రేపు ఐదో విడత పోరు
12 రాష్ట్రాల్లో 121 స్థానాలకు ఎన్నికలు
ముగిసిన ప్రచారం.. బరిలో 1,769 మంది
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి 12 రాష్ట్రాల్లోని 121 నియోజకవర్గాల్లో మంగళవారం ప్రచార ఘట్టం ముగిసింది. కర్ణాటకలో 28 సీట్లు, రాజస్థాన్‌లో 20, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 11, ఒడిషాలో 11, మధ్యప్రదేశ్‌లో 10, బీహార్‌లో 7, జార్ఖండ్‌లో 6, పశ్చిమబెంగాల్లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో 1, మణిపూర్‌లో 1 చొప్పున స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఆయా రాష్ట్రాల్లో తమతమ పార్టీల తరఫున ప్రచారానికి విస్తృతంగా పర్యటించారు. 121 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 1,769 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కేంద్రమంత్రులు సుశీల్‌కుమార్‌షిండే, వీరప్పమొయిలీ (కాంగ్రెస్), మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ (జేడీఎస్), నందన్ నీలేకని (కాంగ్రెస్), లాలుప్రసాద్ పెద్ద కుమార్తె మీసా భారతి (ఆర్జేడీ) తదితర ప్రముఖులు వీరిలో ఉన్నారు.
మేనక ఆస్తులు రూ. 40 కోట్లు.. రెండు కేసులు
ఐదో విడత ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రముఖుల్లో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ యూపీలోని పిలిభిత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె తనకు రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. సంజయ్‌గాంధీ జంతు సంరక్షణ కేంద్రం చైర్‌పర్సన్‌గా ఉన్న మేనక (57).. తనపై ఐపీసీ సెక్షన్ 394 (దోపిడీ చేస్తూ ఉద్దేశపూర్వకంగా గాయపరచటం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపులు) కింద రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు.
వరుణ్ ఆస్తులు రూ. 20 కోట్లు, 3 తుపాకులు
ఇక వచ్చే నెల 5న జరగనున్న ఏడో విడత ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు ఈ నెల 19వ తేదీ తుది గడువు కావటంతో.. బీజేపీ అభ్యర్థి వరుణ్‌గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేశారు. తనకు రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో వరుణ్ (34) వెల్లడించారు. ఇందులో రూ. 11 కోట్లు తన బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని చెప్పారు. తనకు ఎలాంటి వాహనం లేదని, ఢిల్లీలో సొంత ఇల్లు ఉందన్నారు. ఇక సుల్తాన్పూర్ పొరుగునే ఉన్న అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాహుల్‌గాంధీ ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్‌బిశ్వాస్ నామినేషన్లు వేశారు. బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా అమేథీలో నామినేషన్లు వేశారు. క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఫూల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. తనకు రూ.10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కైఫ్ వెల్లడించారు.