త్వరలో ఎఫ్ఓపీ విధానం బ్లాక్ బోర్డుకిక గుడ్‌బై!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రవేశాలకు ఈ ఏడాది వచ్చిన స్పందనతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) అనుబంధ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎస్ఓఎల్) తన బోధనా విధానాలను మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించింది. పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద ‘ఫ్లిప్డ్ క్లాస్‌రూం టెక్నాలజీ (ఎఫ్‌సీటీ)’ని అందుబాటులోకి తీసుకురానుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు బ్లాక్ బోర్డు బోధనా విధానానికి వీలైనంతమేర స్వస్తి పలకనుంది. ‘ఫ్లిప్డ్ క్లాస్‌రూం టెక్నాలజీ’ విధానంలో విద్యార్థి తమకు అనుకూలమైన సమయంలో బోధనా తరగతులకు హాజరు కావొచ్చు.
ఈ విషయమై ఎస్ఓఎల్ సంచాలకుడు సీఎస్ దూబే మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ ఏడాది విశేష స్పందనలభించిందన్నారు. మొత్తం లక్షమంది విద్యార్థులు చేరారని, అందులో సగం మంది ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందినవారేనన్నారు. ఆన్లైన్ద్వారానే తాము ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను కూడా అందజేస్తున్నామన్నారు. ఎస్ఓఎల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయానికి చెందిన సహవిద్యార్థుల మాదిరిగా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారన్నారు. వారు ఏదో ఒక పాక్షిక సమయ ఉద్యోగం చేస్తుండడమో లేదా పరిమితులు ఉండడమో జరుగుతోందన్నారు. తాము అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సాంకేతిక విధానం వల్ల ఎస్ఓఎల్ విద్యార్థులు తమ తమ అధ్యయన కేంద్రాలకు వచ్చే అవసరాన్ని తగ్గించేస్తుందన్నారు.
వీరంతా తమ ఇంటి వద్దనుంచే అంతర్జాలాన్ని వినియోగించుకుని వీడియో తరగతులకు హాజరవుతారన్నారు. లేదా తమకు అనుకూలమైన సమయంలో లెక్చరర్ల బోధనలను ఆలకిస్తారన్నారు. కాగా ఈ ఏడాది చివరినాటికల్లా ఆయా కోర్సులకు సంబంధించిన సామగ్రి/వీడియోలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్ఓఎల్ యోచిస్తోంది. అదే సమయానికల్లా ‘ఫ్లిప్డ్ క్లాస్‌రూం టెక్నాలజీ (ఎఫ్‌సీటీ)’ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఎస్ఓఎల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులందరికీ ఇంటర్నెట్ వెసులుబాటు ఉండకపోవడంగానీ లేదా వారికి దానిపై ఆసక్తి లేకపోవడంగానీ జరగకపోవచ్చు.
ఈ నేపథ్యంలో ఈ విధానం కింద చేరిన విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఉంటాయన్నారు. వారికి సాఫ్ట్కాపీగానీ లేదా హార్డ్ కాపీనిగానీ అందజేస్తామన్నారు.ఈ అంశంపై శనివారంనాటి ఎస్ఓఎల్ పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని, పాఠ్యపుస్తకాల కంటే విద్యార్థులకు డీవీడీలు ఇవ్వడమే ఉత ్తమమని ఆ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయిం చారని ఆయన వివరించారు.