
2023–24లో జీఎస్డీపీ విలువ రూ.15,01,981 కోట్లు
దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్డీపీ వాటా 5.1%
2014–15 నుంచి 2023–24 మధ్యకాలంలో 196% వృద్ధి
3.5 కోట్ల రాష్ట్ర జనాభాలో 1.5 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి
రాష్ట్ర అర్థగణాంక నివేదికలో వెల్లడించిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 2023–24లో 14.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.15,01,981 కోట్లు. మొత్తం దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో రాష్ట్ర జీఎస్డీపీ వాటా 5.1 శాతం. దేశ జనాభాలో రాష్ట్రం వాటా కేవలం 2.8 శాతమే అయినా జీడీపీలో మాత్రం 5.1 శాతం వాటాను కలిగి ఉండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తెలంగాణ అర్థగణాంక నివేదిక–2024లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీఎస్డీపీ. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా జీఎస్డీపీని పరిగణిస్తారు. 2022–23తో పోల్చితే 2023–24లో రాష్ట్రం 14.5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దశాబ్ద కాలంలో 196% వృద్ధి
రాష్ట్ర జీఎస్డీపీ 2014–15లో రూ.5,05,849 కోట్లు ఉండగా, 2023–24 నాటికి రూ.15,01,981 కోట్లకు వృద్ధి చెందింది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర జీఎస్డీపీ 196.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో దేశ జీడీపీ మాత్రం 136.89 శాతం మాత్రమే వృద్ధి చెందింది. తెలంగాణ ఆవిర్భావానికి రెండేళ్ల ముందు ఈ ప్రాంతం 12.1శాతం జీఎస్డీపీ వృద్ధి రేటును కలిగి ఉండగా, నాటి దేశ జీడీపీతో పోలిస్తే 1.3 శాతం తక్కువే. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15 నుంచి 2023–24 మధ్యకాలంలో రాష్ట్రం సగటున ఏటా 12.9 శాతం వృద్ధి రేటును సాధిస్తోంది. జాతీయ సగటు కంటే ఇది 2.6 శాతం అధికం. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా సైతం 4.1 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది.
వృద్ధిలో సేవల రంగం టాప్
రాష్ట్ర జనాభాలో 45.8 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం, అనుబంధ రంగాలు 2023–24లో 5.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే రాష్ట్ర జీఎస్డీపీ విలువలో ఈ రంగాలు 15.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇదే కాలంలో పరిశ్రమల రంగం 9.2 శాతం, సేవల రంగం 19.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జాతీయస్థాయిలో పరిశ్రమల రంగం 8.7 శాతం, సేవల రంగం 9.6శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.
తలసరి ఆదాయంలో టాప్
2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564 కాగా, దేశ తలసరి ఆదాయం రూ.1,84,205 మాత్రమే. రాష్ట్ర తలసరి ఆదాయంతో పోల్చితే జాతీయ తలసరి ఆదాయం రూ.1,72,359 తక్కువ కావడం గమనార్హం. 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం 14.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014–15లో రూ.1,24,104 ఉండగా, 2023–24 నాటికి 187.3 శాతం వృద్ధితో రూ.3,56,564కు పెరిగింది. ఇదే కాలంలో దేశ తలసరి ఆదాయం కేవలం 112.59 శాతం వృద్ధినే సాధించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు కావడానికి ఆరేళ్లు పడుతుండగా, దేశ తలసరి ఆదాయానికి ఎనిమిదేళ్లు పడుతోంది. రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉండగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 1.5 కోట్ల మంది పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment