నేటి నుంచి పూల జాతర
పూల బతుకమ్మ.. బతుకునిచ్చే తల్లివమ్మా...
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు నెలవు
ఎంగిలి మెతుకులతో మొదలు
సద్దుల బతుకమ్మతో ముగింపు
పండుగకు సిద్ధమైన పల్లెలు
జగదేవ్పూర్: బతుకునిచ్చేదే బతుకమ్మ.. కలిసి బతుకమని చెప్పేదే బతుకమ్మ.. జన జీవన సౌందర్యమే బతుకమ్మ.. ఈ పండుగ వచ్చిందంటే చాలు పల్లెలు, పట్టణాలన్నీ కోలాహలంగా మారుతాయి. రంగుల రంగుల పూలు... సన్నాయిని మించిన చప్పట్లు.. కోకిలమ్మలా రాగాలు... చెమట చుక్కల పదాలు... నెమలి నాట్యాలు... తీరొక్క కొత్త బట్టలు.. పాడి పంటలు ఇంటికొచ్చే వేళ.. ఇవన్నీ కలగలిపితే బతుకమ్మ సంబరాలు.. ఈ పండుగొస్తే చాలు ఆడబిడ్డలు ఆనందంలో మునిగిపోతారు. ఏడాది గాథ బాధలను మర్చిపోయి తొమ్మిది రోజులు వైభోగంలో మునిగి తేలుతారు. ఎంగిలి మెతుకులతో మొదలై సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. శుక్రవారం ప్రారంభమై వచ్చేనెల 9న సద్దుల బతుకమ్మతో పండుగ ముగియనుంది.