సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు లక్ష రూపాయలకు చేరువైంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో తీసుకునేవి కలిపి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,57,059 కోట్లకు (పూచీకత్తు రుణాలు కాకుండా) చేరనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరి తలపై అప్పు రూ.98,033కు చేరనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనాల మేరకు తలసరి అప్పు రూ.94 వేలు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు వేలు పెరుగుతోంది. ఇక ప్రభుత్వం పూచీకత్తులు ఇచ్చి కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలనూ కలిపితే.. తలసరి అప్పు మరో రూ.30వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
జీఎస్‌డీపీతో పోలిస్తే తగ్గుదల
కాగా, రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బడ్జెట్ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో అప్పుల శాతం తగ్గుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీఎస్‌డీపీలో 25.4 శాతం అప్పు ఉండగా, అదే 2023–24 సంవత్సరం ముగిసే సమయానికి ఇది జీఎస్‌డీపీలో 23.8 శాతానికి తగ్గుతుండడం గమనార్హం. ఇదే క్రమంలో 2021–22, 2022–23 సంవత్సరాల్లో కూడా జీఎస్‌డీపీలో అప్పుల శాతం తగ్గిందన్నమాట.
వడ్డీల చెల్లింపులకే రూ.22,407 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పులకు వడ్డీల కింద ఈసారి రూ.22,407.67 కోట్లు చెల్లించనుంది. 2022–23లో వడ్డీల కింద రూ.18,911 కోట్లు చెల్లించగా.. ఈసారి మరో రూ.3,500 కోట్ల మేర పెరిగాయి.
►ఇక రుణాల తిరిగి చెల్లింపుల కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.12,606 కోట్లను చూపింది. ఇందులో ప్రజా రుణం కింద రూ.9,341.17 కోట్లు,, కేంద్రం నుంచి తీసుకునే రుణాలకు రూ.427.16 కోట్లు, ఇతర రుణాలకు రూ.2,837.76 కోట్లు తిరిగి చెల్లించనుంది.
తగ్గిన పూచీకత్తు రుణాలు!
2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–23లో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలకు రుణాల కోసం ప్రభుత్వమిచ్చిన పూచీకత్తులు తగ్గిపోయాయి. 2021–22 ముగిసే నాటికి ప్రభుత్వ పూచీకత్తులు మొత్తం రూ.1,35,282.51 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.1,29,243.60 కోట్లకు తగ్గాయి. పూచీకత్తు ఇచ్చి కార్పొరేషన్లు, సంస్థల పేరిట తీసుకునే రుణాలనూ ఎఫ్‌ఆర్బీఎం కింద రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామన్న కేంద్ర నిబంధనే దీనికి కారణం.
దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ కార్పొరేషన్‌కూ పూచీకత్తు ఇవ్వలేదు. ఇదే సమయంలో గత ఏడాది ఇచ్చిన పూచీకత్తుల అసలులో కొన్ని నిధులు చెల్లించడంతో.. 2022–23లో ప్రభుత్వ గ్యారెంటీలు రూ.6 వేల కోట్ల మేర తగ్గాయి. మొత్తంగా పూచీకత్తులతో కలిపి రాష్ట్ర రుణం రూ.4,52,235 కోట్లకు చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment