to final
-
FIFA World Cup Qatar 2022 Semi-Final: మెస్సీ మాయ...
అంతా తానై జట్టును ముందుడి నడిపిస్తున్న లయెనెల్ మెస్సీ తన ‘ప్రపంచకప్’ కలను నిజం చేసుకోవడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 0–3తో క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. నాలుగేళ్ల తర్వాత మెస్సీ సారథ్యంలోనే క్రొయేషియాపై అర్జెంటీనా 3–0తో ప్రతీకార విజయం సాధించింది. ఆనాడు అంతగా ప్రభావం చూపని మెస్సీ ఈసారి మాత్రం విశ్వరూపమే ప్రదర్శించాడు. మైదానం మొత్తం పాదరసంలా కదులుతూ క్రొయేషియా డిఫెండర్లకు చుక్కలు చూపించాడు. ఒక గోల్ చేయడంతోపాటు తనను ఆరాధ్యంగా భావించే 22 ఏళ్ల జూలియన్ అల్వారెజ్‌కు రెండు గోల్స్ చేయడానికి సహకరించాడు. ఫలితంగా అర్జెంటీనా ఆరోసారి ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1986లో చివరిసారి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ జగజ్జేత కావడానికి గెలుపు దూరంలో ఉంది. దోహా: గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఐదుసార్లూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అర్జెంటీనా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఆరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ ఆడిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అద్భుత ఆటతీరుతో క్రొయేషియా అడ్డంకిని అధిగమించి దర్జాగా ఆరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 88,966 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన లుసైల్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0 గోల్స్ తేడాతో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (34వ ని.లో) ఒక గోల్ చేయగా... జూలియన్ అల్వారెజ్ (39వ, 69వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మొరాకోజట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. అర్జెంటీనా 1978, 1986లలో ప్రపంచ చాంపియన్‌గా... 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో... నాకౌట్ మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా చివర్లో షూటౌట్లో విజయం సాధించడం క్రొయేషియా అలవాటుగా మార్చుకుంది. ఆరంభంలోనే గోల్స్ చేసి క్రొయేషియాను ఒత్తిడికి నెట్టాలనే వ్యూహంతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఆట 34వ నిమిషంలో ‘డి’ ఏరియాలో అల్వారెజ్ను క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. మెస్సీ ఎడమ కాలితో కొట్టిన షాట్ బుల్లెట్ వేగంతో క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. అర్జెంటీనా 1–0తో ఆధిక్యం సంపాదించింది. ఐదు నిమిషాల తర్వాత అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ చేరింది. మధ్య భాగంలో ఉన్న మెస్సీ బంతిని అల్వారెజ్‌కు పాస్ ఇవ్వగా అతను వాయువేగంతో క్రొయేషియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ‘డి’ ఏరియాలోకి వచ్చాడు. అదే జోరులో గోల్కీపర్ను తప్పిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి అర్జెంటీనా 2–0తో ముందంజలో నిలిచింది. తక్కువ అంచనా వేయకుండా... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో ఆధిక్యంలో నిలిచినా చివర్లో తడబడి రెండు గోల్స్ సమర్పించుకొని చివరకు షూటౌట్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ప్రమాదకరమైన క్రొయేషియా జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అర్జెంటీనా రెండో అర్ధభాగంలోనూ జాగ్రత్తగా ఆడింది. బంతి ఎక్కువ శాతం క్రొయేషియా ఆటగాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ వారిని ‘డి’ ఏరియా వరకు రానివ్వకుండా చేయడంలో అర్జెంటీనా డిఫెండర్లు సఫలమయ్యారు. మ్యాచ్ మొత్తంలో క్రొయేషియా కేవలం రెండుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టడం గమనార్హం. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్, పెరిసిచ్, బ్రోజోవిచ్, కొవాసిచ్లను అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. వారెవ్వా.. ఏమి గోల్..... ఆట 57వ నిమిషంలో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్ చేరేదే కానీ మెస్సీ కొట్టిన షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు గోల్‌కీపర్ లివకోవిచ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో అద్భుతమే జరిగింది. తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో మెస్సీ నిరూపించాడు. కుడి వైపున బంతి అందుకున్న మెస్సీ పాదరసంలా కదులుతూ ముందుకు వెళ్లగా... అతని వెంబడే క్రొయేషియా డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ పరుగెత్తాడు. గ్వార్డియోల్ అన్ని రకాలుగా మెస్సీని నిలువరించాలని చూసినా... ఈ అర్జెంటీనా స్టార్ మాత్రం కనువిందులాంటి డ్రిబ్లింగ్‌తో అలరించాడు. చివరకు గోల్‌లైన్ అంచుల్లోంచి గ్వార్డియోల్ కాళ్ల సందులోంచి బంతిని మెస్సీ క్రాస్ పాస్ ఇవ్వగా... అక్కడే ఉన్న అల్వారెజ్ నేర్పుతో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ గోల్‌ను కళ్లారా చూసిన వారందరూ మెస్సీ మ్యాజిక్కు ఫిదా అయిపోవడమే కాకుండా ఈ గోల్‌ను చిరకాలం గుర్తుంచుకుంటారు. అర్జెంటీనా ఆధిక్యం 3–0కు పెరగడంతో క్రొయేషియా విజయంపై ఆశలు వదులుకుంది. మరోవైపు అర్జెంటీనా చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా... ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి వరల్డ్‌కప్ అవుతుందని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ, తన ఆఖరి పోరులో గెలిచి చరిత్రకెక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ‘నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించబోతున్నాను. నా చివరి మ్యాచ్‌గా ఫైనల్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మరోసారి వరల్డ్‌కప్ అంటే చాలా దూరంలో ఉంది. నేను అప్పటి వరకు ఆడలేనని తెలుసు. వరల్డ్‌కప్‌లో వేర్వేరు రికార్డులు నా దరిచేరడం మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యం జట్టుగా మా లక్ష్యం ఏమిటనేది. అది సాధిస్తేనే అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చాం. ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని 35 ఏళ్ల మెస్సీ వ్యాఖ్యానించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2: ప్రపంచకప్‌లో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఫైనల్ చేరడం అర్జెంటీనాకిది రెండోసారి. 1990లోనూ అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 1982లో పశ్చిమ జర్మనీ... 1994లో ఇటలీ... 2010లో స్పెయిన్ కూడా ఈ ఘనత సాధించాయి. జర్మనీ, ఇటలీ రన్నరప్‌గా నిలువగా... స్పెయిన్ మాత్రం టైటిల్ సాధించింది. 2: జర్మనీ తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్లో రెండుసార్లు మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ తేడాతో గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. 3: వరుసగా ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ గత నాలుగు ప్రపంచకప్‌లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి మాత్రం ఏకంగా మూడు గోల్స్ చేశాడు. 5: ఒకే ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. 6: ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. జర్మనీ అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరింది. బ్రెజిల్, ఇటలీ (6 సార్లు చొప్పున) సరసన అర్జెంటీనా నిలిచింది. 16: ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఒకే సంవత్సరం ఇన్ని గోల్స్ అందించడం ఇదే ప్రథమం. 25: ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. లోథర్ మథియాస్ (జర్మనీ–25 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఫైనల్లోనూ మెస్సీ బరిలోకి దిగితే ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. -
‘రాకెట్’వేగంతో ఆట
ఉత్కంఠగా బ్యాడ్మింటన్ టోర్నీ–నేడు ఫైనల్స్ బాలుర మ్యాచ్‌లు 173, బాలికల మ్యాచ్‌లు 79 ఆశలు రేకెత్తించిన జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అండర్–15 ఫైనల్‌కు ప్రవేశించిన సింగిల్స్, డబుల్స్‌లో పవన్కష్ణ జోడి ఖమ్మం స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ కోర్టులో అటూ ఇటూ వేగంగా కదులుతూ..ప్రత్యర్థి బ్యాట్‌తో కొట్టిన రాకెట్‌ను మిస్సవకుండా అవతలి కోర్డులోకి పంపేస్తూ..పాయింట్లు పెంచుకునేందుకు క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఆడేస్తున్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–13, 15 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజైన శుక్రవారం పోటీలు ఉత్కంఠగా సాగాయి. విద్యార్థులు సింగిల్స్, డబుల్స్‌లలో అద్భుత ప్రతిభను చూపి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. పోటీల్లో ఖమ్మంకు చెందిన టి.పవన్కష్ణ, బి.రితిన్లు చక్కని ఆటతీరును ప్రదర్శిచి ఫైనల్స్‌కు చేరుకొవడం విశేషం. అండర్–15 బాలుర సింగిల్స్ సెమీఫైనళ్లలో టి.పవన్కష్ణ–టి.వశీకష్ణపై 21–12, 21–13 తేడాతో అవలీలగా నెగ్గాడు. అండర్–15 బాలుర విభాగం డబుల్స్‌లో బి.రితిన్, టి.పవన్కష్ణ (ఖమ్మం)–బీవీ.ఉన్నిత్కష్ణ, ఎస్.సాయిపథ్వీ (హైదరాబాద్)పై 21–12, 21–08 తేడాతో నెగ్గి ఫైనల్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అండర్–15 బాలికల డబుల్స్‌లో కె.భార్గవి (రంగారెడ్డి ) –శ్రీవిద్య (హైదరాబాద్) 21–12, 21–17 తేడాతో నెగ్గి సెమీఫైనల్స్‌కు, ఎం.మేఘానరెడ్డి–(హైదరాబాద్)– కె.అనూష(ఖమ్మం)పై 21–12, 21–10 తేడాతో నెగ్గి సెమీస్‌కు చేరారు. బాలుర అండర్–13విభాగంలో పి.సహాస్కుమార్(మెదక్)– ఎన్.అనిరు«ద్ (వరంగల్) పై 21–18, 21–17 తేడాతో గెలిచారు. మొత్తం బాలుర మ్యాచ్‌లు 173, బాలికల మ్యాచ్‌లు 79 జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు, క్రీడాభిమానులతో పటేల్ స్టేడియం ప్రాంగణం కళకళలాడింది. శనివారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. ===================== అండర్–13 బాల, బాలికల క్వార్టర్స్ఫైనల్ ఫలితాలు.. బాలుర విభాగంలో పోటీలు క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. పి.షాహాస్కుమార్(మెదక్)–టి.రుక్షేంద్ర(రంగారెడ్డి)పై 21–06, 15–21, 21–17, ఎన్.అనిరు«ద్(వరంగల్)–పి.వాయునందన్‌రెడ్డి(రంగారెడ్డి)పై 21–16, 21–16 తేడాతో, ఎం.శశాంక్సాయి(హైదరాబాద్)–జి.అభినయ్సాయిరాం(వరంగల్)పై 21–15, 21–15 పై గెలుపొందారు. సి.శ్రియ(రంగారెడ్డి)–ఎన్.శ్రీనిత్య(రంగారెడ్డి)పై 21–11, 21–09 తేడాతో, జి.పూజిత(రంగారెడ్డి)–డి.శ్రావ్య(హైదరాబాద్)పై 21–14, 21–15 తేడాతో, ఎం.మేఘానరెడ్డి(హైదరాబాద్)–జి.సంజన(రంగారెడ్డి)–21–14, 21–107 తేడాతో, కె.అశ్రిత(ఖమ్మం)–వి.శ్రేయంనింషీ(మెదక్) పై 21–07, 21–07 తేడాతో క్వార్టర్ ఫైనల్లో నెగ్గి సెమీస్‌కు చేరారు. సెమీస్‌లో ఎం.మేఘన రెడ్డి(హైదరాబాద్)–కె.అశ్రిత(ఖమ్మం)21–12, 21–10 తేడాతో గెలుపొందింది. అండర్–15 ఫలితాలు.. అండర్–15 బాలుర క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న క్రీడాకారులు వీరే..: టి.పవన్కష్ణ(ఖమ్మం), బి.యశ్వంత్రామ్(హైదరాబాద్)21–14, 21–16 తేడాతో, టి.వంశీకష్ణ(రంగారెడ్డి)–పథ్వీకపూర్(హైదరాబాద్)పై 23–21, 17–21, 21––14 తేడాతో, బి.రితిన్(వరంగల్)–కె.వసంత్‌రెడ్డి(మెదక్) పై 21–10, 21–10 తేడాతో, డీఏ.అదిత్య(రంగారెడ్డి)–కె.భార్గవ్రామిరెడ్డి(ఖమ్మం)పై 21–15, 21–11 తేడాతో గెలపొందారు. బాలుర విభాగం డబుల్స్‌లో..: బి.రితిన్, టి.పవన్కష్ణ(ఖమ్మం)– కె.వర్షంత్రెడ్డి, పథ్వీకపూర్(హైదరాబాద్) 21–12, 21–15 తేడాతో, బీవీ.ఉన్నిత్కష్ణ, ఎస్.సాయిపథ్వీ(హైదరాబాద్), బి.యశ్వంత్రామ్, కె.రోహిత్‌రెడ్డి(హైదరాబాద్) 21–15, 15–21, 21–17 తేడాతో గెలుపొందారు. అశ్రయ్కుమార్, పి.సాకేత్‌రెడ్డి(రంగారెడ్డి) బి.నిఖిల్రాజ్, వి.నిఖిల్(హైదరాబాద్) 13–21, 21–17, 21–19 తేడాతో, ఎ.మోనిష్, జతిన్వర్మ(మెదక్)–డి.అభినవ్, టి.విఘ్నేష్(రంగారెడ్డి) 16–21, 21–18, 21–19 తేడాతో గెలిచారు. అండర్15 బాలికలడబుల్స్లో..: కె.అభిలాష, ప్రణవి(హైదరాబాద్)–డి.అనుసోఫియా, వైసాయిశ్రియ(హైదరాబాద్)21–10, 21–11తేడాతో, కె.భార్గవి, వై.కైవల్యాలక్ష్మి(హైదరాబాద్)– సమీరా, వి.తనుశ్రీ(వరంగల్) 21–05, 21–0 తేడాతో నెగ్గారు.