ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. నూటికి తొంభైమందిలో స్థూలకాయ సమస్య ఈ కారణాలవల్లనే వస్తోంది. మిగిలిన పదిమందిలో ఎండోక్రైన్ సమస్యలు, జన్యుపరమైన అంశాలు, మందుల దుష్ర్పభావం వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయి. శరీరంలో కొవ్వు పురుషులలో 25 శాతం కంటే ఎక్కువగానూ, మహిళల్లో 35 శాతం కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లుగా పరిగణిస్తాం. స్థూలకాయం, దాని పరిష్కార మార్గాలపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అయితే వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.
అపోహ: స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి విదేశీయులకూ, భారతీయులకూ ఉపయోగించే ప్రమాణాలు ఒక్కటే.
వాస్తవం: సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీయులకూ, భారతీయులకూ ఒకటి కాదు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) అనే ప్రమాణాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి శరీర బరువును కిలోగ్రాములలో తీసుకొని, దానిని ఆ వ్యక్తి ఎత్తు (మీటర్లు) స్క్వేర్‌తో భాగిస్తే వచ్చే విలువే బీఎమ్‌ఐ. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు (ఆరడుగులు) అనుకుందాం. ఆ వ్యక్తి బీఎమ్‌ఐ 120 / 1.83 ్ఠ 1.83 = 35.8. ఇలా లెక్కించిన విలువను ఈ కింది బీఎమ్‌ఐ పట్టికతో పోల్చి చూసుకుంటే మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుస్తుంది. బీఎమ్‌ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వుశాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనకు తక్కువ స్థూలకాయం ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్‌తో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుం చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగా, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి.
అపోహ: స్థూలకాయం అనేది శరీర అందానికి సంబంధించిన సమస్య మాత్రమే.
వాస్తవం: నిజానికి స్థూలకాయ సమస్యను ఒక వ్యాధిగా పరిగణించాలి. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం మూలకారణం. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఇలా అనేక వైద్యపరమైన సమస్యలకు స్థూలకాయం మొదటిమెట్టు.
అపోహ: పొట్ట చుట్టూ మాత్రమే కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరం కాదు.
వాస్తవం: నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్, దాని ప్రాధాన్యం
స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకు రోజువారీ పనులకు, అన్ని జీవక్రియలకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది. మనం తీసుకున్న ఆహారం పేగులలో జీర్ణమై, రక్తంలోకి చేరుతుంది. సగటున మనిషికి రోజుకు 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అవసరానికి మించి క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే, శరీర అవసరాలకు పోగా మిగిలిన శక్తిని శరీరం కొవ్వురూపంలోకి మార్చుకొని నిలువ చేసుకుంటుంది. అయితే శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఈ విలువను ‘సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటారు. ఉదాహరణకు 60 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల బరువు ఉన్నాడనుకుందాం. అంటే ఆ వ్యక్తి 60 కేజీల అదనంగా బరువున్నట్లు. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్‌పాయింట్ 60 కేజీలు. కొంతమంది తక్కువ తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంత మంది ఎక్కువ తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్న వ్యక్తుల్లో సెట్‌పాయింట్ ఎక్కువగా, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్ పాయింట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల (కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రీములు, స్వీట్లు, కేక్‌లు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కట్లు మొదలైన వాటివల్ల) సెట్‌పాయింట్ పెరుగుతుంది. ఒకసారి పెరిగిన సెట్‌పాయింట్ మళ్లీ తగ్గదు. ఈ సెట్‌పాయింట్ మన మనసు అధీనంలో ఉండదు. ఇది మన శరీర ఉష్ణోగ్రత సెట్‌పాయింట్ లాంటిదే. మన శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్‌హీట్‌గా సెట్ అయి ఉంటుంది. దీనిని మనసులో అనుకుని మనం ఎలా మార్చలేమో, అలాగే ‘సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ను కూడా మార్చలేము. ఈ సెట్‌పాయింట్ జీర్ణవ్యవస్థలో తయారయ్యే కొన్ని హార్మోన్ల అధీనంలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి గ్రెలిన్, జీఎల్‌పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1). గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచే హార్మోన్. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై ఆకలి పెరుగుతుంది. కడుపునిండా ఆహారం తీసుకుంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి తగ్గుతుంది. అలాగే చిన్న పేగు చివరి భాగంలో జీఎల్‌పీ-1 హార్మోన్ తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గించే హార్మోన్. చిన్నపేగు చివరి భాగంలోకి జీర్ణంకాని ఆహారం వస్తే జీఎల్‌పీ-1 ఎక్కువగా తయారై, ఆకలి తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి పెరుగుతుంది. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్ల నియంత్రణలో ఉంటుందన్నమాట.
అపోహ: తక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు (వెరీ లో-క్యాలరీ డైట్) వల్ల స్థూలకాయం తగ్గించుకోవచ్చు.
వాస్తవం: తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల వల్ల ఉపయోగం తాత్కాలికమే.
మార్కెట్‌లో బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే హెర్బల్ ఆహారం లభ్యమవుతోంది. కానీ వీటివల్ల కొవ్వు సెట్‌పాయింట్‌లో మార్పు ఉండదు. ఈ పదార్థాలు వాడటం వల్ల కొంత బరువు తగ్గినప్పటికీ సెట్‌పాయింట్ ప్రభావం వల్ల ఆరునెలల నుంచి ఐదేళ్లలోపల మనం కోల్పోయిన బరువు తిరిగి పెరుగుతాం.
అపోహ: బరువు తగ్గాలంటే లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం.
వాస్తవం: ఈ పద్ధతులు బరువు తగ్గడానికి ఉపయోగపడవు.
చాలామంది బరువు తగ్గించుకోడానికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి బాడీ షేపింగ్‌కు ఉపయోగపడే కాస్మెటిక్ ఆపరేషన్లు. ఇవి స్థూలకాయ సమస్యను పరిష్కరించలేవు. ఈ విధానాల వల్ల కూడా శరీరంలోని కొవ్వు సెట్‌పాయింట్‌లో మార్పు ఉండదు. డైటింగ్, వ్యాయామం ద్వారా బరువు తగ్గగలిగేవారికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం లేదు. అలా తగ్గలేని వారు లైపోసక్షన్, కూల్‌స్కల్ప్టింగ్ ద్వారా కూడా తగ్గలేరు. పైగా కొంతకాలం తర్వాత ఇంకాస్త బరువు పెరుగుతారు.
అపోహ: బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు తగ్గడానికి మూలకారణం ఆహారం ఎక్కువగా తీసుకోలేకపోవడం.
వాస్తవం: బేరియాట్రిక్ సర్జరీ జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లను మార్చి కొవ్వు సెట్‌పాయింట్‌ను తగ్గిస్తుంది. దీని కారణంగా బరువు తగ్గుతారు.
బేరియాట్రిక్ సర్జరీ కారణంగా కొవ్వును నియంత్రించే కొన్ని హార్మోన్‌లలో (గ్రెలిన్, జీఎల్‌పీ-1) మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల కొవ్వు సెట్‌పాయింట్ తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎక్కువ ఆహారం తినలేరు.
కొన్ని ఆపరేషన్ల తర్వాత ఆహారం శరీరంలోకి ఇంకిపోయే ప్రక్రియ మందగిస్తుంది. ఈ రెండిటి కారణంగా బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి బరువు తగ్గడానికి అసలు కారణం హార్మోన్ల మార్పుల వల్ల కొవ్వు సెట్‌పాయింట్ తగ్గడమే. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. బేరియాట్రిక్ ఆపరేషన్ల తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
-నిర్వహణ: యాసీన్
అపోహ: డైటింగ్, వ్యాయామంతో బరువు తగ్గుతుంది.
వాస్తవం: బీఎంఐ 30, అంతకంటే ఎక్కువగా ఉన్నవారిలో డైటింగ్, వ్యాయామం మాత్రమే బరువు తగ్గడానికి సరిపోవు.
పరిమిత ఆహారం, వ్యాయామం స్థూలకాయం రాకుండా చూసుకోడానికి, ఫిట్‌నెస్ కాపాడుకోడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకసారి స్థూలకాయం వస్తే వీటిద్వారా మాత్రమే శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. నూటికి తొంభైమంది డైటింగ్, వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవడంలో విఫలమవుతారు. అయితే మొదట్లో కొన్ని కిలోలు బరువు తగ్గిచుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. డైటింగ్, వ్యాయామంతోనే స్థూలకాయం ఎందుకు తగ్గదంటే, ఇవి కొవ్వు సెట్‌పాయింట్‌ను మార్చలేవు. డైటింగ్ చేసే సమయంలో ఆహారం తక్కువగా తీసుకుంటాం. దీంతో కడుపు నిండదు. ఫలితంగా ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరిగి ఆకలి పెరుగుతుంది. అలాగే చిన్నపేగులలో తయారయ్యే ఆకలిని తగ్గించే జీఎల్‌పీ-1 హార్మోన్ ఉత్పత్తి తగ్గి, ఆకలి పెరిగిపోతుంది. కొవ్వు సెట్‌పాయింట్ ప్రభావం వల్ల డైటింగ్ చేసిన ప్రతిసారీ జీవక్రియలు నెమ్మదించి శక్తి వేడిరూపంలో బయటకువెళ్లడం ఆగిపోతుంది. డైటింగ్ ఒక సమయానికి మించి కొనసాగిస్తే ఈ మార్పులు విపరీతంగా పెరిగి ఆకలికి తట్టుకోలేక తెలియకుండానే తినేస్తారు. దీంతో తిరిగి బరువు పెరుగుతారు.
స్థూలంగా... సూక్ష్మంగా...
Published Sat, Nov 23 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement