కాంట్రాక్టు పద్ధతిలోనే వ్యవసాయ విస్తరణాధికారుల భర్తీ?
సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దుచేశాక వారిస్థానంలో 4,400 మంది విస్తరణాధికారులను నియమించాలని సర్కారు నిర్ణయించిన సంగతి విదితమే. అసలు కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని చెప్పిన తెలంగాణ సర్కారు.. ఈ పోస్టులను మాత్రం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోదని అంటున్నారు. నెలకు రూ. 10 వేల గౌరవ వేతనంతో నియమిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. పనితీరు ఆధారంగా భవిష్యత్తులో పరిస్థితిని బట్టి ఆయా పోస్టులను క్రమబద్దీకరిస్తారని తెలిసింది. వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారిని ఈ పోస్టుల్లో నియమిస్తారు. వీరంతా తమను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తారని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే ప్రతీ మండలానికి 9 లేదా 10 మంది విస్తరణాధికారుల చొప్పున నియమించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.