న్యాయవ్యవస్థ స్వతంత్రతే పరమావధి
న్యాయవ్యవస్థకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న చారిత్రక ఘర్షణ ఫలితంగా న్యాయవ్యవస్థ సామర్థ్యం క్షీణిస్తోంది. ప్రజాస్వామ్య ఆరోగ్యం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రత కొనసాగాలి. న్యాయవ్యవస్థ రాజకీయ భావజాలానికీ, ప్రజా ఒత్తిడికీ దూరంగా ఉండాలి. దాన్ని ప్రభుత్వ శాఖల నుంచి స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించాలి.
దీనికోసం న్యాయమూర్తులను నియమించే విశ్వసనీయ, పక్షపాత రహిత వ్యవస్థ అవసరం. కొలీజియం వ్యవస్థను కొనసాగిస్తూనే, జడ్జీలను నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు ఇస్తూనే న్యాయమూర్తులను సిఫారసు చేయడానికి ఒక సెక్రటేరియట్‌ను బలోపేతం చేయవచ్చు. ప్రస్తుత న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ శాఖ, సామాన్యులు ఇందులో ప్రతినిధులుగా ఉండొచ్చు.
కేరళలోని ఎడ్నీర్ మఠం ఆస్తుల నిర్వహణ విషయంలో మఠంపై నిబంధనలు విధించడా నికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సవాలు చేస్తూ మఠాధి పతి స్వామి కేశవానంద భారతి 1970 ఫిబ్రవరిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు 7–6 మెజారిటీతో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సిద్ధాం తాన్ని వివరిస్తూ, రాజ్యాంగ కీలక సూత్రాలను, స్వరూపాన్ని సవ రించడంలో పార్లమెంట్‌కు ఉన్న పరిమితులను నొక్కిచెప్పింది.
అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు సుప్రీంకోర్టును కూడా నూతన న్యాయమూర్తుల బృందంతో నింపారు. ఆయన కంటే ముగ్గురు సీనియర్ జడ్జీలను పక్కకునెట్టి ఏఎన్ రాయ్‌ని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు. కేశవానంద కేసు తీర్పుపై సంతకం చేయని ఆ ఒక్క న్యాయమూర్తి ఈయనే. ఈయన నేతృ త్వంలో 13 మంది న్యాయమూర్తుల బెంచ్ నాటి చారిత్రాత్మక తీర్పును తిరగదోడింది. కేసును రెండు రోజులపాటు విచారించింది.
ఈ కేసుపై ఎలాంటి రివ్యూ పిటిషన్‌ని దాఖలు చేయలేదనీ, మౌఖిక అభ్యర్థన ప్రాతిపదికగా తప్పు ప్రక్రియతో ఈ కేసును సమీక్షించారనీ త్వరలోనే గుర్తించారు. దాంతో బెంచ్ మొత్తాన్నీ రద్దు చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నిబద్ధత చూపే న్యాయవ్యవస్థ ఉన్నప్ప టికీ ఆనాడు రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం బతికి బట్టకట్టింది. ఈ చారిత్రాత్మక తీర్పు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి సమ తుల్యతను కలిగించడంలో తోడ్పడింది.
కొంతకాలంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2), 217 (1)లను వ్యాఖ్యానించడంలో కేంద్రప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతి న్యాయమూర్తినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (ప్రత్యేకించి చీఫ్ జస్టిస్), రాష్ట్రాల్లోని హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించి రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా హైకోర్టు న్యాయ మూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో, రాష్ట్ర గవర్నర్‌తో, హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి నియ మిస్తారని ఆర్టికల్ 217 (1) నొక్కి చెబుతుంది.
ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1981)లో న్యాయపరమైన భాష్యం కానీ, సుప్రీంకోర్టు రికార్డ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (రెండో జడ్జీల కేసు) (1993) కానీ, అర్టికల్ 143(1) ... వర్సెస్ అనామక (మూడో జడ్జీల అభిప్రాయం) (1998) వంటివి కానీ... న్యాయమూర్తుల స్వాతంత్య్ర సూత్రాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయాయి. న్యాయమూర్తులను సిఫారసు చేసే కొలీజియం వ్యవస్థకు దారి తీశాయి.
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం కొలీజియం వ్యవస్థ సిఫార్సులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు– కానీ కొలీజియం రెండో సారి కూడా ఆ సిఫార్సులను చేస్తే ప్రభుత్వం తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. ఇటీవలే ఈ ఏకాభిప్రాయం స్తంభనకు దారి తీసింది. నవంబర్ 12న కొలీజియం తిరిగి సిఫార్సు చేసిన ప్రతి పాదనలను కేంద్రం నిలిపివుంచింది. దీంతో సెకండ్ జడ్జీల కేసులో విధించిన కాలక్రమాన్ని పాటించనందుకు సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఖాళీలను పూరించడానికి నిర్దిష్ట సమయాన్ని సూచించ నందుకు న్యాయ శాఖ పట్ల న్యాయ, పర్సనల్ వ్యవహారాలపై స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
స్వతంత్ర న్యాయవ్యవస్థకూ, మితిమీరి వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న ఈ చారిత్రక ఘర్షణ ఫలితంగా భారత న్యాయవ్యవస్థ సామర్థ్యం క్షీణిస్తోంది. 2022 ఆగస్టులో సుప్రీం కోర్టులో మొత్తం 34కి గానూ 3 ఖాళీలు, హైకోర్టుల్లో 1,108 ఖాళీలకు గానూ 381, దిగువ కోర్టుల్లో 24,631 జడ్జీ పదవులకుగానూ 5,342 ఖాళీలు ఉన్నాయి. అంటే 20 శాతం మేర ఖాళీలు ఉన్నాయి. బాంబే, పంజాబ్–హరియాణా, కలకత్తా, పట్నా, రాజస్థాన్ హైకోర్టుల్లో ఇలాంటి ఖాళీలు న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. (2022 ఆగస్టు నాటికి నాలుగు కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి).
న్యాయవ్యవస్థలో సంస్కరణలు దీర్ఘకాలం పెండింగులో ఉండటం నిజమే కావచ్చు. రాజకీయ సంస్థల చేత జడ్జీల నియామ కాలు జరుగుతున్న దేశాలను చూడండి. ఇటలీలో రాజ్యాంగబద్ధ న్యాయస్థానం నియామకాలకు అధ్యక్షుడు, లెజిస్లేచర్, సుప్రీంకోర్టు ఇలా ప్రతి సంస్థా అయిదుగురు జడ్జీలను నామినేట్ చేయడానికి అనుమతిస్తారు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను శాశ్వత ప్రాతిపదికన అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. తర్వాత సెనేట్ మెజారిటీ ద్వారా ఆమోదిస్తుంది. సహజంగానే ఇది పక్షపాత న్యాయవ్యవస్థకు దారితీస్తుంది.
న్యాయవ్యవస్థ పారదర్శకతను మెరుగుపర్చడానికి న్యాయమూర్తుల ఎన్నికలు కూడా ఉపయోగపడతాయి. అమెరికా లోని అనేక రాష్ట్రాలు రాష్ట్ర సుప్రీంకోర్టుల న్యాయ నియామకాల కోసం ఎన్నికలను ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఇవి ప్రజా కర్షక తీర్పులు ఇచ్చేలా న్యాయమూర్తులను ప్రోత్సహిస్తాయి. సంకీర్ణ ప్రభుత్వ ధోరణి కలిగిన ఏ ప్రజాస్వామ్యానికైనా ఇది మంచిది కాదు.
