సెల్‌ఫోన్ మాట్లాడుతూ వంట.. తెచ్చిన తంట
బంజారాహిల్స్: సెల్‌ఫోన్ మాట్లాడుతూనే వంట చేస్తుండగా మంటలంటుకొని ఓ యువతి తీవ్రగాయాలైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని కమాన్‌లో ఉన్న సయ్యద్ నగర్ అహ్మద్‌నగర్‌లో నివసించే కతీజా బేగం(17) శుక్రవారం ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా ఫోన్ వచ్చింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూనే వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు ఆమె దుస్తులకు అంటుకున్నాయి.
ఫోన్ మాట్లాడటంలో నిమగ్నమైన ఆమె కొద్దిసేపటి వరకు ప్రమాదాన్ని గమనించలేదు. తేరుకునేసరికి ఒళ్లంతా మంటలు వ్యాపించి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలు ఆర్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తండ్రి షేక్ జమీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.