నేడే బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీలు
– హోరా హోరీగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లు
తిరుపతి సెంట్రల్ : తిరుపతిలో జరుగుతున్న ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గత నాలుగు రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో గెలిచి పలువురు క్రీడాకారులు తుదిపోరుకు అర్హత సాధించారు. నేడు శనివారం జరిగే ఫైనల్ పోటీల్లో అండర్ –17, అండర్ –19 విభాగాల చాంపియన్లు ఎవరో తేలనుంది.
ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారులు
బాలుర సింగిల్స్ అండర్ –17 విభాగంలో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఎయిర్ ఇండియా) 21–6, 19–21, 21–15 తో అభ్యన్స్ సింగ్ (యూపీ)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. బాలుర డబుల్స్ విభాగంలో కదీర్ మోయినుద్దీన్ మహమ్మద్, విష్ణువర్ధన్ గౌడ్ (తమిళనాడు), 21–9,22–20తో ఇషాంత్ భట్నాగర్, ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్)పై గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించారు. మిక్స్డ్ అండర్– 19 విభాగంలో ధవ్ కపిల (పంజాబ్), కుహూ గార్గ్ (ఉత్తర ప్రదేశ్) తమ ప్రత్యర్థి చద్రకుమార్ (యూపీ), సోనికా సాయి (ఏపీ) పై 17–21,21–16,21–10తె గెలుపొందారు. మరో సెమీఫైనల్లో కష్ణప్రసాద్ (ఏపీ),మహిమా అగర్వాల్ తమ ప్రత్యర్థి కష్ణ సాయి కుమార్ పొదిలె (టీఎస్), నీలా (తమిళనాడు) జట్టుపై 21–8,21–12 గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు.
బాలికల సింగిల్స్ అండర్– 17 విభాగంలో ఆకర్షి కశ్యప్ (చంఢీగర్) తన ప్రత్యర్థి మాలవిక బన్సాద్ (మహారాష్ట్ర)పై 21–18,21–15తె , అదేవిధంగా ప్రషి జోషీ (ఎయిర్ ఇండియా) 21–16,16–21,21–8తో ఉన్నతి బిస్ట్ (ఉత్తర ప్రదేశ్)పై గెలిచింది. బాలికల డబుల్స్ అండర్ –17 విభాగంలో అశ్విని భత్, మిథులా (ఉత్తరా ఖండ్) 21–9,21–14తో కెవురా మోపటి (టీఎస్), కావి ప్రియ (పాండిచ్చేరి)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించారు.