వృద్ధి రేటు ఉరకలు | telangana growth rate in positive way | Sakshi
Sakshi News home page

వృద్ధి రేటు ఉరకలు

Published Sun, Jan 8 2017 3:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

వృద్ధి రేటు ఉరకలు

వృద్ధి రేటు ఉరకలు

♦ తొలి అర్ధ వార్షికంలో జీఎస్‌డీపీ 10.2 శాతం
ఫైనాన్స్, స్థిరాస్తి, వృత్తి సేవల రంగాలదే కీలక పాత్ర
జాతీయ సగటు కన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ఉరకలేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రాష్ట్రంలో 10.02 శాతం ఆర్థిక వృద్ధి రేటు నమోదయింది. 2015–16 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) రూ.1,94,824 కోట్లుగా నమోదు కాగా.. 2016–17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో జీఎస్‌డీపీ రూ.2,14,608 కోట్లకు పెరిగింది. జాతీయ స్థాయితో పోల్చినా రాష్ట్రం మెరుగైన వృద్ధి రేటు సాధించింది. 2015–16 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ.51,03,530 కోట్లుగా స్థూల జాతీయ ఉత్పత్తి రేటు(జీడీపీ) 2016–17 తొలి అర్ధ భాగంలో రూ.54,70,837 కోట్లకు చేరింది. ఈ లెక్కన జాతీయ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది. 2016–17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగానికి సంబంధించి రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన వృద్ధి రేటు నివేదికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం సచివాలయంలో విడుదల చేశారు.
 
జాతీయ వృద్ధి కంటే మెరుగే..
జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రం దాదాపు అన్ని రంగాల్లో మెరుగైన వృద్ధి రేటుతో ముందంజలో ఉంది. ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాష్ట్రం 4.7 శాతంతో మెరుగ్గా నిలిచింది. ఈ రంగాల్లో జాతీయ వృద్ధి రేటు 2.5 శాతమే. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాష్ట్ర ఉత్పత్తుల విలువ రూ.16,114 కోట్లు. మైనింగ్, క్వారియింగ్‌ రంగాల్లో రాష్ట్రం 5.4 శాతం వృద్ధిని రాబట్టగా, జాతీయ వృద్ధి –0.9 శాతంగా నమోదైంది. ఈ రంగాల్లో రాష్ట్ర ఉత్పత్తుల విలువ రూ.6,444 కోట్లు. 
 
ద్వితీయ రంగాలైన.. ఉత్పత్తి రంగంలో రాష్ట్రం 8.3 శాతం వృద్ధి రాబట్టగా.. జాతీయ వృద్ధి రేటు సైతం 8.1 శాతం నమోదైంది. రాష్ట్ర ఉత్పత్తి రంగం విలువ రూ.32,085 కోట్లు. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లో రాష్ట్రం 6.3 శాతం వృద్ధిని సాధించగా జాతీయ వృద్ధి రేటు 6.4 శాతంగా నమోదైంది. ఈ రంగాల్లో రాష్ట్ర ఉత్పత్తుల విలువ రూ.3,560 కోట్లు. నిర్మాణ రంగంలో రాష్ట్రం 6.6 శాతం వృద్ధిని నమోదు చేయగా, జాతీయ వృద్ధి రేటు 2.5 శాతం మాత్రమే ఉందని రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. నిర్మాణ రంగంలో రాష్ట్ర ఉత్పత్తుల విలువ రూ.12,830 కోట్లు.
 
తృతీయ రంగాలైన ఆర్థిక, స్థిరాస్తి, వృత్తి సేవల రంగాల్లో రాష్ట్రం ఎప్పటిలాగే అత్యధికంగా 13.1 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ రంగాల్లో జాతీయ వృద్ధి రేటు 8.8 శాతమే. ఈ రంగాల్లో రాష్ట్ర ఉత్పత్తుల విలువ రూ.65,047 కోట్లు. పరిపాలన, రక్షణ, ఇతర సేవల రంగాల్లో రాష్ట్రం 11.8 శాతం వృద్ధిని సాధించగా, జాతీయ వృద్ధి రేటు 12.4 శాతంతో కాస్త మెరుగ్గా నిలిచింది. ఈ రంగాల్లో రాష్ట్ర ఉత్పత్తుల విలువ 29,924 కోట్లు. వ్యాపారం, రవాణా, హోటల్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో రాష్ట్రం 10.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా, జాతీయ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. ఈ రంగాల్లో రాష్ట్ర ఉత్పత్తుల విలువ రూ.48,604 కోట్లు.
 
వృద్ధి రేటు అంటే..?
రాష్ట్ర అభివృద్ధిని అంచనా వేసేందుకు వృద్ధి రేటును ప్రామాణికంగా తీసుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఓ ఏడాది/ త్రైమాసికం/అర్ధ వార్షికంలో లభించిన ఉత్పత్తులకు ప్రస్తుత, స్థిర ధరల్లో విలువ కట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)ని లెక్కిస్తారు. 2011–12 స్థిర ధరలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రణాళిక విభాగం 2016–17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగానికి సంబంధించిన జీఎస్‌డీపీని లెక్క గట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement