అద్దమెప్పుడూ అబద్ధం చెప్పదంటారు..మిగతావాటి సంగతి తెలియదుగానీ..ఈ అద్దం మాత్రం చెప్పదట..సత్యహరిశ్చంద్రుడిలా ఎప్పుడూ నిజమే చెబుతుందట.. కావాలంటే.. ‘స్నోవైట్’ కథలో అడిగినట్లు.. ‘మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్..’ అంటూ అడగండి.. నిజమే చెబుతుంది. ఇంతకీ దేని గురించి నిజం చెబుతుంది అని అడిగితే.. మీ గురించే అంటారు దీన్ని తయారుచేసిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ ‘నేక్డ్ ల్యాబ్స్’
ప్రతినిధులు.. ఇంతకీ మన గురించి ఇది చెప్పే ఆ నిజమేంటి?
రోజూ పేపర్ తిరగేస్తే..
భారతీయులు బరువెక్కువున్నారు.. కొవ్వు శాతం ఎక్కువైంది.. దీనివల్ల ఆ జబ్బు వస్తుంది.. ఈ రోగం రావచ్చు అని వార్తలే వార్తలు.. కదా.. అందుకే ఓసారి మన శరీరం పరిస్థితేమిటి? ఎక్కడ కొవ్వు శాతం ఎక్కువైంది? ఒకవేళ తగ్గించుకోవడానికి మనం కసరత్తులు వంటివి చేస్తుంటే.. డైట్‌లు వంటివి పాటిస్తుంటే.. అవి నిజంగా పనిచేస్తున్నాయా? శరీరంలో నిజంగానే కొవ్వుతగ్గుతుందా లేదా పెరుగుతుందా? పెరిగితే.. ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి విషయాలకు సంబంధించిన ‘నగ్న’సత్యాన్ని ‘నేక్డ్’ అనే ఈ మ్యాజిక్ మిర్రర్ మన ముందుంచుతుందట.
అదెలా?
ముందుగా మనం అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవాలి. అది మనల్ని చుట్టూ తిప్పుతుంది.. ఇలా 20 సెకన్లపాటు చేస్తుంది. అంతలోనే ఆ అద్దం మన శరీరాన్ని స్కాన్ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్ తీసేస్తుంది. ఇందుకోసం ఇందులో ఇంటెల్ రియల్ సెన్స్ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతరం ఈ మ్యాజిక్ మిర్రర్‌తో అనుసంధానించి ఉండే స్మార్ట్‌ఫోన్ యాప్‌లోకి వివరాలు స్టోర్ అయిపోతాయి. వెంటనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్‌మాస్, ఫ్యాట్‌మాస్ వంటి వివరాలు వచ్చేస్తాయి. అప్పట్నుంచి ఈ అద్దం ఎప్పటికప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించి.. సమాచారాన్ని అందిస్తుంది. అంటే వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి.. ఆ నిర్ణీత కాలంలో కొవ్వు తగ్గిందా పెరిగిందా అన్న వివరాలను తెలుపుతుంది. ముఖ్యంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కండల వీరులకూ ఉపయోగపడుతుందని.. ఎక్కడ మజిల్ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి వివరాలనూ అందిస్తుందని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్ అని చెబుతున్నారు.
సురక్షితమేనా?
యాప్‌లో స్టోర్ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదముందని సైబర్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. డాటా హ్యాక్ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్ మాత్రమేనని.. అది ఎక్స్‌రేలాగ ఉంటుందని చెబుతున్నారు.. సంబంధిత యూజర్‌కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధర రూ. లక్ష. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయట..
ఇదండీ.. అబద్ధమే ఎరుగని ఓ అద్దం కథ..
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment