కోదండరామ్‌ది ఫ్యూడల్ స్వభావం
⇒ టీజేఏసీ నేతలు రవీందర్, ప్రహ్లాద్, సుల్తానా విమర్శలు
⇒ ఆయన ఒక్కడి వల్లే జేఏసీకి ఇంత పేరు రాలేదు
⇒ టీజేఏసీ నుంచి తప్పుకొన్నాకే పార్టీ గురించి మాట్లాడాలంటూ లేఖ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నపుడు టీజేఏసీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగాక ఆ విషయా లను ప్రస్తావించాలని కోదండరామ్‌కు టీజేఏసీ నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్, తన్వీర్ సుల్తానా సూచించారు. ఆమ్ ఆద్మీ తరహాలో రాష్ట్రంలో ఒక పార్టీ అవసరమని కోదండరామ్ అంటున్నారని.. ఇలా మాట్లా డటం టీజేఏసీ నిర్ణయాలకు విరుద్ధమని అన్నారు. ఈ మేరకు వారు బుధవారం కోదం డరామ్కు ఒక లేఖ రాశారు.
ఆ లేఖ ప్రతిని హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసి, మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాల మేరకు, సామాజిక సమన్యాయ సాధన దిశగా కృషి చేస్తామని టీజేఏసీ విస్తృతస్థాయి సమా వేశంలో ప్రకటించి ఏడాది గడిచినా ఒక్కసారీ ఆ కార్యాచరణపై చర్చించలేదని వారన్నారు. ఆయా అంశాలపై టీజేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలోచర్చించి తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
టీజేఏసీ రాజకీయ పార్టీగా మారదు
టీజేఏసీ ప్రజా సంఘంగానే ఉంటుందని, రాజకీయ పార్టీగా మారదని.. దీనిపై గతంలో తీర్మానం కూడా చేశారని నేతలు గుర్తు చేశా రు. జేఏసీలో రాజకీయ పార్టీలను చేర్చుకోమని, రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయమని కూడా నిర్ణయించామని పేర్కొ న్నారు. కానీ కోదండ రామ్ చేస్తున్న ప్రకటన లు, ఉపన్యా సాలు, అభిప్రాయాలు అందు కు విరుద్ధంగా ఉంటు న్నాయని వ్యాఖ్యానిం చారు. సమష్టి కృషి, అనేక త్యాగాలు చేసిన ఫలితంగా టీ జేఏసీ పట్ల తెలంగాణ సమా జంలో విశ్వాసం వ్యక్తమవుతోందని, అది కోదండరామ్ ఒక్కరి వల్ల వచ్చింది కాదన్నారు.
కోదండరామ్ పొందుతున్న కీర్తి అంతా ఆయనను తాము చైర్మన్‌గా ఆమోదించడం వల్ల వచ్చిందేనన్న వాస్తవాన్ని గుర్తించడం లేదన్నారు. కోదండరామ్ వల్లే అందరికీ గుర్తింపు వస్తోందన్న ధోరణి ఆయనలో దాగిఉన్న ఫ్యూడల్ స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.
తమలాగా కోదండ రామ్‌కు త్యాగాల చరిత్ర లేదని.. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన ఒక్క త్యాగ మేదైనా ఉందా అని ప్రశ్నించారు. అనేక మంది ఆత్మబలిదానాల ఫలితాన్ని, అనేక మంది ఆలోచనలు, ఆచరణ నిబద్ధతలను కోదండరామ్ తన ఒక్కడి ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. టీజేఏసీ నాయకత్వంలో రెండో పేరు ప్రస్తావనలో లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. దళిత, బహుజనులంటే బానిసలన్న భావన, మహిళలంటే గౌరవం లేకుండా కోదండరామ్ వ్యవహరిస్తున్నా రని... అందరూ తన కోసమే పనిచేయాలన్న, తన ఆదేశాలనే పాటించాలన్న ‘థాట్ పోలీసింగ్’ విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు.