సేవా పన్ను కట్టకుంటే కఠిన చర్యలే: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని సేవా పన్ను ఎగవేతదారులు సత్వరమే చెల్లింపులు జరపాలని లేని పక్షంలో కఠిన శిక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హెచ్చరించారు. ఎగవేతదారులుగా ముద్రపడిన వారు తమపై పడిన మచ్చను తొలగించుకోవడానికి ఇది సరైన సమయమని ఆయన చెప్పారు. స్వచ్ఛంద అనువర్తన ప్రోత్సాహక పథకంపై (వీసీఈఎస్) అవగాహన కార్యక్రమాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఇవి ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా కొనసాగుతాయి.
ఈ పథకాన్ని ఉపయోగించుకుని, సేవా పన్ను ఎగవేతదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, చెల్లింపులు జరపాలని చిదంబరం సూచించారు. ట్యాక్స్ ఫైల్ చేయని/చేయడం ఆపేసిన దాదాపు 10 లక్షల మంది కూడా ఎగవేతదారుల కిందకే వస్తారని, వారికి సైతం శిక్షలు తప్పవ న్నారు.ఏడేళ్ల దాకా జైలు శిక్ష..: నగదుపరమైన జరిమానాతో పాటు కఠిన శిక్షలు వేసేందుకు సర్వీస్ ట్యాక్స్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని చిదంబరం చెప్పారు. రూ. 50 లక్షల పైగా సేవా పన్ను వసూలు చేసి, ఖజానాకు జమచేయని వారికి ఏడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే కోల్కతాలో ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు.