సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్