అంబితో అప్రతిష్ట
కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారిన మంత్రి ప్రవర్తన
రాహుల్, దిగ్విజయ్‌లకు లేఖ రాసిన మండ్య కాంగ్రెస్ కార్యకర్తలు
లేఖతో పాటు ‘లీలల’ సీడీని జత చేసిన వైనం
మండ్య : రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌పై బహిరంగ వాఖ్యలు చేస్తూ పలు వివాదాలకు నిలయంగా మారారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, మండ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి అంబరీష్. ఇప్పుడు ఆయన మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చీకటి వెలుగుల్లో, మద్యం తాగుతూ తన మద్దతుదారులతో కలిసి నృత్యాలు చేస్తున్న వీడియో, యువతికి ముద్దులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. దాంతో అంబరీష్‌పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అతని ప్రవర్తనపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళలపైన హత్యాచారాలు, దౌర్జన్యాలతో చెడ్డ పేరు మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంబరీష్ ప్రవర్తన మరో భారంగా మారింది.
ఇటీవల అంబరీష్ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీకి చెడ్డ పేరును చేస్తున్నాయి. గత వారం కలబుర్గిలో జరిగిన మంత్రివర్గం సమావేశానికి అంబరీష్ గైర్హాజర్ అయ్యారు. ఏఐసీసీ పలుమార్లు సూచించినా కేపీసీసీ కార్యాలయానికి గాని, జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి కాని అంబరీష్ రావడంలేదు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్నేహితులు, మద్దతుదారులతో కలిసి హోటల్లో జల్సా చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అంబరీష్ ప్రవర్తనపై ఇంతకు ముందు ఉన్న రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ కూడా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రిగా ఉండి రేస్‌క్లబ్‌లో కనిపించడంపై ఆయన మండిపడిన విషయం తెల్సిందే. అయినా అంబరీష్లో మార్పు రాలేదు. గత మార్చిలో తీవ్ర శ్వాసకోశ వ్యాధితో అంబరీష్ సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. దానికి అవసరమైన ఖర్చు మొత్తం 1.22 కోట్లను ప్రభుత్వమే భరించింది. దీనిపై కూడా అప్పుడు వివాదం చెలరేగింది. తాను ఎన్నికైన మండ్య శాసన సభ నియోజకవర్గంలో అంబరీష్ ఎప్పుడూ పర్యటించలేదు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉంటూ మండ్యలో చేపట్టిన అభివృద్ధి పనులు శూన్యం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్, సీనియర్ నాయకులు కలిసి సిద్ధం చేసిన బోర్డు మెంబర్ల ఎన్నికపై అంబరీష్ బహిరంగంగా విమర్శిలు చేశారు. ఇలా సమావేశాలకు రాకుండా.. కార్యకర్తలను కలువకుండా.. ప్రజల వద్దకు వెళ్లకుండా.. పార్టీ నేతలనే విమర్శిస్తూ అంబరీష్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో మొత్తం 120 మంది కార్యకర్తలు సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న అంబరీష్ వీడియో సీడీలను, ఫొటోలను ఆ ఫిర్యాదుకు జతచేసి పంపారు.