రక్తంలో చక్కెర నిల్వలు తగ్గడమే హైపోగ్లైసీమియా
దేశంలో పుడుతున్న ప్రతి 100 మందిలో 76 మందికి ఈ సమస్య
శిశువుల్లో 72 గంటల్లోపు చక్కెర నిల్వలు సాధారణ స్థాయికి తీసుకురాకుంటే ప్రమాదం
గర్భిణులకు పోషకాహారం అందకపోతే బిడ్డలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం
‘సాక్షి’తో ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్ డాక్టర్ బారో అగర్వాల్
సాక్షి, విశాఖపట్నం: నవజాత శిశువుల్లో చక్కెర స్థాయిలు తగ్గుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఈశాన్య రాష్ట్రాల ఎండోక్రైన్ సొసైటీ ఈసీ మెంబర్, వైద్య పరిశోధకురాలు డాక్టర్ అభామోనీ బారో అగర్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది ఈ హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడుతున్నారని వెల్లడించారు. శిశువుల్లో 72 గంటల్లో సాధారణ స్థాయిలకు చక్కెర నిల్వలు తీసుకురాకపోతే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఎండోక్రైన్ జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా డాక్టర్ బారో అగర్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. శిశువుల్లో హైపోగ్లైసీమియా లక్షణాలు, వ్యాధిని గుర్తించడం, చికిత్స పద్ధతులు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి వివరించారు.
హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుందంటే...
రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అని పిలుస్తారు. మెదడు, శరీరానికి ఇంధనంలా పనిచేసే ప్రధాన వనరు గ్లూకోజ్. నవజాత శిశువుల్లో అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది శిశువుల్లో వణుకు, చర్మం నీలంగా మారిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లికి సరైన పోషకాహారం అందకపోవడం, గర్భిణుల్లో మధుమేహం సరిగా నియంత్రించకపోవడం వల్ల ఎక్కువగా ఇది సంక్రమిస్తుంటుంది.
నెలలు నిండకుండా పుట్టినవారికి, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, వివిధ కారణాల వల్ల మందులు ఎక్కువగా వాడిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతుంది. ప్యాంక్రియాస్ కణితి వంటి ఇతర కారణాల వల్ల శిశువు మలం ద్వారా ఎక్కువ ఇన్సులిన్ బయటికిపోతుంది. ఇది కూడా ఓ కారణమేనని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రోజూ జన్మిస్తున్న వారిలో 25 శాతం మంది శిశువులు హైపోగ్లైసీమియా బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో 76 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది.
గర్భిణులే జాగ్రత్త వహించాలి
బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి గర్భిణులు అత్యంత జాగ్రత్తగా నడచుకోవాలి. అప్పుడే ఈ తరహా వ్యాధులు చిన్నారుల దరికి చేరవు. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవితం గడపాలి. చక్కెర స్థాయిలు సక్రమంగా ఉండేటట్లుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి.
ముందుగా గుర్తిస్తే మేలు
శిశువుల్లో హైపోగ్లైసీమియాను గుర్తించేందుకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం సాధారణ రక్త పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒకవేళ శిశువుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే దానిపై దృష్టిసారించాలి. పుట్టినప్పుడు తల్లి పాలు తాగిన తర్వాత 4 గంటల్లోపు గ్లూకోజ్ రీడింగ్ నమోదు చేయాలి. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటే వైద్యం అందించాలి.
తర్వాత 24 గంటల్లోపు చెక్ చేసుకోవాలి. అలా ప్రతి 12 నుంచి 24 గంటలకు ఒకసారి పర్యవేక్షిస్తూ 72 గంటల్లోగా సాధారణ స్థాయికి తీసుకురావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. పిల్లలు పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారుతుంది. దేశంలో కేవలం 55 శాతం మంది నవజాత శిశువుల్లో మాత్రమే ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. వీరికే సకాలంలో వైద్యం అందుతోంది. 45 శాతం మందికి ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అందుబాటులో అత్యుత్తమ వైద్యసేవలు
ఈ వ్యాధి బారిన పడిన శిశువులను 72 గంటల్లో ఆరోగ్యవంతులుగా మార్చేందుకు అనేక అత్యుత్తమ వైద్య సేవలు అందబాటులోకి వచ్చాయి. పుట్టిన శిశువు బరువు, నెలలు నిండాయా... లేదా..? ఇలా ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి వైద్యం అందిస్తుండాలి. అప్పుడే చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి.. శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుతాడు. గ్లూకోజ్ లెవెల్స్ మరీ దారుణంగా ఉన్న శిశువులకు 40శాతం డెక్ట్స్‌ట్రోస్ (చక్కెరలాంటి ఒక రూపం) జెల్‌ను నేరుగా నోటికి పూస్తారు. ఇలా వెద్య విధానాలు అందుబాటులోకి రావడం వల్లే చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. చిన్న వ్యాధే కదా.. అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment