రాష్ట్రానికి మరిన్ని రుణాలు!
సాక్షి, హైదరాబాద్: స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్‌డీపీ) గణనలో మార్పులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు 2004-05లో ఉన్న స్థిరధరల ప్రాతిపదికన కేంద్రం జీఎస్‌డీపీని లెక్కిస్తుండగా... ఇక నుంచి 2011-12 ధరలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ప్రతిపాదిత సంవత్సరం (బేస్ ఇయర్)ను మార్చడం వల్ల జీఎస్‌డీపీ గణాంకాల్లో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు పెరిగే అవకాశమున్నందున రుణ పరిమితికి వెసులుబాటు లభించనుంది. ఈ మార్పు నేపథ్యంలో ఇటీవలే అన్ని రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో అర్థగణాంక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి మదింపులో జీఎస్‌డీపీ కీలకమైన సూచిక. రాష్ట్ర భౌగోళిక హద్దుల లోపల నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల మొత్తం విలువను డబ్బు రూపంలో లెక్కించినప్పుడు స్థూల రాష్ట్రోత్పత్తి వస్తుంది. ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు)గా వర్గీకరించి ఆయా రంగాల వారీగా వృద్ధిని మదింపు చేస్తారు. ఏటా స్థిరధరల ప్రాతిపదికతో పాటు వర్తమాన ధరల లెక్కన కూడా జీఎస్‌డీపీని అంచనా వేస్తారు.
2004-05 స్థిరధరల ప్రాతిపదికన 2014-15లో తెలంగాణ స్థూల రాష్ట్రోత్పత్తి రూ.2,17,432 కోట్లుగా అంచనా వేశారు. 2013-14లో స్థూల రాష్ట్రోత్పత్తి రూ.2,06,427 కోట్లు. దీన్ని బట్టి 5.3 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు నిర్ధారించారు. అంతకు ముందు ఏడాది తెలంగాణలో 4.8 శాతం అభివృద్ధి సాధించగా... 2011-12లో 4.1 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద 2014-15 జీఎస్‌డీపీని రూ.4,30,599 కోట్లుగా అంచనా వేసినట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. గత ఏడాది ఇది రూ.3,91,751 కోట్లు మాత్రమే.
3.5 శాతానికి పెంచాలి...
జీఎస్‌డీపీ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎస్‌డీపీలో 3 శాతానికి మించకుండా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. అయితే తాజాగా జీఎస్‌డీపీ గణనకు బేస్ ఇయర్‌ను మార్చితే.. స్థూల రాష్ట్రోత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అదే దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతుందని.. అదనంగా అప్పు తీసుకునే వెసులుబాటు వస్తుందని పేర్కొంటున్నారు. జీఎస్‌డీపీ లెక్కింపునకు సంబంధించి వచ్చే నెలలో మరోసారి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అది పూర్తయితే జీఎస్‌డీపీ గణన విధానంపై మరింత స్పష్టత వస్తుందని, తాజా గణనను కొత్త విధానంలో చేపట్టాల్సి ఉంటుందని రాష్ట్ర అర్థగణాంక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.