విదేశీ ఇన్వెస్టర్లకు ‘మ్యాట్’ ఊరట
ఫైనాన్స్ బిల్లు-2015పై చర్చలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టత...
⇒ ఐటీఆర్ ఫారాలను మరింత సరళం చేస్తామని హామీ..
⇒ ఎఫ్ఐఐలపై రెట్రోస్పెక్టివ్ పన్ను
⇒ అంశం సుప్రీంకోర్టులో ఉందని వెల్లడి...
⇒ లోక్‌సభలో మూజువాణి ఓటుతో
⇒ ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం..
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాస్త ఊరటనిచ్చారు.
కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు విషయంలో కొన్ని రకాల ఆదాయాలను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఎఫ్ఐఐలపై ఇక మ్యాట్ ఉండదని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా వివాదాస్పదమైన 14 పేజీల ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్) ఫారం స్థానంలో పూర్తిగా సరళీకరించిన కొత్త ఫారాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. గురువారం లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు-2015పై చర్చ అనంతరం జైట్లీ సమాధానమిస్తూ ఈ విషయాలను వెల్లడించారు.
ఇక ప్రధాన మంత్రి సామాజిక భద్రత పథకాలకు జరిపే చెల్లింపులను సేవల పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కూడా చెప్పారు. ముడి పట్టు, ఇనుప ఖనిజం, రబ్బరులపై పరోక్ష పన్నుల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయవ్యయ పద్దులు, పన్నులు ఇతరత్రా ప్రతిపాదనలతో కూడిన ఈ ఫైనాన్స్ బిల్లుకు... ఆ తర్వాత లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది. కాగా, భూసేకరణ బిల్లు వంటి కీలక సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని జైట్లీ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిస్థితులను అనువుగా మలచుకొని వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ చర్యలు చాలా అవసరమని ఆయన చెప్పారు.
మ్యాట్ మినహాయింపులు ఇలా...
గడిచిన మూడేళ్లకు సంబంధించి మూలధన లాభాలపై(ఈ మార్చి 31 వరకూ) ఎఫ్ఐఐలు 20% మ్యాట్ బకాయిలను చెల్లించాలంటూ రెవెన్యూ విభాగం ఇటీవలే డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. అయితే, దీనిపై ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తం కావడంతో కేంద్రం తాజాగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. షేర్ల లావాదేవీలు, వడ్డీల ద్వారా విదేశీ సంస్థలకు వచ్చిన ఆదాయాలపై అదేవిధంగా సాంకేతిక సేవలకుగాను ఆర్జించే రాయల్టీలు, ఫీజులను మ్యాట్ నుంచి మినహాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.
సాధారణ పన్ను రేటు 18.5% కంటే దిగువనున్న కేసులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. అయితే, ఎఫ్ఐఐ(వీరినే ఎఫ్‌పీఐలుగా వ్యవహరిస్తారు)లకు పాత బకాయిలకు(రెట్రోస్పెక్టివ్) సంబంధించి పన్నులపై జైట్లీ ఎలాంటి ఊరటనూ కల్పించకపోవడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎఫ్ఐఐలకు మ్యాట్ ఉండదని.. పాత బకాయిల విషయం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని జైట్లీ వివరించారు.
ఐటీఆర్‌ల విషయానికొస్తే...
⇒ కొత్తగా తీసుకొచ్చిన ఐటీఆర్ ఫారంలో అసెస్సీలు బ్యాంక్ ఖాతాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలంటూ ఐటీ శాఖ కొత్త నిబంధనలను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకతలు, విమర్శలు వ్యక్తం కావడంతో అత్యంత సులువైన రీతిలో కొత్త ఫారాన్ని త్వరలోనే తీసుకొస్తామని జైట్లీ ఈ వివాదానికి తెరదించారు.
⇒ తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజ ఎగుమతులు(గోవా నుంచి) పెంచేందుకు వీలుగా ఎగుమతి సుంకాన్ని ఇప్పుడున్న 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
⇒ ఇక సహజ రబ్బరుపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 25 శాతానికి పెంపు.
⇒ ప్రైవేటు రంగ డిఫెన్స్ పరికరాల తయారీ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లతో సమాన స్థాయిని కల్పించడం కోసం డిఫెన్స్ పీఎస్‌యూలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులకు కల్పిస్తున్న ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఉపసంహరణ.
ఆర్బీఐ అధికారాలకు కోతపై వెనక్కి...
రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారాలకు కోత విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రభుత్వ రుణ పత్రాల(బాండ్లు) నిర్వహణను ఆర్బీఐ నుంచి విడదీసి ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టింది. ప్రభుత్వ రుణ నిర్వహణ ఏజెన్సీ(పీఎండీఏ) ఏర్పాటు ప్రతిపాదనను ఫైనాన్స్ బిల్లు-2015 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఒక ప్రత్యేక రుణ నిర్వహణ ఏజెన్సీ నెలకొల్పేందుకు తగిన రోడ్‌మ్యాప్ తయారు చేసేందుకు ఆర్బీఐతో సంప్రతింపులు జరపనున్నట్లు ఆయన చెప్పారు.