ఫ్యాక్ట్ చెక్: ఎందుకీ రాద్దాంతం?
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వంలో ఎరువుల కోసం దుకాణాల వద్ద రైతులు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడినా సరే.. పచ్చపత్రిక ఈనాడుకు మాత్రం అంతా పచ్చగా కనిపించేది. రైతులు తమ పనులు మానుకుని మరీ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చి పడిగాపులు కాసినా సరే.. ఏమీ పట్టనట్టు ఉండేది. నకిలీ ఎరువుల విక్రయాలు విచ్చలవిడిగా సాగినా సరే.. అంతా బాగున్నట్టే వ్యవహరించేది. సొసైటీలకు వచ్చిన ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి దర్జాగా అమ్ముకుని దోపిడీ చేస్తున్నా సరే.. రైతులు కళ్లల్లో సంతోషమే కనిపిస్తున్నట్టుగా పాఠకులను కనికట్టు చేసేందుకు కుట్ర పన్నేది. ఎందుకంటే అప్పుడు ఈనాడుకు ఆప్తుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి..
కానీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంచక్కా 10,778 రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల చెంతకే ఎరువులను తీసుకెళ్లారు. రైతులు క్యూలలో పడిగాపులు పడాల్సిన దుస్థితి లేదు. దళారులు లేరు. బ్లాక్ మార్కెటింగ్ అసలే లేదు. నకిలీలు, నాసిరకం బెడదే లేదు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్‌లలో నాణ్యతను ధ్రువీకరించి మరీ నాణ్యమైన ఎరువులను మాత్రమే ఆర్బీకేలతోపాటు మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకే ఎక్కడా రైతుల ఆందోళనలు లేవు. ఇంతగా రైతన్నలు సంతోషకరంగా ఉంటే.. టీడీపీ భజన పత్రిక ఈనాడుకు కంటగింపుగా మారింది. అందుకే ఎరువుల కొరత అంటూ అసత్య సమాచారంతో ఓ కథనాన్ని వండి వార్చింది.
రైతుల్ని తప్పుదారి పట్టించేందుకు అసత్య కథనంతో బరితెగించింది. ఎందుకంటే తమ అస్మదీయుడు చంద్రబాబు సీఎంగా లేరు.. ప్రజలు భారీ మెజార్టీతో ఎన్నుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నారు. అందుకే తనకు అలవాటైన రీతిలో అబద్ధపు రాతలతో ప్రజల్ని మోసగించేందుకు, విషపు రాతలతో రాద్ధాంతం చేసేందుకు యత్నించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎరువుల కొరత అంటూ అబద్ధపు రాతలతో యావత్ రాష్ట్రాన్ని మభ్యపెట్టేందుకు కుట్ర పన్నింది. కానీ ప్రజలకు నిజాలు తెలుసు.. ఆర్బీకేలలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉండటాన్ని రైతులు కళ్లారా చూస్తున్నారు. అందుకే ఈనాడు కుట్ర బెడిసికొట్టింది.
ఎరువుల సమృద్ధి.. పంపిణీలో చిన్న సమస్యలు
రాష్ట్రంలో రబీ సాగు చివరిదశకు చేరుకుంది. వరి, మొక్కజొన్న కంకిదశకు చేరుకోగా, అపరాలు కాయకట్టే దశకు చేరుకున్నాయి. ఈ దశలో అవసరమైన యూరియాతో సహా ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. పంపిణీలో నెలకొన్న చిన్న సమస్యలను ఆసరాగా చేసుకుని కొరత ఉన్నట్టుగా భూతద్దంలో చూపిస్తూ విపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎరువుల పంపిణీ గతంలో మండల కేంద్రాల్లో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్), ప్రైవేటు దుకాణాల ద్వారా జరిగేది. ప్రతి రైతు సీజన్లో నాలుగైదుసార్లు మండల కేంద్రానికి వెళ్లి ఎరువుల కోసం పడరానిపాట్లు పడేవారు. సమయం వృథా కావడమే కాదు.. రవాణా ఖర్చులు తడిసిమోపెడయ్యేవి.
