నకిలీ విత్తన దందా: నకిలీకి ‘అసలు రంగు’ | Telangana Serious On Fake Seeds Supply | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తన దందా: నకిలీకి ‘అసలు రంగు’

Published Sun, Jun 20 2021 3:36 AM | Last Updated on Sun, Jun 20 2021 3:37 AM

Telangana Serious On Fake Seeds Supply - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నకిలీ విత్తనాల వ్యవహారంలో ఇటీవల కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై ఇటు పోలీసు శాఖ, అటు వ్యవసాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రైతులకు, సీడ్‌ కంపెనీలకు మధ్య అనుసంధానంగా ఉండే దళారుల చేతివాటమే ఈ మొత్తం వ్యవహారానికి మూలకారణమని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో లభిస్తున్న, పక్క రాష్ట్రం నుంచి వస్తున్న నకిలీ విత్తన కేసుల్లో అధిక శాతం ఇలాంటివే వస్తున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. పనికి రాని, తక్కువ నాణ్యత కలిగిన, నకిలీ విత్తనాలను రంగులద్ది ప్యాకింగ్‌ చేసి, మంచి లాభాలు వస్తాయని ఆశ చూపి రైతులకు అంటగడుతున్నారు. ఈ వ్యవహారంలో పలు జిల్లాల్లో విత్తనాలను విక్రయించే డీలర్లు కూడా కేంద్ర బిందువుగా మారిన విషయాన్ని పోలీసులు గుర్తించి వారిపై నిఘా పెంచారు. సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తున్నా రు. తొలిసారైతే సాధారణ కేసులు, రెండు, మూడోసారి అయితే పీడీ యాక్టులు పెడుతున్నారు. రాష్ట్రానికి పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు పలు మార్గాల్లో చొరబడుతున్నాయని టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గుర్తించాయి.

దందా నడిచేది ఇలా 
రాష్ట్రంలో పలు లైసెన్స్‌ పొందిన విత్తన కంపెనీలు ఉన్నాయి. ఇవి నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తాయి. తయారీకి ముందు రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తాయి. విత్తనాలు సేకరించాక వాటిని తొలుత పలు దశల్లో ప్రాసెస్‌ చేస్తాయి. తర్వాత వాటికి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తాయి. అందులో తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలను తిరస్కరించి, మిగిలిన వాటికి రైతుల కోసం ప్యాకింగ్‌ చేస్తాయి. ఇందుకోసం రైతులకు, సీడ్‌ కంపెనీలకు మధ్యలో కొందరు దళారులుగా ఉంటారు. వీరిని సీడ్‌ ఆర్గనైజర్లు అంటారు. తిరస్కరించిన విత్తనాలను వీరు తిరిగి రైతులకు అప్పగించాలి. అయితే ఈ విత్తనాలకు ఎంతోకొంత ఇచ్చి వాటిని రైతుల నుంచి సేకరిస్తారు. పైగా ఈ ఆర్గనైజర్లు రైతులకు అప్పులు ఇస్తారు. రైతుల నుంచి సేకరించి, కంపెనీకి పంపిన విత్తనాలు ల్యాబ్‌లో పరీక్షల అనంతరం నాణ్యమైనవని తేలితే అప్పు పోగా, మిగిలిన డబ్బును రైతులకు చెల్లిస్తారు. ఒకవేళ ఫెయిల్‌ అయితే రైతు తిరిగి వారికే అప్పు చెల్లించాలి. ఈ వ్యవస్థ జిల్లాల్లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక ఫెయిలైన వాటిని ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో నింపి మళ్లీ రైతులకే విక్రయిస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రముఖ బ్రాండ్ల లోగోలను ప్యాకెట్లపై ముద్రించి మరీ అమ్ముతున్నారు.

పగులగొట్టరు.. రైతులకు ఇవ్వరు 
పత్తి విత్తన చట్టం ప్రకారం ఫెయిలైయిన విత్తనాలను కంపెనీలు, ఆర్గనైజర్లు ఆయా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ అధికారుల సమక్షంలో పగులగొట్టాలి. ఇలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఫెయిల్‌ అయిన విత్తనాలను ఆర్గనైజర్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఎవరైనా రైతులు కావాలని గట్టిగా పట్టుబడితే నామమాత్రంగా కిలోకు రూ.200 మించకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్‌ విత్తనాలకు ఆర్గనైజర్లు రంగులద్ది లూజ్‌గా విక్రయిస్తున్నారు.

ఈ ఏడాది అత్యధికంగా కేసులు 
2014లో 3 కేసులు, 2015లో 25 కేసులు, 2016లో 31 కేసులు, ఏడు పీడీ కేసులు 2017లో 69 కేసులు, మూడు పీడీ కేసులు, 2018లో 115 కేసులు, ఒక పీడీ యాక్టు, 2019లో 160 కేసులు, రెండు పీడీ యాక్ట్‌లు, 2020లో 112 కేసులు, 14 పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో జనవరి 1 నుంచి జూన్‌ 19 వరకు ఏకంగా 321 కేసులు, 7 పీడీ యాక్టు కేసులు నమోదయ్యాయి. 446 మందిని అరెస్టు చేశారు. 4,940 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరినీ ఉపేక్షించేది లేదు.. 
‘నకిలీ విత్తనాలకు సంబంధించిన కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. రైతులకు నష్టం కలిగించే విత్తనాల విషయంలో మోసాలను ఉపేక్షించేది లేదు. ఈ క్రమంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విత్తన డీలర్లు, సీడ్‌ ఆర్గనైజర్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజలకు కూడా ఎలాంటి చిన్న సమాచారం తెలిసినా డయల్‌ 100 లేదా సమీపంలోని పోలీసు స్టేషన్‌లో సమాచారమివ్వండి.’
- ఐజీ నాగిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement