విషాదాంతం
= రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
= ఉదయ్ మృతదేహం లభ్యం
= ఆచూకీ లభించని అనిల్
= ప్రత్యేక బోట్ల సాయంతో గజ ఈతగాళ్ల గాలింపు
= మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింపు
= మూగబోయిన శాండిల్‌వుడ్
సాక్షి, బెంగళూరు: మాస్తిగుడి సినిమా చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో సోమవారం గల్లంతైన కన్నడ చిత్రరంగానికి చెందిన ఫైటర్లు అనిల్, ఉదయ్ రాఘవల కోసం మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ గాలింపు కొనసాగింది. ఉదయ్ మృతదేహం లభ్యం కాగా అనిల్ ఆచూకీ మాత్రం లభించలేదు. సంఘటన స్థలంలో బాధిత కుటుంబ సభ్యుల రోదనల మిన్నంటుతున్నాయి. ఈ ఘటనకు కారణమని భావిస్తున్న దర్శకుడు నాగశేఖర్తో సహా ఐదుగురిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు దాఖలైంది. అనిల్, ఉదయ్‌లు గల్లంతైన రోజు రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న జాతీయ విపత్తు నిర్వహణ బృందం
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స ఫోర్స్-ఎన్డీఆర్ఎఫ్) నిపుణులతో పాటు రాష్ట్ర అగ్నిమాపక నిరోధక శాఖ నిపుణులు, స్థానిక జాలర్లు బోట్లు, తెప్పలతో పాటు సినిమా చిత్రీకరణకు ఉపయోగించే ఫ్లడ్‌లైట్ల సహాయంతో అర్ధరాత్రి వరకూ గాలించిన ఫలితం లేకపోయింది. దీంతో తాత్కాలికంగా గాలింపును నిలిపి వేసి మంగళవారం ఉదయం 8 గంటలకు తిరిగి ఎన్డీఆర్ఎఫ్కు చెందిన నాలుగు బోట్లతో సహా మొత్తం 9 బోట్లతో గాలింపు చర్యలు మొదలయ్యాయి. నటులు పైనుంచి పడిన స్థలానికి చేరుకున్న అధికారులు ప్రత్యేక కెమరాలను నీటి లోపలికి పంపించి పరిశీలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఇద్దరు స్కూబా డైవింగ్ నిపుణులు 30 అడుగుల లోతుకు వెళ్లి పరిశీలించినా నటుల ఆచూకీ లభించలేదు.
దీంతో బోరు బావిలో పడిన పిల్లలను వెలికితీసేందుకు రూపొందించిన పరికరం సహాయంతో బయటికి తీయడంలో విజయం సాధించిన నిపుణుడు అయిన రోబో మంజు కూడా చెరువులో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ గాలించాడు. మరో వైపు మంగళూరు నుంచి వచ్చిన ఐదుగురు సభ్యులతో కూడిన గజఈతగాళ్లు , స్కూబా డైవింగ్ దళం రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా అనిల్, ఉదయ్‌లు జాడ కనిపించలేదు.
కృత్రిమ సుడిగుండమే కారణమా!
సినిమా చిత్రీకణ సమయంలో దర్శకుడికి ప్రతి చిన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. అరుుతే ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే దర్శకుడికి లేదా స్టంట్మాస్టర్కు నీటికి సంబంధించి కనీస అవగాహన కూడా లేదని తెలుస్తోంది. తిప్పగుండనహళ్లి పూర్తి స్థారుు నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. ఘటన జరిగిన ప్రాంతంలో చెరువు లోతు 74 అడుగులు. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల వల్ల తిప్పగుండనహళ్లిలోకి కలుషిత నీరు, వ్యర్థాలు చేరిపోయాయి.
దీంతో చెరువులో 30 అడుగుల వరకూ పూడిక చేరింది. ఘటన సమయంలో హెలికాప్టర్ దాదాపు నిమిషం పాటు నిలబడి ఉంది. ఆ సమయంలో ప్రొఫెల్లర్ తిరగడం వల్ల నీటిలో కృత్రిమ సుడిగుండం ఏర్పడిందని, ఉదయ్, లలిత్‌లు అందులో పడి బయట పడలేక పోయారని కన్నడ చిత్ర రంగానికే చెందిన కొంతమంది స్టంట్ డెరైక్టర్లు చెబతున్నారు. అంతేకాకుండా దాదాపు 40 అడుగులు, అపై నుంచి మనిషి నీటిలోకి పడిన వెంటనే పది అడుగుల వరకూ మునుగుతాడని, ఆ సమయంలో నీరు ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెలుతుందని, ప్రస్తుతం ఘటన జరిగిన చెరువు ఉన్న కలుషితం కావడంతో ఆ నీరు ఊపిరితిత్తుల్లోకి పోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై ఉదయ్, రాఘవ ఎక్కువ సేపు ఈదలేక పోయాయి మునిగిపోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు ఇలాంటి స్టంట్లు చేసే సమయంలో ’ఫ్లోటింగ్ డ్రస్’ లను నటులు ధరించాల్సి ఉంటుంది. అయితే అటు వంటి ఏర్పాట్లు ఎక్కడా లేదు. అనిల్, ఉదయ్ రాఘవల కాళ్లకు కనీసం గాలి నింపిన చిన్నచిన్న ట్యూబులను కట్టి అటుపై ప్యాంటు ధరించినా నీటిలోకి పడిన వారు ఎక్కువ లోతుకు వెళ్లకుండా వెంటనే తేలేవారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కనీస విషయాలపై కూడా అవగాహన లేకుండా చిత్రీకరణకు అత్యుత్సాహం చూపించడం వల్లే ఘటన జరిగినట్లు చలనచిత్రం పోగొట్టుకోవాల్సి వచ్చిందని కన్నడ చిత్రరంగ నిపుణులు చెబుతున్నారు.
ఐదుగురిపై క్రిమినల్ కేసులు...
ఘటనకు సంబంధించి స్థానిక తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ ఫిర్యాదు చేశారు. మాస్తిగూడి సినిమా నిర్మాత సుందరగౌడ ప్రథమ నిందితుడిగా, దర్శకుడు నాగశేఖర, సహాయదర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌ను వరుసగా రెండో, మూడో, నాలుగో, ఐదో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సంఘటన జరిగినప్పటి నుంచి సుందరగౌడ, నాగశేఖర్, రవివర్మ సంఘటనా స్థలంలో లేకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు వీరే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసుకు సంబంధించి మొదటి ముద్దాయి సుందరగౌడను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.