కానీ ప్రస్తుతం గ్రామస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరాకు శ్రీకారం చుట్టడంతో వారికి సమయం, ఖర్చులు ఆదా అవుతున్నాయి. గతంలో మాదిరిగా పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద కంటే ఆర్బీకేల వద్ద కొనుగోలు చేసేందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆ స్థాయిలో నిల్వచేసేందుకు గ్రామస్థాయిలో గోడౌన్లు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఉన్న మార్క్‌ఫెడ్ గోడౌన్ల నుంచి ఆర్బీకేలకు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులు పంపిణీలో జాప్యానికి కారణమవుతున్నాయి. దీనికితోడు యూరియా, ఇతర రసాయన ఎరువుల ధరల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో రైతులు యూరియా వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిఫార్సుకు మించి యూరియా వినియోగం పెరిగింది.
రాష్ట్రంలో 4.77లక్షల టన్నుల ఎరువులు
రబీలో 23.45 లక్షల టన్నుల ఎరువులు అవసరం. ప్రారంభ నిల్వలు 6.97 లక్షల టన్నులు ఉండగా.. కేంద్రం 13.25 లక్షల టన్నులు కేటాయించింది. 15.45 లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా ప్రస్తుతం 4.77 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫిబ్రవరిలో 3.54 లక్షల టన్నుల ఎరువులేæ అవసరం. కేటాయింపు మేరకు ఇంకా కేంద్రం నుంచి 2.83 లక్షల టన్నులు ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఎంవోపీ మినహా మిగిలిన ఎరువులన్నీ డిమాండ్‌కు మించే ఉన్నాయి. ఫిబ్రవరి నెలకు 1.47 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, రాష్ట్రంలో 1.95 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి.
కేటాయింపులకు తగినట్టుగా కేంద్రం నుంచి సరఫరా లేదు
యూరియా కేటాయింపులకు తగినట్టుగా రాష్ట్రానికి సరఫరా కావడంలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు బఫర్ స్టాక్‌ను కేటాయించడంతో ఆ మేరకు ఇతర రాష్ట్రాలకు తగ్గించేశారు. రాష్ట్రానికి కేటాయించిన 6.69 లక్షల టన్నుల యూరియాకుగాను 5.50 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఇంకా 1.19 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉంది. ప్రధానంగా గడిచిన మూడునెలల్లో రాష్ట్రానికి ఎరువుల సరఫరా తగ్గింది. ప్రధానంగా యూరియా డిసెంబర్లో రాష్ట్రానికి కేటాయించిన 1.72 లక్షల టన్నులకు 1.65 లక్షల టన్నులు, జనవరిలో 2 లక్షల టన్నులకు 1.31 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 1.48 లక్షల టన్నులకు 66,602 టన్నులు సరఫరా చేశారు.
ఆ రెండు జిల్లాల్లోను పుష్కలం
దాళ్వాకు నీరివ్వడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వరి ఎక్కువగా సాగైంది. తూర్పుగోదావరిలో 1.68 లక్షల టన్నుల ఎరువులు నిల్వచేయగా, 1.26 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. యూరియా ఫిబ్రవరి నెలకు 19,335 టన్నులు అవసరం కాగా 14,754 టన్నులు అందుబాటులో ఉంది. వారంలో మరో 9,090 టన్నుల యూరియా జిల్లాకు రానుంది. పశ్చిమ గోదావరిలో 2.94 లక్షల టన్నుల ఎరువులు నిల్వ చేయగా 2.14 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరిలో 16,784 టన్నుల యూరియా అవసరం కాగా 28,781 టన్నులు అందుబాటులో ఉంది. వారంలో మరో 8,390 టన్నుల యూరియా జిల్లాకు రానుంది.
అన్ని జిల్లాలకు యూరియా సర్దుబాటు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థన మేరకు జనవరి నెలకు రావాల్సిన యూరియాలో 49,736 టన్నుల ఇంపోర్టెడ్ యూరియాను రాష్ట్రానికి కేంద్రం సరఫరా చేసింది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు 1,300 టన్నులు చొప్పున సరఫరా చేయగా, మరో 1,300 టన్నుల చొప్పున ఒకటి రెండు రోజుల్లో కృష్ణపట్నం పోర్టు నుంచి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు 6,100 టన్నులు సరఫరా చేయగా, మరో 5,600 టన్నులు ఒకటి రెండు రోజుల్లో కాకినాడ పోర్టు నుంచి సరఫరా చేయనున్నారు. కాకినాడ, గంగవరం, చెన్నై, కృష్ణపట్నం పోర్టుల నుంచి బయల్దేరిన 10,400 టన్నుల యూరియా ఒకటి రెండు రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చేరనుంది. గుంటూరు జిల్లాకు ఇప్పటికే 500 టన్నులు సరఫరా చేయగా మరో 7,800 టన్నుల యూరియాను కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్ పోర్టుల నుంచి తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు 4,900 టన్నుల యూరియా వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి పంపుతున్నారు.
దెందులూరులో 30 బస్తాల యూరియా చోరీ
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఆర్బీకేకు 450 బస్తాల యూరియా వచ్చింది. 368 బస్తాలు విక్రయించగా, మిగిలిన 82 బస్తాలను ఆర్బీకేలో ఉంచి తాళం వేశారు. ఉదయం వెళ్లి చూసేసరికి ఆర్బీకే తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల 52 బస్తాలే ఉన్నాయి. 30 బస్తాల యూరియా చోరీ అయినట్లు ఆర్బీకే వ్యవసాయ సహాయకురాలు రాణి దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మా ఊళ్లో ఎరువులకు ఇబ్బందిలేదు
10 ఎకరాల్లో మొక్కజొన్న, 15 ఎకరాల్లో వరి, జొన్న సాగుచేస్తున్నా. ఆర్బీకేలో డీఏపీ 25 బస్తాలు, 10-26 కాంప్లెక్స్ ఎరువులు 25 బస్తాలు, పొటాష్ 10 బస్తాలు, యూరియా 40 బస్తాలు తీసుకున్నా. కావాల్సినన్ని ఎరువులు గ్రామంలో ఉన్నాయి. పత్రికల్లో వస్తున్న వార్తలతో మళ్లీ దొరకవేమోననే ఆందోళనతో రైతులు పెద్దసంఖ్యలో ఆర్బీకేకు వస్తున్నారు. ఈరోజే 40 టన్నుల లోడు వచ్చింది. మా గ్రామంలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేదు. ఈనాడోళ్లు ఏదో అయిపోతోందని, మాగ్రామంలో రైతులు ఇబ్బందిపడుతున్నారని రాశారు. అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఆర్బీకే సిబ్బంది, వ్యవసాయాధికారులు వచ్చిన ప్రతి రైతుకు యూరియా అందిస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ కార్డుపై ఒక్కోరైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు.
- నీరుకొండ దేవప్రసన్నకుమార్, వంగలపూడి, తూర్పుగోదావరి జిల్లా
కొరత లేకుండా చర్యలు
రాష్ట్రంలో ఎరువుల కొరత లేనేలేదు. సమృద్ధిగా కావాల్సినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గ్రామస్థాయిలో గోడౌన్ సదుపాయాలు లేకపోవడంతో ఆర్బీకేల ద్వారా పంపిణీలో కొంత జాప్యం జరుగుతోంది. ఆర్బీకేల ద్వారా 1.95 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పటివరకు 1.93 లక్షల టన్నులు సరఫరా చేశాం. రైతులు1.61 లక్షల టన్నుల ఎరువులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం 32 వేల టన్నుల ఎరువులు ఆర్బీకేల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ఎరువులు నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేస్తునాం. ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో రైతులంతా యూరియా వాడుతున్నారు. అందువల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.
- హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
పనిగట్టుకొని దుష్ప్రచారం
ఎరువులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎల్లో మీడియాతో కలిసి విపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్లాక్ మార్కెట్లో నకిలీ ఎరువులు కొనుగోలుచేసి నష్టాలపాలయ్యేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు నాణ్యమైన ధ్రువీకరించిన ఎరువులను గ్రామస్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిట అందిస్తున్నాం. ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకే కేంద్రం రాష్ట్రానికి ఇప్పటికే 50 వేల టన్నుల ఇంపోర్టెడ్ యూరియాను సరఫరా చేసింది. మరో లక్ష టన్నులకు పైగా రాష్ట్రానికి రాబోతోంది.
- కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి