మెక్‌డొనాల్డ్స్‌కు వార్నింగ్ నోటీసు
ముంబై : మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి. ఓ వైపు కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షితో వివాదం, మరోవైపు ఆ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘన మెక్‌డొనాల్డ్స్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా ముంబైలోని సెంట్రల్ రీజన్లో గల మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌పై స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) జరిపిన అకస్మిక దాడిలో, ఆ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. అకస్మాత్తుగా జరిపిన తనిఖీలో హైస్ట్రీట్ ఫీనిక్స్‌లోని మెక్ డొనాల్డ్స్ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించిందని తేలిందని ఎఫ్‌డీఏ రిపోర్టు చేసింది.
అనారోగ్య పరిస్థితుల్లో ఆహారాన్ని వండుతున్నారని, తమ లైసెన్సు కాఫీని కూడా ప్రాముఖ్యంగా చూపించడం లేదని పేర్కొంది. ఈ రెస్టారెంట్ చైన్‌కు ప్రస్తుతం వార్నింగ్ నోటీసు జారీచేశామని, ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే, వచ్చే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సౌత్, వెస్ట్ రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీని హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాయి. వారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎఫ్‌డీఏ నుంచి కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నామని, వాటికి సమాధానాలను కూడా ఎఫ్‌డీఏకి సమర్పించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.