కోతుల కోసం 'ప్రభుత్వ' ఫుడ్ స్టేషన్లు
సిమ్లా: మారిన కోతుల ఆహారపు అలవాట్లతో మనుషులకు చచ్చేంత చావొచ్చిపడింది. వంటగదులు, కిరాణం షాపులపై దాడులు చేస్తుండటంతోపాటు కొన్నిసార్లు పిల్లల్ని కరిచిన ఉదంతాలు తెలిసినవే. కోతుల బెడదను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలోని ప్రముఖ జక్కూ హనుమంత ఆలయం వద్ద రికార్డు సంఖ్యలో కోతులు నివసిస్తుంటాయి. భక్తుల నుంచి తినుబండారాలను బలవంతంగా లాక్కొని తింటుంటాయి. ఈ క్రమంలో వాటి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.
ఇప్పుడు అక్కడి కోతులు ఆహారం కోసం పూర్తిగా మనుషుల మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అలవాట్లను మార్చేందుకు త్వరలోనే వైల్డ్ లైఫ్ వింగ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కోతులకు ప్రత్యేకంగా ఫుడ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హిమాచల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జియోగ్రాఫికల్ ఇంన్ ఫర్మేషన్ సిస్టం ద్వారా కోతుల సంఖ్యను లెక్కగట్టిన వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ ఒక్క సిమ్లాలోనే కోతుల సంఖ్య 2,500 గా ఉన్నట్టు నిర్ధారించింది.