అధ్యక్షుడినే చంపేయిస్తా | Philippines VP Sara Duterte threatens Marcos assassination if she is killed | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడినే చంపేయిస్తా

Published Sun, Nov 24 2024 5:40 AM | Last Updated on Sun, Nov 24 2024 9:30 AM

Philippines VP Sara Duterte threatens Marcos assassination if she is killed

నా ప్రాణాలను హాని జరిగితే ఎవ్వరినీ వదలను 

అధ్యక్షుడి భార్యను, దిగువసభ స్పీకర్‌నూ అంతం చేస్తా 

ఫిలిప్పీన్స్‌ ఉపాధ్యక్షురాలి సంచలన ప్రకటన 

మనీలా: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌లో రెండు శక్తివంత రాజకీయ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిరాజుకుంటోంది. ఈ కుటుంబాల మధ్య పాత వైరం మరోసారి బట్టబయలైంది. తన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ఫిలిప్పీన్స్‌ దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్‌ మార్కోస్‌ జూనియర్‌ను చంపేస్తానని ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టే బహిరంగ ప్రకటన చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించారు. 

సారా డ్యుటెర్టే తండ్రి రోడ్రిగో డ్యుటెర్టేకు, ఫెర్డినాడ్‌ తండ్రి మార్కోస్‌ సీనియర్‌కు మధ్య చాన్నాళ్ల క్రితం బద్దశత్రుత్వం ఉన్న విషయం తెల్సిందే. ఫెర్డినాడ్‌ జూనియర్‌ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా రాజీనామాచేసినప్పటికీ సారా ఇంకా దేశ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవలికాలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అస్సలు పొసగట్లేదు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సారా ఆన్‌లైన్‌లో మీడియాసమావేశంలో మాట్లాడారు.

 ‘‘నా యోగక్షేమాల గురించి ఎవరికీ ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే మీకో విషయం చెప్తా. ఇటీవల నేను ఒక కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో మాట్లాడా. నా ప్రాణాలను హాని ఉండి, నన్ను ఎవరైనా చంపేస్తే వెంటనే దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్, ఆయన భార్య లిజా అరనేటా, పార్లమెంట్‌లో ప్రతినిధుల సభ స్పీకర్‌ మారి్టన్‌ రోమాల్డేజ్‌ను చంపేసెయ్‌. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకునేదాకా దాడిచెయ్‌ అని చెప్పా. అందుకే తను సరేనన్నాడు. ఇది సరదాకి చెప్పట్లేను. ఇది జోక్‌ కానేకాదు’’అని సారా చెప్పారు. 

అధ్యక్షుడిని అంతం చేయాలని కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో మాట్లాడినట్లు స్వయంగా ఉపాధ్యక్షురాలే ప్రకటన చేయడంతో అధ్యక్షుడి కమ్యూనికేషన్స్‌ కార్యాలయం అప్రమత్తమైంది. ‘‘అధ్యక్షుని ప్రాణాలకు ఇంతటి హాని పొంచి ఉందని తెలిశాక భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. రక్షణ బాధ్యతలను అధ్యక్షుడి రక్షణ దళాలకు అప్పజెప్తున్నాం. సారా వ్యాఖ్యలపై తగు చర్యలకు సిద్ధమవుతున్నాం’’అని కార్యనిర్వాహక కార్యదర్శి లూకాస్‌ బెర్సామిన్‌ చెప్పారు. 2022 మేలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మార్కోస్, ఉపాధ్యక్షురాలిగా సారా పోటీచేసి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు, తదితర అంతర్జాతీయ, దేశీయ అంశాల్లో ఇద్దరు నేతల మధ్య ఇటీవలికాలంలో తీవ్ర బేధాభిప్రాయాలొచ్చాయి. ఈమధ్య ఓసారి అధ్యక్షుడి తలను నరుకుతున్నట్లు ఆలోచనలొస్తున్నాయని సారా వ్యాఖ్యానించారు. ‘‘అధ్యక్షుడు అవినీతిలో కూరుకుపోయారు. పరిపాలించే సత్తా లేదు. అబద్ధాలకోరు. మా కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరచాలని కుట్ర పన్నుతున్నారు’’అని సారా ఆరోపించారు. సారా తండ్రి రోడ్రిగో డ్యుటెర్టో ఫిలిప్పీన్స్‌లో కరడుగట్టిన రాజకీయనేతగా పేరొందారు.

 దేశంలో మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు. దావో సిటీ మేయర్‌గా, ఆతర్వాత దేశాధ్యక్షుడిగా తన పరిపాలనాకాలంలో ‘డెత్‌ స్క్వాడ్‌’పేరిట వేలాది మంది డ్రగ్స్‌ముఠా సభ్యులను అంతమొందించారు. ఆనాడు దేశాధ్యక్షుడిగా ఉంటూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. సారా ప్రకటనపై దేశ సైన్యాధ్యక్షుడు జనరల్‌ రోమియో బ్రేవ్‌నర్‌ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘లక్షన్నరకుపైబడిన దేశ సైనికులు ఎల్లప్పుడూ పక్షపాతరహితంగా పనిచేస్తారు. ప్రజాస్వామ్యయుత రాజ్యాంగబద్ధ సంస్థలు, పౌరవ్యవస్థల ఆదేశాలను శిరసావహిస్తారు’’అని అన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement