Finance System
-
నూతన పన్ను విధానం.. త్వరలో ఆర్థిక శాఖ సమీక్ష!
న్యూఢిల్లీ: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి మినహాయింపు రహిత పన్ను వ్యవస్థను త్వరలో సమీక్షించాలని ఆర్థికశాఖ ప్రతిపాదిస్తోంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుకు ఈ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మలచడం దీని లక్ష్యమని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఎటువంటి మినహాయింపులు లేని పన్ను వ్యవస్థ ఆవిష్కరణ దిశగా నడవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. తద్వారా మినహాయింపులు, తగ్గింపులతో కూడిన సంక్లిష్టమైన పాత పన్ను విధానం రద్దు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► గత 2020–21 వార్షిక బడ్జెట్ ఒక కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వివిధ మినహాయింపులతో కూడిన పాత పన్ను వ్యవస్థ లేదా మినహాయింపులు, తగ్గింపులు లేని తక్కువ పన్ను రేట్లను అందించే కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించింది. ► వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడం ఈ చర్య ఉద్దేశం. ►కొత్త పన్ను వ్యవస్థకు సంబంధించి ఎదురయిన అనుభవాలను బట్టి చూస్తే.. తమ గృహ, విద్యా రుణ బాధ్యతలను పూర్తి చేసుకున్న వ్యక్తులు... ‘క్లెయిమ్ చేయడానికి ఎటువంటి మినహాయింపులు లేనందున’ కొత్త పన్ను విధానంలోకి మారడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ► కొత్త వ్యవస్థలో పన్నులను తగ్గించడం వల్ల... ఈ విధానం ఆకర్షణీయంగా మారుతుందని పలు వర్గాలు భావిస్తున్నాయి. కొత్త పన్ను వ్యవస్థ రేట్లు ఇలా... వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి 2020 ఫిబ్రవరి 1న ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయానికి పన్ను రేటు 5 శాతంగా ఉంది. రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం తగ్గిన పన్ను రేటును చెల్లించాలి. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు 20 శాతం, రూ.12.5 లక్షలు– రూ.15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు 25 శాతం, రూ.15 లక్షలపైబడినవారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ విషయంలో... రేట్లను గణనీయంగా తగ్గించడం, మినహాయింపులను తొలగించడం ద్వారా కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల కోసం ఇదే విధమైన పన్ను విధానాన్ని సెప్టెంబర్ 2019లో ప్రవేశ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలకు బేస్ కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటై, 31 మార్చి 2024లోపు కార్యకలాపాలను ప్రారంభించిన తయారీ కంపెనీలకు పన్ను రేట్లను 25 శాతం నుండి 15 శాతానికి కేంద్రం తగ్గించింది. చదవండి👉 Form 16a: పన్ను చెల్లింపులు కనిపించడం లేదా? అప్పుడేం చేయాలి? -
మందగమనంలో దేశ ఆర్థిక వ్యవస్థ
సాక్షి, ముంబై: ‘ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. గత రెండు మూడేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా గణాంకాలు అదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం శషభిషలు వదిలి రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రాలు ఎంత వేగంగా ఎదిగితే దేశం కూడా అంతే వేగంగా ఎదుగుతుందనే సత్యాన్ని గుర్తించాలి’అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న నాస్కాం టెక్నాలజీ లీడర్షిప్ ఫోరం–2020 కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మార్చి టు 5 ట్రిలియన్ ఎకానమీ రియాల్టీ ఆర్ ఆంబియష్’అనే అంశంపై మహీంద్రా ఎండీ సీపీ గార్నానీ నిర్వహిచిన చర్చలో పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు. దేశాభివృద్ధి పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నానని, కానీ కేంద్రం ఇంతటి భారీ లక్ష్యం అందుకోవాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరళీకృత ఆర్థిక నిబంధనలు, రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఉన్నప్పుడే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమని స్పష్టంచేశారు. టీమిండియా, ఫెడరల్ వంటి పదాలను ఆచరణలో చూపాల్సిన సమయం ఇదేనన్నారు. వీటితోపాటు ఫిస్కల్ ఫెడరిలాజాన్ని కూడా అనుసరించాలని అభిప్రాయపడ్డారు. మూలధన లభ్యతే ప్రధాన సమస్య తెలంగాణ వంటి వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలకు మూలధన లభ్యత ప్రధాన సమస్యగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణ నచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న విదేశీ కంపెనీలు, ఆర్థిక సంస్థలకు కఠినంగా ఉన్న కేంద్ర నిబంధనలు అడ్డంకిగా మారాయని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా నిధులు ఖర్చు చేయనప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ సాకారం కావడం సవాలేనన్నారు. ‘దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులను సేకరించి ఖర్చు చేస్తే అప్పులు పెంచుతున్నారంటూ చేస్తున్న వాదన అత్యంత సంప్రదాయ ఆర్థిక ఆలోచన. అభివృద్ధి చెందిన అన్ని ఆర్థిక వ్యవస్థలు పెద్ద ఎత్తున ఖర్చు చేసినందునే అక్కడ అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని పేర్కొన్నారు. అసెంబ్లింగ్ ఇన్ ఇండియాగా మారింది.. కేంద్ర ఆర్థిక నిబందనల సరళీకరణలతోపాటు పలు విధానాల రూపకల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. సేవారంగం, పర్యాటకం, వైద్యం, విద్య తదితర రంగాల్లో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్రాలకే బదిలీ చేయాలని అభిప్రాయపడ్డారు. సులభమైన నిబంధనలు ఉన్నప్పుడే తయారీ రంగంలో ఇతర దేశలతో మనదేశం పోటీ పడగలుగుతుందని.. బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, అపెరెల్ రంగంలో ముందున్నాయనే విషయం గుర్తించాలని సూచించారు. కేంద్ర నినాదమైన ‘మేక్ ఇన్ ఇండియా’కాస్తా ‘అసెంబ్లింగ్ ఇన్ ఇండియా’గా మారిందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందాలంటే భారీ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు, ప్రపంచంలోని పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదరాబాద్ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్ద వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. వీటికి ఉన్న జాతీయ ప్రాధాన్య దృష్ట్యా కేంద్రం సహకారం కోరినా ఇప్పటివరకు ఎలాంటి మద్దతూ ఇవ్వలేదని విమర్శించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులనే పట్టించుకోకుంటే భారీ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ఆయన ప్రశ్నించారు. నయా భారతానికి త్రీ ఐ మంత్ర.. గతంలో ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో దేశాభివృద్ధికి ‘త్రీ ఐ మంత్ర’పాటించాలని సూచించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇన్నోవేషన్ (నూతన ఆవిష్కరణలు), ఇన్ఫ్రాస్టక్చర్ (మౌలిక సదుపాయాలు), ఇంక్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి) ద్వారా నయా భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ నూతన ఆవిష్కరణలు చేయాలని, ఈ రంగంలో తెలంగాణ.. టీహబ్ వంటి భారీ ఇంక్యుబేటర్‌ను నెలకోల్పిందని తెలిపారు. దేశం వేగంగా ఎదుగుతున్నా.. అనుకున్నంత మేర మౌలిక సదుపాయాలు విస్తరించడంలేదన్నారు. ఈ రంగంలో 2014కి ముందు తెలంగాణలో సుమారు రూ.50వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే దాదాపు రూ.1.60 లక్షల కోట్లను ఖర్చు చేశామని వివరించారు. అలాగే పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం పెరగకుండా.. అవి సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగాలని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వి–హాబ్ను ప్రారంభించిందని పేర్కొన్నారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు విస్తరించాలని.. ఈ విషయంలో నాస్కాం ప్రత్యేక చొరవ చూపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు మంచి స్పందన వస్తోందని.. మరిన్ని కంపెనీలు అక్కడకు రావాలని కోరారు. -
రాష్ట్రానికి మరిన్ని రుణాలు!
సాక్షి, హైదరాబాద్: స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్డీపీ) గణనలో మార్పులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు 2004-05లో ఉన్న స్థిరధరల ప్రాతిపదికన కేంద్రం జీఎస్డీపీని లెక్కిస్తుండగా... ఇక నుంచి 2011-12 ధరలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ప్రతిపాదిత సంవత్సరం (బేస్ ఇయర్)ను మార్చడం వల్ల జీఎస్డీపీ గణాంకాల్లో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు పెరిగే అవకాశమున్నందున రుణ పరిమితికి వెసులుబాటు లభించనుంది. ఈ మార్పు నేపథ్యంలో ఇటీవలే అన్ని రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో అర్థగణాంక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి మదింపులో జీఎస్డీపీ కీలకమైన సూచిక. రాష్ట్ర భౌగోళిక హద్దుల లోపల నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల మొత్తం విలువను డబ్బు రూపంలో లెక్కించినప్పుడు స్థూల రాష్ట్రోత్పత్తి వస్తుంది. ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు)గా వర్గీకరించి ఆయా రంగాల వారీగా వృద్ధిని మదింపు చేస్తారు. ఏటా స్థిరధరల ప్రాతిపదికతో పాటు వర్తమాన ధరల లెక్కన కూడా జీఎస్డీపీని అంచనా వేస్తారు. 2004-05 స్థిరధరల ప్రాతిపదికన 2014-15లో తెలంగాణ స్థూల రాష్ట్రోత్పత్తి రూ.2,17,432 కోట్లుగా అంచనా వేశారు. 2013-14లో స్థూల రాష్ట్రోత్పత్తి రూ.2,06,427 కోట్లు. దీన్ని బట్టి 5.3 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు నిర్ధారించారు. అంతకు ముందు ఏడాది తెలంగాణలో 4.8 శాతం అభివృద్ధి సాధించగా... 2011-12లో 4.1 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద 2014-15 జీఎస్డీపీని రూ.4,30,599 కోట్లుగా అంచనా వేసినట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. గత ఏడాది ఇది రూ.3,91,751 కోట్లు మాత్రమే. 3.5 శాతానికి పెంచాలి... జీఎస్డీపీ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీఎస్డీపీలో 3 శాతానికి మించకుండా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. అయితే తాజాగా జీఎస్డీపీ గణనకు బేస్ ఇయర్‌ను మార్చితే.. స్థూల రాష్ట్రోత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతుందని.. అదనంగా అప్పు తీసుకునే వెసులుబాటు వస్తుందని పేర్కొంటున్నారు. జీఎస్డీపీ లెక్కింపునకు సంబంధించి వచ్చే నెలలో మరోసారి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అది పూర్తయితే జీఎస్డీపీ గణన విధానంపై మరింత స్పష్టత వస్తుందని, తాజా గణనను కొత్త విధానంలో చేపట్టాల్సి ఉంటుందని రాష్ట్ర అర్థగణాంక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. -
సకాల వర్ష అంచనాలతో..
118 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్ - 27,324 పాయింట్ల వద్ద ముగింపు - 38 పాయింట్ల లాభంతో 8,262కు నిఫ్టీ ముంబై: వర్షాలు సకాలంలోనే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉందని, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటులు నియంత్రణలోనే ఉన్నాయన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాఖ్యలు సెంటిమెంట్‌కు మరింత ఊపునిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 27,324 పాయింట్ల వద్ద, 38 పాయింట్లు లాభంతో 8,262 పాయింట్ల వద్ద ముగిశాయి. రానున్న ద్రవ్యపరపతి విధానంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో సెంటిమెంట్ బలపడిందనీ విశ్లేషణ. అంతా సవ్యంగా లేదు సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు పెరగడంతో ఇంట్రాడేలో 27,380 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 27,160 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మళ్లీ లాభాల్లోకి వచ్చి చివరకు 118 పాయింట్ల వృద్ధితో 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,279-8,212 పాయింట్ల మద్య కదలాడింది. లాభ నష్టాలు... 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభపడ్డాయి. 1,455 షేర్లు లాభాల్లో, 1,234 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్... టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,533 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,498 కోట్లుగా నమోదయ్యింది. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ఈ విలువ రూ.1,87,153 కోట్లు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.38 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.564 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
మారిన లెక్క.. పెరిగిన జీడీపీ
* గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంపు * 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మారిన ఫలితం న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడంతో గత సంవత్సరాల జీడీపీ వృద్ధి రేట్లను పెంచుతూ సవరించారు. ఈ మార్పుతో 2013-14 జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. 12-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది. వరుసగా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం విలువ రూపంలో ఈ పరిమాణాలు రూ.92.8 లక్షల కోట్లు, రూ.99.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కొత్త బేస్ ఇయర్ ప్రకారం ప్రస్తుత ధరలపై జీడీపీ పరిమాణం ఈ రెండు సంవత్సరాల్లో రూ. 99.88 లక్షల కోట్లు, రూ. 113.45 లక్షల కోట్లుగా వుంది. 2011-12 మార్కెట్ ధరల ప్రాతిపదికన తాజా బేస్ ఇయర్ అమల్లోకి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ గురించి మరింత స్పష్టమైన చిత్రం రావడానికి గణాంకాల మంత్రిత్వశాఖ బేస్ ఇయర్‌ను మార్చింది. చీఫ్ స్టాటిస్టీషియన్ టీసీఏ అనంత్ ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. జీడీపీ డేటా కోసం ఇప్పటి వరకూ బేస్ ఇయర్ 2004-2005 కాగా, తాజాగా 2011-2012కు మార్చారు. అంటే జాతీయ గణాంకాలు 2004-2005 స్థిర ధరలు కాకుండా 2011-2012 ఆర్థిక సంవత్సరంలోని స్థిర ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. బేస్ ఇయర్ అంటే... వివిధ రంగాలకు సంబంధించిన గణాంకాలకు ఒక నిర్దిష్ట ఏడాదిని మూలంగా తీసుకుని అప్పటి ధర/విలువ ప్రాతిపదికన తదుపరి ప్రతి ఏడాదీ పెరిగే ధర/విలువ వృద్ధి తీరును పరిశీలించడం జరుగుతుంది. పెరుగుదలను శాతాల్లో చూపుతారు. ఈ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరాన్నే ‘బేస్ ఇయర్’ అంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతీయ అకౌంట్ల గణాంకాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చాలని జాతీయ గణాంకాల కమిషన్(ఎన్ఎస్సీ) సిఫారసు చేసింది. ఇప్పటి వరకూ 10 ఏళ్లకు ఒకసారి ఈ మార్పు ఉండేది. గతంలో బేస్ ఇయర్‌ను 2010 జనవరిలో కేంద్ర ప్రభుత్వం మార్చింది. ద్రవ్యలోటుపై ఎఫెక్ట్... బేస్ రేటు మార్పు నేపథ్యంలో భారీగా పెరగనున్న ఆర్థిక పరిమాణం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు(ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాలకు మధ్య నున్న వ్యత్యాసం) ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా 4.1 శాతం వద్ద కట్టడి చేయడం సాధ్యమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, స్థిర ధరల ప్రకారం ఆర్థిక పరిమాణం పెరిగినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ఆర్థిక వృద్ధి పరిమాణం తగ్గడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై బేస్ రేటు మార్పు ప్రభావం ఉండకపోవచ్చని చీఫ్ స్టాటిస్టీషియన్ ఏసీఏ అనంత్ పేర్కొన్నారు. తలసరి ఆదాయం నెలకు రూ.80 వేలు బేస్ ఇయర్ మార్పు ప్రాతిపదికన కరెంట్ ప్రైసెస్ వద్ద చూస్తే, వార్షికంగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఈ మొత్తం 2011-12, 2012-13, 2013-14లలో వరుసగా, రూ.64,316, రూ.71,593, రూ.80,388గా ఉంది. 12 ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ: కేంద్రం భారత్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శుక్రవారం తెలిపారు. 10-12 సంవత్సరాల శ్రేణిలో దేశ ఆర్థిక పరిమాణం 4 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన అంచనావేశారు. భారత ప్రైవేటు వెంచర్ కేపిటల్ అసోసియేషన్ ఇక్కడ జరిపిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోకి భారీగా పెద్ద ఎత్తున కేపిటల్ పెట్టుబడులు(ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) వస్తున్న నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్టంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. రానున్న బడ్జెట్లో పన్ను సంబంధ సమస్యలను తగిన విధంగా ఎదుర్కొనేలా చర్యలు ఉంటాయని విదేశీ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ముంబైని సింగపూర్, లండన్ తరహాలో దిగ్గజ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. అది మా క్రెడిట్... చిదంబరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని జీడీపీ సవరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
హెచ్చుతగ్గులు కొనసాగుతాయ్
* క్యూ3 ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి * పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు కీలకం న్యూఢిల్లీ: టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థికవ్యవస్థకు సంబంధించిన గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని నిపుణులు చెపుతున్నారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్‌లు 2014 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ వారం ఫలితాల్ని వెల్లడించనున్నాయి. అలాగే నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), డిసెంబర్ నెలకు వినియోగ, టోకు ద్రవ్యోల్బణాల గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. సోమవారం ఐఐపీ, వినియోగ ద్రవ్యోల్బణం డేటా, బుధవారం టోకు ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడవుతాయి. ఈ డేటాతో పాటు టీసీఎస్, రిలయన్స్, విప్రో తదితర కంపెనీల ఫలితాల్ని ఇన్వెస్టర్లు గమనించి, అందుకు అనుగుణంగా ట్రేడింగ్ నిర్ణయాల్ని తీసుకుంటారని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. గతవారం మార్కెట్లో పెరిగిన షేర్లకంటే తగ్గిన షేర్ల సంఖ్య అధికంగా వున్నందున, సమీప భవిష్యత్తులో సూచీల హెచ్చుతగ్గులు ఈ వారం కూడా కొనసాగుతాయని ఆయన అంచనావేశారు. అమెరికా జాబ్స్ డేటాకు అనుగుణంగా సోమవారం మార్కెట్లు ప్రారంభమవుతాయని, అటుతర్వాత భారత్‌లో విడుదలయ్యే గణాంకాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురికావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో విడుదలైన డేటా ప్రకారం డిసెంబర్ నెలలో అక్కడి నిరుద్యోగం రేటు 5.6 శాతానికి తగ్గింది. అయితే డేటా అనుకూలంగా వున్నా, అమెరికా సూచీలు ఆ రోజున క్షీణించాయి. అలాగే చమురు ధరల పతనం, గ్రీసు సంక్షోభం వంటి అంతర్జాతీయ రిస్కులు ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతూనే వున్నందున, ఈ అంశాలకు సంబంధించిన వార్తలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో ఫండ్ మేనేజర్ హిరేన్ ధకాన్ చెప్పారు. అమ్మకాల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు... గతేడాది భారత్ మార్కెట్లో భారీ పెట్టుబడిపెట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టరు ్ల(ఎఫ్ఐఐలు) కొత్త ఏడాది ప్రారంభంలో మాత్రం అమ్మకాలు జరుపుతున్నారు. జనవరి నెలలో ఇప్పటిదాకా ఈక్విటీల్లో రూ.1,673 కోట్ల నికర విక్రయాలు జరపగా, రూ. 2,620 కోట్ల విలువైన బాండ్లను నికరంగా కొనుగోలు చేశారు. గతేడాది ఎఫ్ఐఐలు బాండ్లు, ఈక్విటీల్లో మొత్తంరూ. 2.58 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.