స్త్రీలకూ వయాగ్రా!
ఎఫ్డీఏ ఆమోదం
వాషింగ్టన్: కామోద్దీపన ఔషధం వయాగ్రా ఇకపై స్త్రీలకూ అందుబాటులోకి రానుంది. రుతుచక్రం ఆగిపోయే దశకు చేరువైన స్త్రీలలో లైంగిక కోరికలు తగ్గిపోయే సమస్యకు చికిత్స చేసేందుకు గాను తొలిసారిగా ఓ ఔషధానికి ఆమోదం లభించింది. ‘ఫిమేల్ వయాగ్రా’గా పిలుస్తున్న ఈ మందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, ఈ మందు వినియోగం వల్ల రక్తపోటు పడిపోవడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన దుష్ర్పభావాలు కలిగే అవకాశాలుంటాయని ఎఫ్డీఏ హెచ్చరించింది.
‘యాడ్యీ(ఫ్లిబాన్సెరిన్ ఔషధం)’ పేరుతో తయారుచేసిన ఈ మందును రుతుచక్రం ఆగిపోయే దశకు ముందు ఉన్న స్త్రీలలో ‘హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్(హెచ్ఎస్డీడీ)’ సమస్యకు చికిత్స చేసేందుకుగాను ఎఫ్డీఏ అనుమతించింది. అయితే, ఇంతవరకూ స్త్రీలలో లేదా పురుషుల్లో లైంగిక కోరికలకు సంబంధించి ఎఫ్డీఏ ఆమోదం పొందిన చికిత్సలేవీ లేవని ఎఫ్డీఏకు చెందిన ఔషధ పరిశోధన కేంద్రం డెరైక్టర్ వుడ్కాక్ వెల్లడించారు.
లైంగిక కోరికలు తగ్గే సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు తొలిసారిగా యాడ్యీ మందుతో చికిత్సకు వీలవుతుందని తెలిపారు. అతిగా మద్యం సేవించడం, మానసిక సమస్యలు, ఇతర కారణాల వల్ల వచ్చే హెచ్ఎస్డీడీకి ఈ మందుతో చికిత్స చేయొచ్చన్నారు. అయితే, దీనితో చికిత్సకు ముందు దుష్ర్పభావాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు.