హెచ్చుతగ్గులు కొనసాగుతాయ్
* క్యూ3 ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
* పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు కీలకం
న్యూఢిల్లీ: టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థికవ్యవస్థకు సంబంధించిన గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని నిపుణులు చెపుతున్నారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్‌లు 2014 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి ఈ వారం ఫలితాల్ని వెల్లడించనున్నాయి.
అలాగే నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), డిసెంబర్ నెలకు వినియోగ, టోకు ద్రవ్యోల్బణాల గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. సోమవారం ఐఐపీ, వినియోగ ద్రవ్యోల్బణం డేటా, బుధవారం టోకు ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడవుతాయి. ఈ డేటాతో పాటు టీసీఎస్, రిలయన్స్, విప్రో తదితర కంపెనీల ఫలితాల్ని ఇన్వెస్టర్లు గమనించి, అందుకు అనుగుణంగా ట్రేడింగ్ నిర్ణయాల్ని తీసుకుంటారని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. గతవారం మార్కెట్లో పెరిగిన షేర్లకంటే తగ్గిన షేర్ల సంఖ్య అధికంగా వున్నందున, సమీప భవిష్యత్తులో సూచీల హెచ్చుతగ్గులు ఈ వారం కూడా కొనసాగుతాయని ఆయన అంచనావేశారు.
అమెరికా జాబ్స్ డేటాకు అనుగుణంగా సోమవారం మార్కెట్లు ప్రారంభమవుతాయని, అటుతర్వాత భారత్‌లో విడుదలయ్యే గణాంకాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురికావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో విడుదలైన డేటా ప్రకారం డిసెంబర్ నెలలో అక్కడి నిరుద్యోగం రేటు 5.6 శాతానికి తగ్గింది. అయితే డేటా అనుకూలంగా వున్నా, అమెరికా సూచీలు ఆ రోజున క్షీణించాయి. అలాగే చమురు ధరల పతనం, గ్రీసు సంక్షోభం వంటి అంతర్జాతీయ రిస్కులు ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతూనే వున్నందున, ఈ అంశాలకు సంబంధించిన వార్తలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో ఫండ్ మేనేజర్ హిరేన్ ధకాన్ చెప్పారు.
అమ్మకాల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు...
గతేడాది భారత్ మార్కెట్లో భారీ పెట్టుబడిపెట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టరు ్ల(ఎఫ్‌ఐఐలు) కొత్త ఏడాది ప్రారంభంలో మాత్రం అమ్మకాలు జరుపుతున్నారు. జనవరి నెలలో ఇప్పటిదాకా ఈక్విటీల్లో రూ.1,673 కోట్ల నికర విక్రయాలు జరపగా, రూ. 2,620 కోట్ల విలువైన బాండ్లను నికరంగా కొనుగోలు చేశారు. గతేడాది ఎఫ్‌ఐఐలు బాండ్లు, ఈక్విటీల్లో మొత్తంరూ. 2.58 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.