న్యూఢిల్లీ: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి మినహాయింపు రహిత పన్ను వ్యవస్థను త్వరలో సమీక్షించాలని ఆర్థికశాఖ ప్రతిపాదిస్తోంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుకు ఈ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మలచడం దీని లక్ష్యమని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
ఎటువంటి మినహాయింపులు లేని పన్ను వ్యవస్థ ఆవిష్కరణ దిశగా నడవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. తద్వారా మినహాయింపులు, తగ్గింపులతో కూడిన సంక్లిష్టమైన పాత పన్ను విధానం రద్దు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► గత 2020–21 వార్షిక బడ్జెట్ ఒక కొత్త పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వివిధ మినహాయింపులతో కూడిన పాత పన్ను వ్యవస్థ లేదా మినహాయింపులు, తగ్గింపులు లేని తక్కువ పన్ను రేట్లను అందించే కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించింది.
► వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, ఆదాయపు పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడం ఈ చర్య ఉద్దేశం.
►కొత్త పన్ను వ్యవస్థకు సంబంధించి ఎదురయిన అనుభవాలను బట్టి చూస్తే.. తమ గృహ, విద్యా రుణ బాధ్యతలను పూర్తి చేసుకున్న వ్యక్తులు... ‘క్లెయిమ్ చేయడానికి ఎటువంటి మినహాయింపులు లేనందున’ కొత్త పన్ను విధానంలోకి మారడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.
► కొత్త వ్యవస్థలో పన్నులను తగ్గించడం వల్ల... ఈ విధానం ఆకర్షణీయంగా మారుతుందని పలు వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త పన్ను వ్యవస్థ రేట్లు ఇలా...
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించి 2020 ఫిబ్రవరి 1న ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయానికి పన్ను రేటు 5 శాతంగా ఉంది. రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం తగ్గిన పన్ను రేటును చెల్లించాలి. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు 20 శాతం, రూ.12.5 లక్షలు– రూ.15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు 25 శాతం, రూ.15 లక్షలపైబడినవారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కార్పొరేట్ విషయంలో...
రేట్లను గణనీయంగా తగ్గించడం, మినహాయింపులను తొలగించడం ద్వారా కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల కోసం ఇదే విధమైన పన్ను విధానాన్ని సెప్టెంబర్ 2019లో ప్రవేశ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలకు బేస్ కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటై, 31 మార్చి 2024లోపు కార్యకలాపాలను ప్రారంభించిన తయారీ కంపెనీలకు పన్ను రేట్లను 25 శాతం నుండి 15 శాతానికి కేంద్రం తగ్గించింది.
చదవండి👉 Form 16a: పన్ను చెల్లింపులు కనిపించడం లేదా? అప్పుడేం చేయాలి?
Comments
Please login to add a commentAdd a comment