Ferdinand Marcos Jr
-
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా జూన్‌లో బాధ్యతలు చేపట్టిన మార్కోస్ జూనియర్‌కు మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ పాత్ర కీలకమైందిగా భారత్ భావిస్తోందన్నారు. ఫిలిప్పీన్స్ అభివృద్ధికి భారత్ సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు. రొడ్రిగో డ్యుటెర్టే స్థానంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ జూనియర్ జూన్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. -
తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నాటికి 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది.