సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు.
కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్‌తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లామా? సినిమా థియేటర్‌లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్‌తో పాటు మన ఫోన్‌లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి.
ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్‌ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు.
నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ..
- మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్‌ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు.
- అపరిచిత, అనుమానాస్పద యాప్‌లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది.
- కొన్ని యాప్‌లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.
- లొకేషన్ ఆన్‌లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది.
- లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది.
- మొబైల్‌లో ఎప్పుడూ లొకేషన్ ఆన్‌లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్‌లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్‌లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment