గ్రాసం కరువై..పోషణ బరువై
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. చివరికి పశువులకూ గ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు గ్రాసం కోసం సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడి నుంచి గడ్డిని కొనుగోలు చేసి తీసుకురావాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం గ్రాసం కొరతను అధిగమించేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. కొందరు రైతులు విధిలేని పరిస్థితిలోపశువులను కబేళాలకు విక్రయిస్తున్నారు.
రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులకు పంటల తర్వాత ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమే. మొత్తం 6.48 లక్షల రైతు కుటుంబాలు ఉంటే, వాటిలో దాదాపు 5.60 లక్షల రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం ఆవులు 10.20 లక్షలు, గేదెలు 84,605, మేకలు 4,29,014, గొర్రెలు 12,49,460 మేరకు ఉన్నాయి. రోజుకు ఒక ఆవుకు 5 కిలోల మేరకు వరిగడ్డి అవసరం ఉంటుంది. ఈ లెక్కన మొత్తం పశువులకు రోజుకు 5,500 టన్నుల మేరకు వరిగడ్డి అవసరం ఉంటుంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం రైతుల వద్ద మరో రెండు వారాలకు మాత్రం సరిపడే గడ్డి మాత్రమే నిల్వ ఉంది. దీంతో పాడి రైతులు పశువులను కాపాడుకునేందుకు గడ్డి కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా ఏటా తూర్పు మండలాల్లో రబీ సీజనులో కొంతమేర వర్షాలు కురిసి రైతులు పంటలు సాగు చేస్తారు. అందులో అధికంగా దాదాపు 42 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి పంటను ప్రధానంగా సాగులోకి తీసుకువస్తారు. దీంతో ఆ ప్రాంతాల్లోని పశువులకు వరిగడ్డి సమస్య తలెత్తేది కాదు. జిల్లాలోని పడమటి మండలాల్లో వరిగడ్డి సమస్య ఉత్పన్నమైనా పాడి రైతులు తూర్పు మండలాలకు వెళ్లి కొనుగోలు చేసుకుని తెచ్చుకునేవారు. అయితే ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావం కారణంగా తూర్పు మండలాల్లో కనీసం మేరకు కూడా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో అక్కడి రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో కూడా వరిగడ్డి సమస్య ఉత్పన్నమైంది.
కొనలేని స్థితి..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పాడి రైతులు తమిళనాడు, కర్ణాటకలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ట్రాక్టర్ గడ్డిని రూ.15 వేల నుంచి రూ.17 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా కొనుగోలు చేసిన గడ్డిని ట్రాక్టర్లకు లోడ్ చేసేందుకు కూలీలకు రూ.5 వేలు, అక్కడి నుంచి గ్రామాలకు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌కు రూ.5 వేలు చొప్పున ఖర్చవుతోంది. దీంతో ట్రాక్టర్ వరిగడ్డిని తీసుకురావాలంటే మొత్తం రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు రైతులు వెచ్చించాల్సి వస్తోంది.
ట్రాక్టర్‌కు రెండు టన్నుల మేరకు మాత్రమే గడ్డిని నిపంపడం సాధ్యమవుతుంది. ఈ లెక్కన కిలో గడ్డి రూ.10 నుంచి రూ.11 వరకు ఖర్చవుతోంది. ఒకరోజుకు ఒక ఆవుకు 5 కిలోల చొప్పున వరిగడ్డి అవసరం ఉంటుంది. దీంతో ఒకరోజు ఒక ఆవును పోషించాలంటే కేవలం గడ్డికి మాత్రమే రూ.50 నుంచి రూ.60 వరకు వెచ్చించాల్సి ఉంది. ఇలాంటి అధిక ఖర్చులను వెచ్చించి గడ్డిని కొనలేక పశువులను పోషిం చుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేసి పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖర్చులను భరించలేని రైతులు ఆవులు, గేదెలను సంతల్లో అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
కానరాని పశుగ్రాస క్షేత్రాలు..
జిల్లాను పాల కేంద్రంగా మార్చాలన్నదే ధ్యేయమంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు గుప్పించింది. అయితే కరువు పరిస్థితుల్లో పశువులకు అవసరమైన గడ్డిని ఏర్పాటు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ ఊదరగొట్టినా ఆచరణలో కానరావడం లేదు. కనీసం పశుగ్రాసం విత్తనాల పంపిణీ కూడా చేయడం లేదు.
తగ్గిన పాల ఉత్పత్తి..
జిల్లాలో మొత్తం పాడి ఆవులు 10.20 లక్షలు ఉండగా, గేదెలు 84 వేల వరకు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 3.75 లక్షల ఆవులు, 35 వేల గెదేలు పాలిస్తున్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది జనవరిలో రోజుకు 32 లక్షల లీటర్ల మేరకు పాల దిగుబడి అయ్యేది. అయితే ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా గడ్డి కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో దీనికి తోడు వేసవి తాపం తోడైంది. ఫలితంగా పశువుల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పాడి రైతులకు ఆదాయం రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. ఇలాంటి దుర్భర స్థితిలో పశువులను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు చేసి పశువులను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
మాది బైరెడ్డిపల్లె మండలం, నాపేరు వేణుగోపాల్‌రెడ్డి. నాకు నాలుగు పశువులు ఉన్నాయి. వాటిని పోషించుకునేందుకు గడ్డి లేకపోవడంతో శ్రీకాళహస్తి మండలం నుంచి ట్రాక్టర్ గడ్డి రూ.16 వేలకు కొనుగోలు చేశాం. గడ్డిని ట్రాక్టర్‌కు లోడ్ చేసేందుకు కూలీలకు రూ.5 వేలు, ట్రాక్టర్ బాడుగ మరో రూ.5 వేలు ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితి ప్రతి పాడి రైతుకూ ఉంది. ప్రభుత్వం స్పందించాలి.