అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) కామర్స్ ప్రిపరేషన్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డులో అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదలైంది. దీనిద్వారా మొత్తం 115 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీకామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఇదో గొప్ప అవకాశం. రూ.16,400- రూ.49,870 వేతన స్కేలున్న ఈ ఉద్యోగాన్ని చేజిక్కించుకుంటే సుస్థిర కెరీర్ సొంతమైనట్లే! ఈ నియామకాలకు నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లుంటాయి. మొదటిది అందరికీ తెలిసిన జనరల్ స్టడీస్ కాగా, రెండోది కామర్స్ పేపర్. విజయానికి కీలకమైన రెండో పేపర్లో అధిక మార్కుల సాధనకు సబ్జెక్టు నిపుణుల సలహాలు...
అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షలోని రెండు పేపర్లకు ఒక్కో దానికి 150 చొప్పున మార్కులుంటాయి. రెండో పేపర్ కామర్స్‌లో ఇచ్చే ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కామర్స్‌లో అకౌంటింగ్ ముఖ్యమైన సబ్జెక్టు. దీనికి సంబంధించిన చాలా అంశాలు అసిస్టెంట్ నియామక పరీక్ష సిలబస్‌లో ఉన్నాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే తొలుత ప్రాథమిక అంశాలను నేర్చుకొని, వాటి అప్లికేషన్స్‌ను డిగ్రీ స్థాయిలో అధ్యయనం చేయాలి.
వ్యాపార గణక శాస్త్రం (అకౌంటింగ్)
1. ఫైనాన్షియల్ అకౌంటింగ్: అకౌంటింగ్ బేసిక్స్, చిట్టా పద్దులు, ఆవర్జా, సహాయక చిట్టాలు, నగదు పుస్తకం, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ, అంకణా, ముగింపు లెక్కలు, తప్పుల సవరణ, తరుగుదల, రిజర్వ్‌లు-ఏర్పాట్లు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. వీటి కాన్సెప్టులపై పట్టుసాధించి, తర్వాత పూర్తిస్థాయిలో ఆబ్జెక్టివ్‌గా ప్రిపరేషన్ కొనసాగించాలి.
2. అడ్వాన్స్డ్ అకౌంటింగ్: ఒంటిపద్దు విధానం, అద్దె-వాయిదాల కొనుగోలు పద్ధతి, వ్యాపారేతర సంస్థల ఖాతాలు, బ్రాంచి ఖాతాలు, భాగస్వామ్య ఖాతాలు, జీవిత బీమా ఖాతాలు, డిపార్టుమెంట్ ఖాతాలు, బ్యాంకు ఖాతాలుంటాయి.
3. కార్పొరేట్ అకౌంటింగ్లో గుడ్‌విల్, వాటాలు, డిబెంచర్లు జారీ, విమోచనం, కంపెనీ ముగింపు లెక్కలు, బోనస్ వాటాలు, నమోదుకు ముందు లాభాలు, సంయోగం-అంతర్గత పునర్నిర్మాణం అంశాలపై దృష్టిసారించాలి.
ప్రశ్న కోణాన్ని పట్టుకోవాలి:
ఏ అంశాన్ని చదువుతున్నా, దాని మూలాలపై పట్టుసాధించి, ఆ అంశం నుంచి ఏ కోణాల్లో ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో గుర్తించాలి. అప్పుడే ప్రిపరేషన్ సంపూర్ణమవుతుంది. ఉదాహరణకు అకౌంటింగ్‌కు సంబంధించి అకౌంటింగ్ అంటే ఏమిటి? ఖాతాలు అంటే ఏమిటి? ఖాతాల రకాలు, వాటి సూత్రాలపై పూర్తిస్తాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. కేవలం సబ్జెక్టులో ఉన్న సమస్యలను నేర్చుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు. వ్యవహారాలను ఏఏ ఖాతాల్లో, ఏ విధంగా నమోదు చేయాలో తెలుసుకోవాలి.
కాస్టింగ్: ఇందులో వ్యయ నివేదిక, టెండర్, మెటీరియల్స్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్, బ్రేక్-ఈవెన్ విశ్లేషణ, బడ్జెట్ నియంత్రణ తదితర అంశాల గురించి తెలుసుకోవాలి.
వాణిజ్య శాస్త్రం
వ్యాపార నిర్వహణ, సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, హిందూ అవిభక్త కుటుంబం-కంపెనీలకు సంబంధించి థియరీపై మాత్రమే పట్టుసాధించాలి. ఇందులో సమస్యలుండవు. భాగస్వామ్యం, కంపెనీ చట్టాలు, లాభాలు, నష్టాలు వంటి అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.మేనేజ్మెంట్లో ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, విభాగీకరణ, సమన్వయం; వ్యాపార అర్థశాస్త్రంలో డిమాండ్-సప్లయ్‌ల విశ్లేషణ, ఉత్పత్తి విశ్లేషణ, మార్కెట్, వ్యాపార చక్రం, జాతీయ ఆదాయం, అంతర్జాతీయ వ్యాపారం వంటి అంశాలను చదవాలి.
ఆదాయ పన్ను: దీనికి సంబంధించి జీతాల నుంచి ఆదాయం, ఇంటి అద్దె నుంచి ఆదాయం, ఇతర ఆదాయాలు, స్థూల ఆదాయం, మొత్తం ఆదాయం అంశాలను నేర్చుకోవాలి. ఆదాయ పన్ను రిటర్న్‌లను ఏ విధంగా దాఖలు చేయాలి. వాటి సెక్షన్లు, తగ్గింపుల (ఏ సెక్షన్‌కు ఎంత తగ్గింపు ఉంటుంది..)పై అవగాహన అవసరం. అదే విధంగా వస్తు విక్రయ చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం, కంపెనీల చట్టం అంశాలను సంవత్సరాలతో సహా చదవాలి.
ఆడిటింగ్: ఇది పూర్తిగా థియరీ సబ్జెక్టు. ఇందులో ఆడిట్ ప్రణాళిక, నిర్వహణ, ఆర్థిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు, భారతదేశ ఆర్థిక పద్ధతి, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకు-ఖాతాదారుడు మధ్య సంబంధం, ఇన్సూరెన్స్ పద్ధతులు అంశాలకు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రత్యేక పుస్తకంలో రాసుకోవాలి. వీటిని వీలైనప్పుడల్లా రివిజన్ చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్-పరిచయం; ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆండ్రాయిడ్, ఐవోఎస్..), విండోస్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఈ-కామర్స్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
వివరాల నమోదు కీలకం
అకౌంటింగ్‌కు సంబంధించి ప్రతి చాప్టర్లో ఉన్న అంశాలను నేర్చుకోవాలి. అయితే సమస్యలను పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మూడు వరుసల నగదు పుస్తకంలో సమస్య మొత్తాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభ నిల్వలను ఎక్కడ నమోదు చేయాలి? ఒకవేళ ప్రతికూల నిల్వ అయితే ఎక్కడ రాయాలి? ఎదురు పద్దును ఏ విధంగా నమోదు చేయాలి? అంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. అదే విధంగా ముగింపు లెక్కల్లో వ్యవహారాల నమోదుపై అవగాహన అవసరం. సర్దుబాట్ల గురించి తెలుసుకోవాలి. పరీక్షకు ముందు గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. వీటి సహాయంతో ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాలి.