ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో ఏపీ విద్యార్థులు
ఇన్స్పైర్ –2016లో విజేతలైన వారి ఆవిష్కరణల ప్రదర్శన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఇన్స్పైర్ –2016లో విజేతలైన రాష్ట్ర విద్యార్థులు శనివారం ఢిల్లీలో ప్రారంభమైన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఏపీ నుంచి అరుగురు విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన కె. నరేంద్ర రూపొందించిన ఆటోమేటిక్ హెల్మెట్ అందరినీ అకట్టకుంది. హెల్మెట్ పెట్టుకుంటేనే వాహనం స్టార్ట్ అయ్యేలా ఈ హెల్మెట్‌ను రూపొందించారు. ఆస్పత్రుల్లో పిల్లల అపహరణను అరికట్టేందుకు, సెలైన్ అయిపోగానే ఆలారం మోగేలా గుంటూరు జిల్లా విద్యార్థి శ్రీకృష్ణ వినూత్న పరికరాన్ని రూపొందించారు.
పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా ఓటు హక్కు వినియోగించుకొనేలా అనంతపురం జిల్లా విద్యార్థి శ్రీనేష్ సరికొత్త వ్యవస్థను రూపొందించాడు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బిబి ఆయేషా అరటి కాండంతో వివిధ రకాల వస్తువులను తయారు చేసుకొనే విధానాన్ని ప్రదర్శించింది. విశాఖకు చెందిన శిరీష వాటర్ హాయెసెంట్ను రూపొందించింది. ప్రజల ఆర్యోగ సమస్యలకు ప్రధాన కారణమైన వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి ‘ఆక్వా సైలెన్సర్’ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణలపై విద్యార్థులతో పాటు వచ్చిన ఉపాధ్యాయులు స్పందిస్తూ.. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనల ద్వారా రూపొందించిన అవిష్కరణలపై పేటెంట్ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆవిష్కరణల్లో కొన్నింటిని ఎంపిక చేసి త్వరలో జపాన్‌లో జరిగే ఫెస్టివల్ ఇన్నోవేషన్‌కు పంపనున్నట్టు వారు తెలిపారు.