోగం రావచ్చు అని వార్తలే వార్తలు.. కదా.. అందుకే ఓసారి మన శరీరం పరిస్థితేమిటి? ఎక్కడ కొవ్వు శాతం ఎక్కువైంది? ఒకవేళ తగ్గించుకోవడానికి మనం కసరత్తులు వంటివి చేస్తుంటే.. డైట్లు వంటివి పాటిస్తుంటే.. అవి నిజంగా పనిచేస్తున్నాయా? శరీరంలో నిజంగానే కొవ్వుతగ్గుతుందా లేదా పెరుగుతుందా? పెరిగితే.. ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి విషయాలకు సంబంధించిన ‘నగ్న’సత్యాన్ని ‘నేక్డ్’ అనే ఈ మ్యాజిక్ మిర్రర్ మన ముందుంచుతుందట. అదెలా? ముందుగా మనం అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవాలి. అది మనల్ని చుట్టూ తిప్పుతుంది.. ఇలా 20 సెకన్లపాటు చేస్తుంది. అంతలోనే ఆ అద్దం మన శరీరాన్ని స్కాన్ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్ తీసేస్తుంది. ఇందుకోసం ఇందులో ఇంటెల్ రియల్ సెన్స్ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతరం ఈ మ్యాజిక్ మిర్రర్‌తో అనుసంధానించి ఉండే స్మార్ట్‌ఫోన్ యాప్‌లోకి వివరాలు స్టోర్ అయిపోతాయి. వెంటనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్మాస్, ఫ్యాట్మాస్ వంటి వివరాలు వచ్చేస్తాయి. అప్పట్నుంచి ఈ అద్దం ఎప్పటికప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించి.. సమాచారాన్ని అందిస్తుంది. అంటే వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి.. ఆ నిర్ణీత కాలంలో కొవ్వు తగ్గిందా పెరిగిందా అన్న వివరాలను తెలుపుతుంది. ముఖ్యంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కండల వీరులకూ ఉపయోగపడుతుందని.. ఎక్కడ మజిల్ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి వివరాలనూ అందిస్తుందని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్ అని చెబుతున్నారు. సురక్షితమేనా? యాప్‌లో స్టోర్ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదముందని సైబర్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. డాటా హ్యాక్ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్ మాత్రమేనని.. అది ఎక్స్రేలాగ ఉంటుందని చెబుతున్నారు.. సంబంధిత యూజర్‌కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధర రూ. లక్ష. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయట.. ఇదండీ.. అబద్ధమే ఎరుగని ఓ అద్దం కథ.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
తిండి కలిగినా.. కండ లేదోయ్!
‘తిండికలిగితే కండకలదోయ్.. కండకలవాడేను మనిషోయ్’ అన్నారు గురజాడ అప్పారావు. కానీ రానురాను కండగలవారు కరువైపోతున్నారు దేశంలో. ప్రతి పదిమందిలో ఏడుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. దేశంలో 72 శాతం మంది కండరాల బలహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. ఇన్‌బాడీ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిలో 77 శాతం మందికి కండరాల బలహీనత ఉందని సర్వే తెలిపింది. హైదరాబాద్‌లో 75 శాతం (పురుషులు 78%, మహిళలు 72%) మందిలో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. దేశంలోని తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని వివరించింది. తూర్పు ప్రాంతాల్లో నివసించే మహిళల్లో ప్రమాదకర స్థాయిలో 80 శాతం మందికి కండరాల బలహీనత ఉందని చెప్పింది. దేహంలోని కండరాలను బలోపేతం చేయడంలో ప్రొటీన్లు కీలక భూమిక పోషిస్తాయి. అయితే 68 శాతం మంది భారతీయులు ప్రొటీన్ల లోపంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ప్రొటీన్ల లోపం వల్లే 50 ఏళ్లకు పైబడిన వారిలోనూ, మహిళల్లోనూ కండరాల బలహీనత ఉంది. తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎమినోయాసిడ్స్ అందుతాయి. అలా కండరాల్లో శక్తి పుంజుకుంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఒక కేజీ శరీర బరువుకి 0.8 నుంచి 1 గ్రాము ప్రొటీన్లు అవసరం ఉంటుంది. కొవ్వు కరిగించాల్సిందే.. భారతీయుల్లో 95 శాతం మంది శరీరంలో కొవ్వు పేరుకుపోయింది. అధిక బరువుకి మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ప్రధానమైన కారణం. వీరంతా కొవ్వు కరిగించుకోవాల్సిందే. అందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఒక్కటే మార్గం. 40 ఏళ్లు దాటిన వారిలో 97–98 శాతం మంది కొవ్వు తగ్గించుకోవాల్సి ఉంది. శరీరంలో ప్రధానంగా పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు, చర్మం కింద పేరుకునే కొవ్వు (సబ్‌క్యుటేనియస్ ఫ్యాట్, విసెరల్ ఫ్యాట్) అని రెండు రకాలైన కొవ్వులుంటాయి. వీటిలో ఏదీ అధికంగా ఉండ కూడదు. విసెరల్ ఫ్యాట్ పెరగడం మరింత ప్రమాదకరం. విసెరల్ ఫ్యాట్.. డయాబెటీస్, బీపీ, కేన్సర్, హృద్రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో విసెరల్ ఫ్యాట్ 1 నుంచి 20 శాతం ఉండాలి. కానీ దేశంలో 56 శాతం మందికి ఉండాల్సిన దానికంటే అధికంగా విసెరల్ ఫ్యాట్ పేరుకుపోయింది. 75 శాతం మహిళల్లో మరింత ప్రమాదకరంగా తయారైంది. 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారిలో కొవ్వు అధికంగా ఉండడంతోపాటు, కండరాలు బలహీనత ప్రమాదకరంగా ఉంది. కండరాల బలోపేతంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనం నొక్కి చెబుతోంది. రోజూ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తోంది. 9 నుంచి 10 గ్రాముల ప్రొటీన్లుండేలా చూసుకోవాలంటోంది. సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. దేశంలో ప్రతి పదిమందిలో ఏడుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. పౌష్టికాహార లేమి, వ్యాయామం చేయకపోవడమే ఇందుకు కారణం. 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో 72 శాతం కండరాలు శక్తిహీనం. ఉద్యోగస్తుల్లో 72 శాతం. ఉద్యోగాలు చేయని వారిలో 69 శాతం. హైదరాబాద్‌లో 75 శాతం, అహ్మదాబాద్‌లో 73 శాతం, లక్నోలో 81 శాతం, పట్నాలో 77 శాతం మంది కండరాలు బలహీనం. పట్నా మహిళల్లో అత్యధికంగా 80 శాతం మందికి కండరాల బలహీనత. 95 శాతం మంది భారతీయుల శరీరంలో కొవ్వు పేరుకుపోయింది. పొట్టభాగంలో కొవ్వుతో ఇబ్బంది పడుతున్న వారు 56 శాతం. 81 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మహిళల్లో 86 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
స్థూలంగా... సూక్ష్మంగా...
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. నూటికి తొంభైమందిలో స్థూలకాయ సమస్య ఈ కారణాలవల్లనే వస్తోంది. మిగిలిన పదిమందిలో ఎండోక్రైన్ సమస్యలు, జన్యుపరమైన అంశాలు, మందుల దుష్ర్పభావం వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయి. శరీరంలో కొవ్వు పురుషులలో 25 శాతం కంటే ఎక్కువగానూ, మహిళల్లో 35 శాతం కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లుగా పరిగణిస్తాం. స్థూలకాయం, దాని పరిష్కార మార్గాలపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అయితే వాస్తవాలేమిటో పరిశీలిద్దాం. అపోహ: స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి విదేశీయులకూ, భారతీయులకూ ఉపయోగించే ప్రమాణాలు ఒక్కటే. వాస్తవం: సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీయులకూ, భారతీయులకూ ఒకటి కాదు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి శరీర బరువును కిలోగ్రాములలో తీసుకొని, దానిని ఆ వ్యక్తి ఎత్తు (మీటర్లు) స్క్వేర్తో భాగిస్తే వచ్చే విలువే బీఎమ్ఐ. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు (ఆరడుగులు) అనుకుందాం. ఆ వ్యక్తి బీఎమ్ఐ 120 / 1.83 ్ఠ 1.83 = 35.8. ఇలా లెక్కించిన విలువను ఈ కింది బీఎమ్ఐ పట్టికతో పోల్చి చూసుకుంటే మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుస్తుంది. బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వుశాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనకు తక్కువ స్థూలకాయం ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్‌తో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుం చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగా, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. అపోహ: స్థూలకాయం అనేది శరీర అందానికి సంబంధించిన సమస్య మాత్రమే. వాస్తవం: నిజానికి స్థూలకాయ సమస్యను ఒక వ్యాధిగా పరిగణించాలి. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం మూలకారణం. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఇలా అనేక వైద్యపరమైన సమస్యలకు స్థూలకాయం మొదటిమెట్టు. అపోహ: పొట్ట చుట్టూ మాత్రమే కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరం కాదు. వాస్తవం: నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్, దాని ప్రాధాన్యం స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకు రోజువారీ పనులకు, అన్ని జీవక్రియలకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది. మనం తీసుకున్న ఆహారం పేగులలో జీర్ణమై, రక్తంలోకి చేరుతుంది. సగటున మనిషికి రోజుకు 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అవసరానికి మించి క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే, శరీర అవసరాలకు పోగా మిగిలిన శక్తిని శరీరం కొవ్వురూపంలోకి మార్చుకొని నిలువ చేసుకుంటుంది. అయితే శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఈ విలువను ‘సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటారు. ఉదాహరణకు 60 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల బరువు ఉన్నాడనుకుందాం. అంటే ఆ వ్యక్తి 60 కేజీల అదనంగా బరువున్నట్లు. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్‌పాయింట్ 60 కేజీలు. కొంతమంది తక్కువ తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంత మంది ఎక్కువ తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్న వ్యక్తుల్లో సెట్‌పాయింట్ ఎక్కువగా, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్ పాయింట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల (కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రీములు, స్వీట్లు, కేక్‌లు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కట్లు మొదలైన వాటివల్ల) సెట్‌పాయింట్ పెరుగుతుంది. ఒకసారి పెరిగిన సెట్‌పాయింట్ మళ్లీ తగ్గదు. ఈ సెట్‌పాయింట్ మన మనసు అధీనంలో ఉండదు. ఇది మన శరీర ఉష్ణోగ్రత సెట్‌పాయింట్ లాంటిదే. మన శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్హీట్గా సెట్ అయి ఉంటుంది. దీనిని మనసులో అనుకుని మనం ఎలా మార్చలేమో, అలాగే ‘సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ను కూడా మార్చలేము. ఈ సెట్‌పాయింట్ జీర్ణవ్యవస్థలో తయారయ్యే కొన్ని హార్మోన్ల అధీనంలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి గ్రెలిన్, జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1). గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచే హార్మోన్. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై ఆకలి పెరుగుతుంది. కడుపునిండా ఆహారం తీసుకుంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి తగ్గుతుంది. అలాగే చిన్న పేగు చివరి భాగంలో జీఎల్పీ-1 హార్మోన్ తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గించే హార్మోన్. చిన్నపేగు చివరి భాగంలోకి జీర్ణంకాని ఆహారం వస్తే జీఎల్పీ-1 ఎక్కువగా తయారై, ఆకలి తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి పెరుగుతుంది. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్ల నియంత్రణలో ఉంటుందన్నమాట. అపోహ: తక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు (వెరీ లో-క్యాలరీ డైట్) వల్ల స్థూలకాయం తగ్గించుకోవచ్చు. వాస్తవం: తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల వల్ల ఉపయోగం తాత్కాలికమే. మార్కెట్లో బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే హెర్బల్ ఆహారం లభ్యమవుతోంది. కానీ వీటివల్ల కొవ్వు సెట్పాయింట్లో మార్పు ఉండదు. ఈ పదార్థాలు వాడటం వల్ల కొంత బరువు తగ్గినప్పటికీ సెట్‌పాయింట్ ప్రభావం వల్ల ఆరునెలల నుంచి ఐదేళ్లలోపల మనం కోల్పోయిన బరువు తిరిగి పెరుగుతాం. అపోహ: బరువు తగ్గాలంటే లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం. వాస్తవం: ఈ పద్ధతులు బరువు తగ్గడానికి ఉపయోగపడవు. చాలామంది బరువు తగ్గించుకోడానికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి బాడీ షేపింగ్కు ఉపయోగపడే కాస్మెటిక్ ఆపరేషన్లు. ఇవి స్థూలకాయ సమస్యను పరిష్కరించలేవు. ఈ విధానాల వల్ల కూడా శరీరంలోని కొవ్వు సెట్పాయింట్లో మార్పు ఉండదు. డైటింగ్, వ్యాయామం ద్వారా బరువు తగ్గగలిగేవారికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం లేదు. అలా తగ్గలేని వారు లైపోసక్షన్, కూల్స్కల్ప్టింగ్ ద్వారా కూడా తగ్గలేరు. పైగా కొంతకాలం తర్వాత ఇంకాస్త బరువు పెరుగుతారు. అపోహ: బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు తగ్గడానికి మూలకారణం ఆహారం ఎక్కువగా తీసుకోలేకపోవడం. వాస్తవం: బేరియాట్రిక్ సర్జరీ జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లను మార్చి కొవ్వు సెట్పాయింట్ను తగ్గిస్తుంది. దీని కారణంగా బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీ కారణంగా కొవ్వును నియంత్రించే కొన్ని హార్మోన్లలో (గ్రెలిన్, జీఎల్పీ-1) మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల కొవ్వు సెట్‌పాయింట్ తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎక్కువ ఆహారం తినలేరు. కొన్ని ఆపరేషన్ల తర్వాత ఆహారం శరీరంలోకి ఇంకిపోయే ప్రక్రియ మందగిస్తుంది. ఈ రెండిటి కారణంగా బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి బరువు తగ్గడానికి అసలు కారణం హార్మోన్ల మార్పుల వల్ల కొవ్వు సెట్‌పాయింట్ తగ్గడమే. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. బేరియాట్రిక్ ఆపరేషన్ల తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. -నిర్వహణ: యాసీన్ అపోహ: డైటింగ్, వ్యాయామంతో బరువు తగ్గుతుంది. వాస్తవం: బీఎంఐ 30, అంతకంటే ఎక్కువగా ఉన్నవారిలో డైటింగ్, వ్యాయామం మాత్రమే బరువు తగ్గడానికి సరిపోవు. పరిమిత ఆహారం, వ్యాయామం స్థూలకాయం రాకుండా చూసుకోడానికి, ఫిట్నెస్ కాపాడుకోడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకసారి స్థూలకాయం వస్తే వీటిద్వారా మాత్రమే శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. నూటికి తొంభైమంది డైటింగ్, వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవడంలో విఫలమవుతారు. అయితే మొదట్లో కొన్ని కిలోలు బరువు తగ్గిచుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. డైటింగ్, వ్యాయామంతోనే స్థూలకాయం ఎందుకు తగ్గదంటే, ఇవి కొవ్వు సెట్పాయింట్ను మార్చలేవు. డైటింగ్ చేసే సమయంలో ఆహారం తక్కువగా తీసుకుంటాం. దీంతో కడుపు నిండదు. ఫలితంగా ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరిగి ఆకలి పెరుగుతుంది. అలాగే చిన్నపేగులలో తయారయ్యే ఆకలిని తగ్గించే జీఎల్పీ-1 హార్మోన్ ఉత్పత్తి తగ్గి, ఆకలి పెరిగిపోతుంది. కొవ్వు సెట్‌పాయింట్ ప్రభావం వల్ల డైటింగ్ చేసిన ప్రతిసారీ జీవక్రియలు నెమ్మదించి శక్తి వేడిరూపంలో బయటకువెళ్లడం ఆగిపోతుంది. డైటింగ్ ఒక సమయానికి మించి కొనసాగిస్తే ఈ మార్పులు విపరీతంగా పెరిగి ఆకలికి తట్టుకోలేక తెలియకుండానే తినేస్తారు. దీంతో తిరిగి బరువు పెరుగుతారు.