ఇతర దేశాలు న్యాయ కౌన్సిల్స్‌తో ప్రయోగాలు చేస్తాయి. ఇరాక్‌లో జడ్జీలందరూ ఒక న్యాయ సంస్థలో పట్టభద్రులై ఉంటారు. దరఖాస్తుదారులందరూ రాత, మౌఖిక పరీక్షల్లో పాల్గొంటారు. జడ్జీల ప్యానెల్‌తో ఇంటర్వ్యూలో పాల్గొంటారు. జపాన్‌లో సుప్రీంకోర్టు సెక్రటేరియట్ శిక్షణ, ప్రమోషన్లతోపాటు దిగువ స్థాయి న్యాయ నియామకాలను నియంత్రిస్తుంటుంది. ఇటీవలే, కేంద్రప్రభుత్వం న్యాయ కమిషన్ ద్వారా న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని ప్రతిపాదించింది (జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ బిల్లు, 2014).
2015 అక్టోబర్ 16న దీన్ని 4–1 మెజారిటీతో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే కొలీజియం వ్యవస్థలో మరింత పారదర్శకతను కల్పించడాన్ని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. అదే సమయంలో న్యాయమూర్తుల నియామకానికి సాధికారిక సెక్రటేరి యట్ అవసరమా ఆనే అంశంపై చర్చపెట్టింది. దీనిపై తదుపరి సంస్కరణలు చేయవచ్చు. కొలీజియం వ్యవస్థ కొనసాగుతుంది; నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు కొనసాగిస్తూనే అభ్యర్థులను సిఫారసు చేయడానికి ఒక సెక్రటేరియట్‌ను బలోపేతం చేయవచ్చు.
దీన్ని ప్రస్తుత న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ మంత్రిత్వ శాఖ, సామాన్యుల ప్రతినిధుల నుంచి నియమించవచ్చు. ఇది న్యాయ వ్యవస్థలో మన సమాజానికి గొప్ప ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. 2022 డిసెంబర్ నాటికి, సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళలు, ఇద్దరు ఎస్సీ జడ్జీలు మాత్రమే ఉన్నారు.
న్యాయమూర్తుల నియామకాలకు అవతల, ఒక కొత్త అప్పీల్ కోర్టు ఉండాల్సిన అవసరం ఉంది. హైకోర్టుల్లో తీర్పులకు వ్యతిరే కంగా రెగ్యులర్ అప్పీల్ కోర్టుగా ఉండాలనే ఉద్దేశం సుప్రీంకోర్టుకు ఎన్నడూ లేదు. సుప్రీంకోర్టు బెయిల్ అప్లికేషన్లను వినకూడదు.
దానికి బదులుగా లా కమిషన్ సిఫార్సు చేసినట్లుగా, ప్రముఖ మెట్రో నగ రాల్లో బ్రాంచ్‌లు ఉన్న ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు ఉండాలి. ఈలోపు, సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ కోర్టు (రాజ్యాంగ సవరణ ద్వారా)లోకి పరివర్తన చెందాలి. ఇలా చేయడమంటే అత్యున్నత స్థాయిలో తక్కువ కేసులు (మాట వరసకు 50) మాత్రమే పెండింగులో ఉండేట్టు చూడటం! ఏ స్థాయిలో అయినా జడ్జీలందరికీ కచ్చితమైన రిటైర్మెంట్ వయసు (65 ఏళ్లు) విధించాలి. రిటైర్మెంట్ తర్వాత, ప్రభుత్వంలో పోస్టులకు నామినేట్ చేయడానికి నిర్దిష్టమైన గడువును విధించాలి.
భారతీయ ప్రజాస్వామ్య ఆరోగ్యం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం. దీన్ని సాధించడానికి న్యాయమూర్తులను నియ మించే విశ్వసనీయమైన, పక్షపాత రహితమైన వ్యవస్థ అవసరం. వ్యక్తి స్థాయిలో, వ్యవస్థ స్థాయిలో న్యాయవ్యవస్థను ప్రభుత్వ శాఖల నుంచి స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించాల్సి ఉంది.
ఫిరోజ్ వరుణ్ గాంధీ
వ్యాసకర్త లోక్‌సభలో బీజేపీ ఎంపీ
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో