సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ వాడకం పరిపాటిగా మారింది. ఇప్పుడు వాట్సప్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ప్రధానంగా +254, +84, +63, +374 , +1(218), +1(803) ...తో ప్రారంభయ్యే నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, మెజేస్‌లు నమ్మవద్దంటున్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నంబర్ల నుంచి వచ్చే మిస్డ్‌కాల్స్‌కు సైతం స్పందించవద్దని వారు సూచిస్తున్నారు. స్పామ్ కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారని, తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా విదేశీ కోడ్‌తో ఉంటున్న ఈ నంబర్ల నుంచి వస్తున్న వాట్సాప్ సందేశాల్లో లింక్‌లను పంపుతున్న సైబర్ కేటుగాళ్లు వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్‌లోకి మాల్‌వేర్‌ను పంపించి, మన ఫోన్‌ను వారి కంట్రోల్‌కి తీసుకుంటున్నారు.
దాని నుంచి మన బ్యాంకు లావాదేవీల వివరాలు, పాస్‌వర్డ్‌లు చోరీ చేసి డబ్బులు కొల్లగొడుతున్నట్టు వారు హెచ్చరించారు. ఇలాంటి కోడ్ నంబర్‌తో వచ్చే వాట్సాప్ కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సూచించింది.
సింగపూర్,వియత్నాంలనుంచి ఆ ఫోన్లు
ప్రధానంగా ఈ ఫోన్ కాల్స్ సింగపూర్,వియత్నాం, మలేషియా ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, లేదంటే తెల్లవారుజామున వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా స్పామ్‌కాల్స్ బెడద నుంచి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చని సైబర్‌ఇంటెలిజెన్స్ నిపుణుడు ప్రసాద్ తెలిపారు.
ఈ జాగ్రత్తలు మరవొద్దు..
♦ కొత్త కొత్త కోడ్ నంబర్లలో వచ్చే అంతర్జాతీయ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దు.
♦ అనుమానాస్పదంగా ఉండే అంతర్జాతీయ ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి.
♦ ఫోన్‌కాల్, లేదా చాటింగ్‌లో మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అడిగితే పంచుకోవద్దు.
♦ సైబర్ క్రైం పోలీసులకు లేదా సైబర్ క్రైం వెబ్‌సైట్‌లో సంబంధిత నంబర్లపై ఫిర్యాదు చేయాలి.
♦ మొబైల్‌ఫోన్, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, యాంటి వైరస్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
వాటినిబ్లాక్ చేయాలి..
మనకు కొత్త కొత్త కోడ్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు బ్లాక్ చేయాలి. పదేపదే ఇలాంటి కాల్స్ వస్తుంటే ఆన్‌లైన్ ద్వారా సైబర్ క్రైం సిబ్బంది దృష్టికి తేవాలి. అదేవిధంగా వాట్సాప్‌లో ఇతర దేశాల కోడ్ నంబర్లతో మొదలయ్యే నంబర్ల నుంచి వచ్చే వీడియో, ఆడియోకాల్స్‌కి ఆన్సర్ చేయవద్దు. ఆ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లో ఉండే లింక్‌లను ఓపెన్ చేయవద్దు. – శ్రీనివాస్ , ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment